
సాక్షి, విశాఖపట్నం: స్టీల్ ప్లాంట్‌లో పెట్టుబడుల ఉపసంహరణపై నిరసనలు వెల్లువెత్తాయి. శుక్రవారం.. జీవీఎంసీ ఎదుట కార్మికులు నిరసన తెలిపారు. భారీ సంఖ్యలో స్టీల్ ప్లాంట్ కార్మికులు, ఉద్యోగులు బైక్ ర్యాలీ నిర్వహించారు. స్టీల్ ప్లాంట్ నుంచి గాజువాక ఎన్‌ఏడీ మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు బైక్ ర్యాలీ సాగింది. నిరసనల్లో ఆల్ ట్రేడ్ యూనియన్లు పాల్గొన్నాయి. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులకు వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, సత్యవతి మద్దతు పలికారు. విశాఖ ఉక్కును సాధించుకుంటామని స్టీల్ ప్లాంట్ కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ర్యాలీలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్ పరం చేస్తే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ర్యాలీలో అఖిలపక్ష కార్మిక సంఘాల నేతలు రామారావు, ఆదినారాయణరావు, వెంకట్రావు, అయోధ్యరామ్, తదితరులు పాల్గొన్నారు.(చదవండి: ‘హక్కు’ కోసం.. ‘ఉక్కు’ సంకల్పం)
సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎంవీవీ
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని, స్టీల్ ప్లాంట్ కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధమని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం 32 మంది ప్రాణత్యాగాలు చేశారని పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్‌లో రూ.4900 కోట్లు మాత్రమే పెట్టుబడి పెట్టారన్నారు.స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణనను లోక్‌సభలో అడ్డుకుంటామని ఆయన చెప్పారు. స్టీల్ ప్లాంట్ మెయిన్ గేటు వద్ద ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని ఎంవీవీ అన్నారు.(చదవండి: ప్రైవేటు చేతుల్లోకి విశాఖ స్టీల్ ప్లాంట్)
లోక్‌సభలో పోరాడతాం: ఎంపీ సత్యవతి
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడేందుకు లోక్‌సభలో పోరాడతామని ఎంపీ సత్యవతి అన్నారు. స్టీల్ ప్లాంట్‌ను పోరాటాలతో సాధించుకున్నామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల బాటలో పయనించిందని, వేల కోట్లను కేంద్ర,రాష్ట్రాలకు పన్నుల రూపంలో ఆర్జించి పెట్టిందన్నారు.ప్రైడ్ ఆఫ్ ఏపీగా విశాఖ స్టీల్ ప్లాంట్ నిలిచిందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్ పరం చేయడాన్ని అడ్డుకుంటామని ఎంపీ సత్యవతి స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment