
సాక్షి, అమరావతి: రాయలసీమ, కోస్తాంధ్రలకు దీటుగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలను పారిశ్రామికంగా, ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి సత్ఫలితాలనిస్తోంది. విశాఖ, గంగవరం పోర్టులకు అదనంగా శ్రీకాకుళం జిల్లా భావనపాడు వద్ద నూతన ఓడరేవు నిర్మిస్తుండటంతో పోర్టు ఆధారిత పరిశ్రమలు ఉత్తరాంధ్రవైపు చూస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన 2019 జూన్ నుంచి ఇప్పటి వరకు ఉత్తరాంధ్రలో 33 భారీ యూనిట్లు ఉత్పత్తి ప్రారంభించాయి. మరో 20 యూనిట్ల ప్రతిపాదనలు వివిధ దశల్లో ఉన్నాయి.
ఉత్పత్తి ప్రారంభించిన యూనిట్ల ద్వారా రూ.5,801.37 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 8,226 మందికి ఉపాధి లభించింది. వీటిలో రెయిన్ సీఐఐ కార్బన్ వైజాగ్ లిమిటెడ్, చెట్టినాడ్ సిమెంట్ కార్పొరేషన్, శ్రీమాన్ కెమికల్స్, డాక్టర్ రెడ్డీస్, దివీస్ ల్యాబ్, నాట్కో, డెక్కన్ ఫైన్ కెమికల్స్ తదితర కంపెనీలున్నాయి. వివిధ దశల్లో ఉన్న 20 యూనిట్ల ద్వారా ఉత్తరాంధ్రలోకి మరో రూ.18,,235.5 కోట్ల పెట్టుబడులతో పాటు 24,380 మందికి ఉపాధి లభించనుంది. జపాన్‌కు చెందిన యకోమా గ్రూపునకు చెందిన ఏటీసీ టైర్స్ రూ.1,750 కోట్లతో భారీ టైర్ల తయారీ యూనిట్, రూ.2,000 కోట్లతో సెయింట్ గోబిన్ విస్తరణ, రూ.6,700 కోట్లతో అన్‌రాక్ అల్యూమినియం, రూ.485 కోట్లతో కనాŠస్య్ నెర్‌లాక్ పెయింట్స్, రూ.750 కోట్లతో జిందాల్ ఇండియా ప్రతిపాదనలు వివిధ దశల్లో ఉన్నాయి.
ఇవి కాకుండా ఒక్క హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) రూ.28,000 కోట్ల పెట్టుబడులు పెడుతోంది. విజయనగరం జిల్లాలో కొత్తవలస ఇన్‌ఫ్రా వెంచర్స్ రూ.2,000 కోట్లు, శారద మెటల్స్ రూ.1,500 కోట్ల పెట్టుబడితో స్థాపించే పరిశ్రమల ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. ఐటీ రంగంలో అదానీ గ్రూపు 130 ఎకరాల్లో రూ14,000 కోట్లతో డేటా, కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణం చేపడుతోంది. స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు ఇప్పటికే రెండు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలు విశాఖలో ఏర్పాటయ్యాయి. గడిచిన 30 నెలల కాలంలో ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో 2,412 ఎంఎస్‌ఎంఈ యూనిట్లు ఏర్పాటయ్యాయి. వీటి ద్వారా రూ.1,866.53 కోట్ల విలువైన పెట్టుబడులతో పాటు 21,212 మందికి ఉపాధి లభించింది.
రూపు మారనున్న భోగాపురం
పరిపాలన రాజధానిగా విశాఖను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం దానికి అనుగుణంగా పలు చర్యలు చేపట్టింది. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, పర్యాటకాభివృద్ధిలో కీలకపాత్ర పోషించే విశాఖ ఓ హబ్‌గా ఎదిగేలా చర్యలు చేపడుతోంది. భోగాపురంలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటికే భూ సేకరణ సమస్యలను పరిష్కరించి జీఎంఆర్‌కు కాంట్రాక్టు అప్పగించింది. దీని నిర్మాణానికి కేంద్రం నుంచి నిరభ్యంతర సర్టిఫికెట్ కోసం స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కేంద్రానికి లేఖ రాశారు. భోగాపురం నుంచి భీమిలి వరకు ఆరులేన్ల రహదారిని అభివృద్ధి చేసి, దానికి ఇరువైపులా పారిశ్రామికంగా అభివృద్ధి చేయనున్నారు. ఇదే సమయంలో విశాఖకు పర్యాటకులను ఆకర్షించేలా భారీ పర్యాటక ప్రాజెక్టులను ప్రభుత్వం చేపట్టింది.
వేగంగా విశాఖ నోడ్ అభివృద్ధి
విశాఖ–చెన్నై కారిడార్‌లో భాగంగా ఏడీబీ నిధులతో విశాఖ నోడ్‌ను ఏపీఐఐసీ వేగంగా అభివృద్ధి చేస్తోంది. అచ్చుతాపురం, రాంబిల్లి, నక్కపల్లిలో పారిశ్రామిక పార్కుల్లో అన్ని మౌలిక వసతులను అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే మొదటి దశ పనులు చివరికి వచ్చాయి. రెండో దశ పనులు వేగంగా సాగుతున్నాయి. వీటికి అదనంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల కోసం బొబ్బిలి వద్ద 661.33 ఎకరాల్లో గ్రోత్ సెంటర్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇందులో ఇప్పటికే 206 యూనిట్లకు భూములు కేటాయించగా అందులో 131 యూనిట్లు ఉత్పత్తిని ప్రారంభించాయి.
Comments
Please login to add a commentAdd a comment