సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణనపై కుతంత్రాలెందుకు అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను బీసీ సంఘాలు సూటిగా ప్రశ్నించాయి. దేశానికే ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన కులగణనను అడ్డుకునేందుకు పవన్ కుయుక్తులు పన్నడంపై బీసీల నేతలు మండిపడుతున్నారు. ఎన్నికల వేళ కుల గణన ఎందుకంటూ పవన్ ఎక్స్‌లో ఓ లేఖ ఉంచడంపై బీసీ సంఘాల నేతలు శనివారం అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నప్పటికీ దేశంలో కులగణన చేపట్టలేదని వారు గుర్తు చేశారు.
బీసీల ఆవేదనను అర్థం చేసుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రంలో కుల గణన చేపట్టారని తెలిపారు. బీసీలకు మేలు చేసేలా సీఎం జగన్ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని పెద్ద మనస్సుతో స్వాగతించాల్సిది పోయి పెడర్ధాలు తీసి అడ్డుకునే కుట్రలు చేయడం తగదని బీసీ నేతలు స్పష్టం చేస్తున్నారు. పలువురు బీసీ నేతలు ఏమన్నారంటే.. వారి మాటాల్లోనే..
పవన్ బీసీ వ్యతిరేకి అని మరోమారు తేటతెల్లమైంది
పవన్ కళ్యాణ్ బీసీ వ్యతిరేకి అని మరోమారు తేటతెల్లమైంది. బీసీల మేలు కోరి సీఎం వైఎస్ జగన్ పెద్ద మనస్సుతో కుల గణన చేపట్టారు. దాన్ని అడ్డుకునేందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని పవన్ అనడం ఆయన సంకుచిత వైఖరికి అద్దంపడుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో పేద పిల్లల కోసం సీఎం జగన్ ఇంగ్లిష్ మీడియం పెడితే చంద్రబాబు ప్రోద్బలంతో కోర్టులో కేసులు వేయించారు.
ఇప్పుడు కుల గణనను అడ్డుకునేందుకు కోర్టులో వేస్తానని పవన్ అంటున్నాడు. అంటే చట్టాలు చంద్రబాబు, పవన్‌కు ఏమైనా చుట్టాలా? పేదలకు మంచి జరిగితే సహించకుండా కోర్టుల్లో వేస్తామనడం సరైనదేనా? మహాత్మ జ్యోతిరావు పూలే, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, నారాయణ గురు, సాహు మహారాజ్, పెరియర్ రామస్వామి వంటి మహనీయుల ఆలోచనలను అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్.
రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలనే తపనతో సీఎం జగన్ అనేక విప్లవాత్మక కార్యక్రమాలు చేపడుతున్నారు. వాటిని చూసి సహించలేక చంద్రబాబు, పవన్ కుట్రలు, కుతంత్రాలతో వ్యవహరిస్తున్నారు. బీసీల పట్ల దుర్మార్గంగా వ్యహరిస్తున్న చంద్రబాబు, పవన్‌కు తగిన గుణపాఠం చెబుతాం. – చింతపల్లి గురుప్రసాద్, బీసీ కులాల జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్
రాజకీయాలకు అతీతంగా సహకరించాలి
జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీలు విద్య, ఉపాధి రంగాల్లో తగిన వాటా పొంది అభివృద్ధి చెందాలంటే జన గణనలో కులగణన చాలా కీలకం. పదేళ్లకు ఒకసారి నిర్వహించే జన గణనలో కులం కాలమ్ చేర్చి బీసీల లెక్కలు తేల్చాలని దశాబ్దాల తరబడి జాతీయ స్థాయిలో అనేక పోరాటాలు చేస్తున్నాం. దేశంలోని అనేక బీసీ సంఘాలు జాతీయ స్థాయిలో ఉద్యమాలు చేస్తూనే ఉన్నాయి. తాజాగా దేశంలో నిర్వహించాల్సిన జన గణనలో కులం కాలమ్ పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించడంలేదు.
కులగణన చేపట్టాలని కేంద్రాన్ని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి మరీ పంపించింది. అయినా కేంద్రం నుంచి సానుకూల స్పందన లేదు. కేంద్ర నిర్ణయం కోసం చూడకుండా రాష్ట్రంలోనైనా కుల గణన చేపట్టి దేశానికి ఆదర్శంగా నిలిచేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కుల గణన ప్రారంభమైంది.
బీహార్ తర్వాత ఏపీలోనే కుల గణన చేపట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంతో పరిణతితో ఈ కార్యక్రమం చేపట్టారు. దీన్ని అభినందించాల్సింది పోయి కోర్టులకు వెళ్లి అడ్డుకుంటామనే తీరు సరికాదు. న్యాయపరమైన సమస్యలు సృష్టిస్తే కులగణన ఆగితే బీసీలకు తీవ్ర అన్యాయం చేసినవారవుతారు. ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా ఆలోచించి కుల గణనకు సహకరించి బీసీలకు మేలు జరిగేలా చూడాలి. – కేశన శంకరరావు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
సీఎం జగన్ దేశానికే ఆదర్శం
ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక న్యాయం (సోషల్ జస్టిస్)ను అమలు చేస్తున్న సీఎం వైఎస్ జగన్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం ఆయన చేపట్టిన అనేక విప్లవాత్మక చర్యలు దేశంలోని అనేక రాష్ట్రాలు అనుసరించేలా ఉన్నాయి. దేశంలో కుల గణన చేపట్టకపోవడంతో రాష్ట్రంలో సీఎం జగన్ చేసి చూపిస్తున్నారు. ఈ చారిత్రక కార్యక్రమానికి రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరించాలి. అడ్డుకునే ప్రయత్నాలు చేయడం సరికాదు. కుల గణనను అడ్డుకునే రాజకీయ పార్టీలు బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదు. – ఎన్‌వీ రావు, ఇంటర్నేషనల్ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు
బాబు, పవన్‌కు బీసీలు బుద్ధి చెబుతారు
రాజకీయ దుర్బుద్ధితో కుల గణనను అడ్డుకుంటే చంద్రబాబు, పవన్‌కు బీసీలు బుద్ధి చెబుతారు. బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుని చంద్రబాబు దగా చేశాడు. ఇప్పుడు అధికారం లేకుండానే టీడీపీ, జనసేన బీసీల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయి. చంద్రబాబు డైరెక్షన్‌లోనే మాట్లాడుతున్న పవన్ ఇప్పుడు కుల గణనను అడ్డుకునేలా కోర్టుకు వెళ్తానని అంటున్నాడు. కుల గణనతో బీసీలకు మేలు జరగడాన్ని కూడా వీళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. బీసీలకు అండగా నిలుస్తున్న సీఎం జగన్‌కు వెన్నుదన్నుగా నిలిచి సత్తా చూపిస్తాం. – కాసగాని దుర్గారావు, బీసీ నాయకుడు
Comments
Please login to add a commentAdd a comment