చిన్నాపురం వద్ద బైక్‌పై వస్తున్న ఆదినారాయణ
సాక్షి, కోడూరు(అవనిగడ్డ): కృష్ణానదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు సూసైడ్ నోట్ ద్వారా నమ్మించే ప్రయత్నం చేసిన ఆదినారాయణ మిస్సింగ్ కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు.. పెడన మండలంలోని కాకర్లపూడి శివారు ముత్రాస్‌పాలెం గ్రామానికి చెందిన యరగాని ఆదినారాయణ ఈ నెల 25వ తేదీన ఇంటి వద్ద నుంచి తన ద్విచక్రవాహనంపై ఉల్లిపాలెం–భవానీపురం వారధి వద్దకు చేరాడు.
రాత్రి 7గంటల సమయంలో ఆదినారాయణ తన బైక్‌ను వారధిపై ఉంచి, అందులో తాను చనిపోతున్నట్లుగా సూసైడ్ నోట్ రాసి బైక్ ట్యాంక్ కవర్‌లో పెట్టాడు. ఇదే సూసైడ్ నోట్‌ను తన భార్య నవ్యశ్రీ ఫోన్‌కు కూడా పంపాడు. అప్పుల బాధలు ఎక్కువ కావడంతోనే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానని, తన కోసం ఎవరూ గాలించవద్దని, గాలించినా కూడా తన మృతదేహం దొరకదంటూ ఆదినారాయణ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు.
కోడూరు వంతెన సెంటర్‌లో నడుచుకుంటూ వెళ్తున్న ఆదినారాయణ
రెండు రోజుల పాటు ముమ్మర గాలింపు..
ఆదినారాయణ బైక్‌తో పాటు సూసైడ్ నోట్ కూడా వారధిపై ఉండడంతో పోలీసులు ఆదినారాయణ వారధిపై నుంచి కృష్ణానదిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు భావించారు. ఇందులో భాగంగా రెండు రోజుల పాటు కోడూరు, పెడన పోలీసులు, ఎన్‌ఢీఆర్‌ఎప్ బృందాలు, స్థానిక మత్స్యకారుల సహాయంతో కృష్ణానదిని జల్లెడ పట్టారు. బందరు, కోడూరు మండలాల్లో ప్రవహించే నది ప్రాంతమంతా వెతికినా కూడా ఆదినారాయణ ఆచూకీ లభించలేదు. సహజంగా ఓ వ్యక్తి నదిలో దూకితే 36గంటల లోపు నీటిలో పైకి తేలతాడని, అయితే ఆదినారాయణ ఆచూకీ లభించకపోవడంతో పోలీసులు మరో కోణంలో తమ దర్యాప్తును ప్రారంభించారు.
సీసీ టీవీ ఫుటేజీల్లో ఆచూకీ..
ఆదినారాయణ నదిలో దూకలేదని పోలీసులకు అనుమానం రావడంతో పెడన దగ్గర నుంచి కోడూరు వరకు ఉన్న అన్ని సీసీ టీవీ ఫుటేజీలను పోలీసులు నిశితంగా పరిశీలించారు. ఇంటి వద్ద నుంచి బయలుదేరినప్పుడు ఆదినారాయణ వద్ద బ్యాగ్ లేదని, బందరులోని ఓ దుకాణంలో బ్యాగ్‌ను కొనుగోలు చేసినట్లు గుర్తించారు. అక్కడ నుంచి బైక్‌పై చిన్నాపురం మీదగా ఉల్లిపాలెం వస్తున్నట్లు సీసీ టీవీల్లో రికార్డు అయింది.
ఉల్లిపాలెం వారధి వద్ద ఆదినారాయణ తాను ఇంటి వద్ద వేసుకున్న దుస్తులను మార్చుకొని, ముఖానికి మాస్క్ ధరించి ఆటోలో కోడూరు వెళ్లడాన్ని గుర్తించారు. కోడూరు వంతెన సెంటర్‌లోని గంగాభవానీ అమ్మవారి దేవాలయం వద్ద ఆదినారాయణ ఆటో దిగడంతో పాటు చేతిలో బ్యాగు పట్టుకొని, మరో బ్యాగు తగిలించుకొని నవ్వుతూ సెల్‌ఫోన్‌ల్లో మాట్లాడుకుంటూ అక్కడ తిరగడం సీసీ టీవీల్లో రికార్డు అయ్యింది. కోడూరు నుంచి అవనిగడ్డకు బైక్‌ను లిఫ్ట్ అడిగి వెళ్లడాన్ని పోలీసులు గుర్తించారు.
తప్పుదోవ పట్టించేందుకు..
విషయాన్ని తప్పుదోవ పట్టించేందుకు వారధి వద్ద బైక్, సూసైడ్ నోట్ పెట్టి ఆదినారాయణ బయట ప్రాంతాలకు పరారయ్యాడని పోలీసులు చెప్పారు. చేసిన అప్పులు కట్టకుండా తప్పించుకొనేందుకు ఈ తరహాలో మోసానికి పాల్పడినట్లు తమ విచారణలో తేలిందన్నారు. ఆదినారాయణ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు కొనసాగుతుందని, దీనిపై పూర్తిస్థాయిలో విచారణ కూడా కొనసాగుతుందని ఎస్‌ఐ రాజేంద్రప్రసాద్ తెలిపారు. పెడన పోలీసులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించారని ఎస్‌ఐ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment