సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా చరిత్రాత్మకమైన కులగణన ప్రక్రియను డిసెంబర్ 9వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తెలిపారు.
తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం వద్ద శుక్రవారం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మంత్రి వేణు మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జనగణన తప్ప కులగణన జరగలేదని చెప్పారు. సామాజిక సాధికారితకు చిరునామాగా నిలిచిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గొప్ప సంకల్పంతో కులగణన చేపట్టాలని నిర్ణయించారని తెలిపారు.
కులాలతోపాటు అన్ని వర్గాల పేదల తలరాతలు మార్చడానికే సమగ్ర కులగణనను తమ ప్రభుత్వం చేపట్టిందని పునరుద్ఘాటించారు. ప్రజల జీవన స్థితిగతులను మార్చేందుకు కులగణన చాలా అవసరమని చెప్పారు. సమగ్ర కులగణనతో రాష్ట్రంలో పేదవాడి జీవితానికి భద్రత లభిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో నిర్వహించనున్న కులగణన దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని మంత్రి ధీమా వ్యక్తంచేశారు.
బీసీలను అణగదొక్కిన చంద్రబాబు
రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేపడుతున్నట్లు ప్రకటించడంతో చంద్రబాబు సహా ప్రతిపక్షనేతలకు వెన్నులో వణుకుపుడుతోందని మంత్రి వేణు అన్నారు. చంద్రబాబు హయాంలో బీసీలను కేవలం ఓట్లు వేసేందుకు పనికివచ్చే యంత్రాలుగా చూశారని మండిపడ్డారు. విద్య అవకాశాలను అందుకోలేని, ఆర్థికంగా బలహీనంగా ఉన్న బీసీలతోపాటు అనేక వర్గాలను చంద్రబాబు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి అణగదొక్కారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
చంద్రబాబు అధికారంలో ఉన్నాననే అహంకారంతో ‘మత్స్యకారులను తోలుతీస్తా. నాయీబ్రాహ్మణుల తోకలు కత్తిరిస్తా...’ అని అన్న మాటలు తనను ఎంతో బాధించాయని మంత్రి వేణు చెప్పారు. చంద్రబాబు వివక్షతో చూసిన కులాలను సీఎం వైఎస్ జగన్ అక్కున చేర్చుకున్నారని తెలిపారు. అట్టడుగు వర్గాల్లో ఆత్మన్యూనతాభావాన్ని తొలగించి వారు సగర్వంగా తలెత్తుకుని జీవించేలా సీఎం జగన్ అండగా నిలిచారని ప్రశంసించారు. కులగణనలో ఎవరి సూచనలు, సలహాలు తీసుకోలేదని టీడీపీ చేస్తున్న విమర్శల్లో నిజం లేదని మంత్రి కొట్టిపారేశారు.
కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లా, ప్రాంతీయ స్థాయిల్లో సమావేశాలు నిర్వహించి అన్ని కులాల నాయకుల అభిప్రాయాలు సేకరిస్తున్నామని, వాటిని క్రోడీకరించి కులగణను సమర్థవంతంగా నిర్వహిస్తామని వివరించారు. అవసరమైతే మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని ఆలోచన చేస్తున్నామని చెప్పారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్, అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకుంటే స్వాగతించాల్సిందిపోయి విమర్శించడం సరికాదని ఆయన హితవుపలికారు.
Comments
Please login to add a commentAdd a comment