
వైఎస్సార్ జిల్లా పోరుమామిళ్ల మండలం చల్లగిరిగెల వద్ద నిర్మించిన చెక్ డ్యామ్
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి ప్రతినిధి, కడప: కేంద్ర జల్ శక్తి శాఖ ప్రకటించిన 2వ జాతీయ జల అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్ రెండు అవార్డులు దక్కించుకుంది. బుధవారం ఆన్‌లైన్ వేదికగా అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ యేడాది ఉత్తమ రాష్ట్రాల కేటగిరీలో తమిళనాడు, మహారాష్ట్ర, రాజస్థాన్ వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. కాగా, ఉత్తమ జిల్లాల కేటగిరీలో ‘నదుల పునరుజ్జీవనం–జల సంరక్షణ’లో అత్యుత్తమ పనితీరు కనబరచి సౌత్ జోన్ (దక్షిణాది రాష్ట్రాల) నుంచి వైఎస్సార్ కడప జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. నీటిని తక్కువగా ఉపయోగించడంపై విస్తృతంగా అవగాహన కల్పించడం, చెక్‌డ్యాములు, చెరువులు, కుంటలు ఆధునికీకరణ, కోనేరుల అభివృద్ది, బోర్‌వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్స్ తదితర పనులను పెద్ద ఎత్తున చేపట్టడం. మొక్కల పెంపకాన్ని విస్తృతంగా చేపట్టినందుకు ఈ పురస్కారం లభించింది. అలాగే ఆకాంక్ష జిల్లాల కేటగిరీలో విజయనగరం జిల్లా రెండో స్థానంలో నిలిచింది. జల సంరక్షణ–నిర్వహణ రంగంలో ప్రశంసనీయంగా పనిచేస్తున్న వ్యక్తులను, సంస్థలను గుర్తించి అవార్డులు ప్రదానం చేయడం ఈ కార్యక్రమ లక్ష్యం. నీటి ప్రాముఖ్యత గురించి ప్రజల్లో అవగాహన కల్పించినందుకు, ఉత్తమమైన నీటి వినియోగ పద్ధతులను అనుసరించేలా ప్రేరేపించినందుకు ఈ అవార్డులు అందిస్తున్నారు. మొత్తం 1,112 దరఖాస్తుల్లో మొత్తం 98మంది విజేతలను 16 కేటగిరీల్లో ఎంపిక చేశారు.
ఉపరాష్ట్రపతి అభినందనలు..
అవార్డులు గెలిచిన ఆయా రాష్ట్రాల అధికారులను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందించారు. ఆన్‌లైన్ వేదికగా 2వ జాతీయ జల అవార్డుల కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగించారు. అవసరం మేరకే నీటి వినియోగం వల్ల నీటి కొరత తగ్గుతుందని సూచించారు. జల సంరక్షణను ప్రజా ఉద్యమంగా మార్చే లక్ష్యంతో జల్‌శక్తి అభియాన్ కార్యక్రమం కొనసాగుతోందని ఉపరాష్ట్రపతి తెలిపారు. కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, సహాయమంత్రి రతన్ లాల్ కటారియా, పర్యావరణవేత్త డాక్టర్ అనిల్ జోషి, స్వచ్ఛగంగ జాతీయ మిషన్ డీజీ రాజీవ్ రంజన్ మిశ్రా, అవార్డులు అందుకున్న రాష్ట్రాల ప్రతినిధులు ఆన్లైన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.