
సాక్షి, విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మన బడి నాడు- నేడు రెండో దశ పనులను వెంటనే ప్రారంభించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. నిర్ణీత కాలపరిమితిలో ఈ పనులన్నీ పూర్తి అయ్యేలా జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు పూర్తి సమన్వయంతో పని చేయాలని పేర్కొన్నారు. పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్‌తో కలిసి విజయవాడలోని సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయం నుంచి గురువారం నాడు జిల్లా కలెక్టర్లు, జేసీలు, జిల్లా విద్యాశాఖాధికారులు, సమగ్ర శిక్షా జిల్లా అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నాడు నేడు కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. నాడు నేడు రెండో దశలో భాగంగా 12 వేల పైచిలుకు పాఠశాలల్లో పనులు చేపట్టనున్నామని, వీటి కోసం నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. పనుల నిమిత్తం ఈ పాటికే రివాల్వింగ్ ఫండ్ కూడా విడుదలైనందున, పనులను ప్రారంభిచాలని అధికారులను ఆదేశించారు. ఈ పనులకు అవసరమైన ఇసుక, సిమెంట్, వంటి వాటిని కూడా అందుబాటులో ఉంచామన్నారు.
ఈ పనుల నాణ్యతలో ఏమాత్రం రాజీ పడవద్దని, పనులు వేగవంతంగా జరగడంలో అధికారులు, ఆయా పాఠశాలల పేరెంట్స్ కమిటీలు కూడా పూర్తి సమన్వయంతో పని చేయాలని మంత్రి పేర్కొన్నారు. పాఠశాలల్లో గతానికి ఇప్పటికీ స్పష్టమైన మార్పు కనిపించాలని అన్నారు. ఈ పనులకు సంబంధించి క్షేత్ర స్థాయిలో ఎటువంటి సమస్యలు ఎదురైనా, వాటిని వెంటనే ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment