జగనన్నే నా ఇద్దరు బిడ్డలను చదివిస్తున్నారు. ఆడపిల్లలను నా చేతిలో పెట్టి నా భర్త పదేళ్ల క్రితమే కాలం చేశాడు. ఇద్దరిని చదివించడం నా శక్తికి మించిన పని. జగనన్న చలువతో నా పెద్ద కూతురు ప్రియాంక బీకామ్ రెండో సంవత్సరం చదువుతోంది. విద్యా దీవెన కింద ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి రూ.2,875 లెక్కన ఇప్పటికి ఐదు పర్యాయాలు అందించింది. వసతి దీవెన కింద రూ.10 వేలు వంతున అందిస్తోంది. నా రెండో కూతురు మనీషా ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. అమ్మ ఒడి నగదుతో ఈ అమ్మాయిని చదివిస్తున్నాం.
-కుమార్తె ప్రియాంకతో తల్లి ప్రభావతి, పుత్తూరు
నేను వ్యవసాయ కూలీని. నా కుమార్తె దీప్తి చిత్తూరులోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతోంది. ప్రభుత్వ సాయంతోనే బిడ్డను చదివించుకోగలుగుతున్నాం. పాపకు విద్యాదీవెన నగదు అందుతోంది. పేద పిల్లల చదువుకు భరోసా ఇస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రుణం ఎప్పటికీ తీర్చుకోలేం. జీవితాంతం ఆయన వెంట నడుస్తాం.
-శివయ్య. జంగాలపల్లె, ఐరాల మండలం
మాది వైఎస్సార్ జిల్లా బద్వేలు. మేము ఐదుగురు అక్కచెల్లెళ్లం. మా నాన్న వ్యవసాయ కూలీ. ఇల్లు గడవడమే కష్టం. మమ్మల్ని పదోతరగతి వరకు చదివించేందుకు నానా అవస్థలు పడ్డారు. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మా చదువు కోసం దిగులు తప్పింది. అమ్మ ఒడి నగదుతో మా చెల్లెలు, విద్యాదీవెన పథకం ద్వారా నేను మా అక్క చక్కగా చదువుకుంటున్నాం. ప్రస్తుతం నేను తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో బీఎస్సీ థర్డ్ ఇయర్ చదువుతున్నా. జగనన్న అందిస్తున్న పథకాలతో మా చదువును కొనసాగించగలమనే భరోసా వచ్చింది.
– వి.దీప్తి, విద్యార్థిని, శ్రీపద్మావతి డిగ్రీ కళాశాల, తిరుపతి
చదువుకు పేదరికం అడ్డంకిగా మారకూడదు.. ఆర్థిక స్థోమత లేక ఒక్క విద్యార్థి కూడా విద్యకు దూరం కాకూడదు.. పిల్లల కలలు సాకారం చేసుకునేందుకు ఉన్నతంగా చదువుకోవాలి.. ఆధునిక సమాజంలో అత్యున్నతంగా ఎదగాలి.. పోటీ ప్రపంచంలో దీటుగా రాణించాలి. మేలైన అవకాశాలు అందుకుని రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలి’’.. ఇదే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్యావిప్లవానికి తెరతీశారు.
అందులో భాగంగా పేద పిల్లల ఉన్నత చదువుల కోసం జగనన్న విద్యాదీవెన పథకం ప్రారంభించారు. ఏటా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్ నగదును జమ చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ మైదానంలో ఏర్పాటు చేసిన సభా వేదిక నుంచి దీవెన సొమ్మును లబ్ధిదారులకు అందించేందుకు శ్రీకారం చుట్టనున్నారు.
సాక్షి, చిత్తూరు కలెక్టరేట్/తిరుపతి అర్బన్: ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. విద్యాదీవెన పథకంతో సకాలంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ చేస్తూ భరోసా కల్పిస్తోంది. అందులో భాగంగా 2021–22 విద్యాసంవత్సరంలో జనవరి– మార్చికి సంబంధించి నగదు సాయం అందించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు తిరుపతి వేదికగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ము జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్
ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అర్హులైన పేద విద్యార్థులందరికీ విద్యాదీవెన పథకం కింద లబ్ధి చేకూర్చనున్నారు. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు.
కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా..
ఒక కుటుంబంలో ఎంత మంది పిల్లలు ఉన్నత చదువులు చదువుతున్నప్పటికీ ప్రభుత్వం జగనన్న విద్యాదీవెన పథకం వర్తింపజేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సకాలంలో నిధులను తల్లుల ఖాతాల్లో జమచేస్తోంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి నగదును నేరుగా అందించడం ద్వారా పిల్లల చదువులు, కళాశాలల్లో మౌళిక వసతులను తల్లిదండ్రులు పరిశీలించే అవకాశం ఉంటుందని విద్యావేత్తలు చెబుతున్నారు. కళాశాలల్లో ఏవైనా లోటుపాట్లు ఉంటే యాజమాన్యాలను ప్రశ్నించగలిగేలా అవకాశముంటుందని వెల్లడిస్తున్నారు. కాలేజీ యాజమాన్యాల్లో జవాబుదారీతనం, పిల్లల బాగోగులపై తల్లిదండ్రుల పర్యవేక్షణ రెండూ జరుగుతోందని వివరిస్తున్నారు.
షెడ్యూల్ ప్రకారం నగదు జమ
గత టీడీపీ ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని పూర్తి నిర్వీర్యం చేశారు. పిల్లల ఫీజు కట్టేందుకు తల్లిదండ్రులు అప్పులు చేయాల్సిన దుస్థితి కల్పించారు. విద్యార్థులను ఆయా కళాశాల యాజమాన్యాలు నానా అవస్థలు పెట్టిన తర్వాత అరకొరా ఫీజు చెల్లించి చేతులు దులుపుకునేవారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం విద్యార్థులు రోడ్లపై ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఉండేది. వీటన్నింటికీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చెక్ పెట్టింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పెండింగ్ లేకుండా ఫీజురీయింబర్స్ విడుదల చేస్తూ విద్యార్థులను ప్రోత్సహిస్తోంది. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో సుమారు రూ.452.52 కోట్లు విద్యాదీవెన కింద లబ్ధిదారులకు అందించింది. చివరకు ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోనూ దీవెన పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తోంది. మూడేళ్లుగా ఈ ప్రాంతానికి చెందిన సుమారు 17,900 మంది పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందజేసింది.
మా ఇంట్లో ఇద్దరికీ లబ్ధి
మా నాన్న జయకృష్ణ చిరువ్యాపారి. నా చెల్లెలు కావ్య బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతోంది. నేను ప్రస్తుతం బీఎస్సీ ఫైనలియర్ చదువుతున్నా. మా ఇంట్లో ఇద్దరికీ విద్యాదీవెన పథకం కింద ఆర్థిక సాయం అందుతోంది. ఇదివరకు మమ్మల్ని చదివించేందుకు నాన్న ఇబ్బంది పడేవారు. ఇప్పుడు ప్రభుత్వ భరోసాతో వారిపై భారం తగ్గింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రుణం తీర్చుకోలేం.
– కిషోర్, విద్యార్థి, గోవిందపురం, వి.కోట మండలం
జగనన్న మేలు..జన్మలో మరువలేం
నేను వ్యవసాయ కూలీని. ముగ్గురు పిల్లలు. ఒకమ్మాయికి పెళ్లి చేశా. మరో ఇద్దరిని చదివించేందుకు నానా అవస్థలు పడేవాడిని. ఫీజు కట్టేందుకు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొనేవాడిని. ఇప్పుడు ప్రభుత్వం అందిస్తున్న నగదు సాయంతో ఫీజుల బాధ తప్పింది. ముఖ్యమంత్రి జగనన్న చలువ వల్ల నా కుమారుడు హరికృష్ణ కుప్పంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నాడు. రెండో అమ్మాయి ఇంటర్ సెకండియర్ చదువుతోంది. జగనన్న మేలును జన్మలో మరువలేను.
– కుమారుడు హరికృష్ణతో వేమన్న, కణ్ణమ్మ దంపతులు
అర్హులందరికీ అందిస్తాం
అర్హులైన విద్యార్థులందరికీ విద్యాదీవెన పథకం వర్తింపజేశాం. సచివాలయాల ద్వారా పథకంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నాం. గురువారం కలెక్టరేట్‌లో కార్యక్రమ నిర్వహణకు ఏర్పాట్లు చేశాం. ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ, కాపు, బీసీ, ఈబీసీ, క్రిస్టియన్ మైనారిటీ శాఖల ద్వారా ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తాం.
– హరినారాయణన్, చిత్తూరు కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment