దీక్షల్లో పాల్గొన్న బహుజన పరిరక్షణ సమితి నేతలు
తాడికొండ: అమరావతి ప్రాంతం చంద్రబాబు తన సొంత జాగీరుగా భావిస్తూ.. ఈ ప్రాంతంలో దళితులకు ఇళ్ల పట్టాలు రాకుండా అడ్డుకుంటున్నారని బహుజన పరిరక్షణ సమితి నాయకులు మండిపడ్డారు. మూడు రాజధానులకు మద్దతుగా గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్‌లో చేపట్టిన దీక్షలు బుధవారం నాటికి 92వ రోజుకు చేరాయి. పలువురు నాయకులు మాట్లాడుతూ.. రాజ్యాంగం ద్వారా బలహీన వర్గాలకు అంబేడ్కర్ కల్పించిన హక్కులను కోర్టుల ద్వారా చంద్రబాబు అడ్డుకోవడం దుర్మార్గమన్నారు.
కేసులను తక్షణం ఉపసంహరించుకుని పేదలకు సహకరించకపోతే దళితులంతా ఏకమై చంద్రబాబును రాష్ట్రంలో తిరగకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రమంతటా 31 లక్షల మంది నిరుపేదలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చలవతో ఇళ్ల పట్టాలు అందుకుని శాశ్వత గృహాల నిర్మాణానికి ముందుకెళుతుంటే.. అమరావతిలో మాత్రం చంద్రబాబు వేసిన తప్పుడు కేసులు కారణంగా పేదలు కన్నీరు కార్చాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. త్వరలో ఢిల్లీ వెళ్లి రాష్ట్రంలోని పేదలు, దళిత వర్గాలపై జరుగుతున్న వివక్షను, వ్యవస్థలను అడ్డుకుంటున్న చంద్రబాబు తీరును ప్రధానికి వివరిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment