జర్నలిజమా లేక అధికార పిచ్చా! | Budi Mutyala Naidu comments on Eenadu And Chandrababu | Sakshi
Sakshi News home page

జర్నలిజమా లేక అధికార పిచ్చా!

Published Tue, Apr 19 2022 2:56 AM | Last Updated on Tue, Apr 19 2022 3:01 PM

Budi Mutyala Naidu comments on Eenadu And Chandrababu - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రిగా తమ వాడు లేకపోతే ఈనాడు, మరికొన్ని పత్రికలు, మీడియా సంస్థలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పచ్చి అబద్ధాలు రాస్తాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు ధ్వజమెత్తారు. సోమవారం ఆయన విశాఖపట్నంలో విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో సామాజిక పింఛన్ల పంపిణీపై ఈనాడులో ప్రచురితమైన కథనం తప్పుడు ప్రచారంలో భాగమేనని చెప్పారు. మీవాడు అధికారంలో లేడని కడుపు మంటతో సామాజిక పింఛన్లను కూడా వక్రీకరించి రాస్తున్నారని, ఇంతకన్నా సిగ్గుమాలిన వ్యవహారం ఉంటుందా? దీనిని జర్నలిజం అంటారా? అంటూ తూర్పారపట్టారు.

పింఛన్ల వాస్తవాలు ఇవిగో..
‘2014–19 మధ్య చివరి రెండు నెలలూ మినహాయిస్తే చంద్రబాబు ప్రభుత్వం నెలకు ఇచ్చిన సామాజిక పింఛన్‌ రూ.1,000 మాత్రమే. ఆయన నెలవారీగా ఇచ్చిన పింఛన్లు 39 లక్షలే. ఇప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రతి నెలా ఏకంగా 62 లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేస్తోంది. చంద్రబాబు ప్రభుత్వంలో పింఛన్ల మీద నెలకు రూ.400 కోట్లు మాత్రమే ఖర్చు చేసేవారు. ఇప్పుడు నెలకు రూ.1,570 కోట్లు ప్రభుత్వం ఖర్చు పెడుతోంది. అంటే అప్పట్లో ఇచ్చిన దానికంటే నెలకు రూ.1,170 కోట్లు, ఏడాదికి రూ.14,040 కోట్లు ఎక్కువ. పింఛన్ల కోసం ఇంత ఖర్చు చేస్తున్నందుకు చంద్రబాబుకు బాధగా ఉందా? లేక రామోజీరావుకు కడుపుమంటగా ఉందా?’ అని ప్రశ్నించారు.

జన్మభూమి కమిటీల ఆగడాలపై అప్పుడెందుకు రాయలేదో?
‘బాబు హయాంలో ఉన్న జన్మభూమి కమిటీల దోపిడీపై ఇదే ఎల్లో మీడియా ఎందుకు చెప్పలేదు? పింఛన్లు కోసం వృద్ధులు, వికలాంగులు, వితంతువులు పోస్టాఫీస్‌ల ముందు మండుటెండలో క్యూలు కట్టేవారు. క్యూలలో నిల్చోలేక పలువురు చనిపోయిన విషయాన్ని ఎందుకు చెప్పలేదు? అప్పట్లో ప్రతి నెలా పింఛను ఇచ్చింది 89 శాతం మందికే. ఇప్పుడు ప్రతి నెలా 1వ తేదీనే 90 శాతం మందికి, మొదటి అయిదు రోజుల్లోనే 99 శాతం మందికి పింఛన్లు చేరుతున్నాయి. పదేపదే తిప్పించుకుని పింఛన్‌ ఇచ్చిన ప్రభుత్వం ఎవరిది? నెలలో మొదటి రోజే, సూర్యోదయానికి ముందే పెన్షనర్లు ఎక్కడ ఉంటే అక్కడికే వలంటీర్లు వెళ్లి పింఛన్లు ఇస్తున్న ప్రభుత్వం ఎవరిది? అని ప్రశ్నించారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికీ అక్కడికే వెళ్లి ఇస్తున్నారు. కరోనా కష్ట కాలంలో కూడా పింఛన్ల రూపంలో çరూ.50 వేల కోట్లు పంపిణీ చేశామన్నారు. ఇప్పుడు పింఛన్లకు కోటాలు, కోతలు లేవు. కులం, మతం, వర్గం, రాజకీయ పార్టీ ఏదన్నది చూడటంలేదు. లంచాలు, దళారీలకు చోటు లేదు. జన్మభూమి కమిటీల ముందు అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు ఆత్మాభిమానాన్ని చంపుకొని మోకరిల్లాల్సిన పరిస్థితి లేనే లేదు. అర్హులైన ప్రతి ఒక్కరికీ అందుతున్నాయి. ఏడుపంతా ఇదే కదా?’ అని అన్నారు.

ప్రతి దాంట్లో అబద్ధపు ప్రచారమే..
‘అమ్మ ఒడి స్కీమ్‌లో అర్హతలు మార్చేశారని ఇటీవలే రాశారు. మత్స్యకార భరోసా స్కీమ్‌లో అర్హతలు మార్చేశారని మరో రోజు రాశారు. ఏ ఒక్క అర్హతా మార్చలేదు. పైగా, మొదట నెలకు 200 యూనిట్ల లోపు వాడుకునే వారికే అమ్మ ఒడిని వర్తింపజేస్తే.. తర్వాత దాన్ని 300 యూనిట్లు చేసింది జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం. దీనివల్ల 95 శాతం మందికి అమ్మ ఒడి అర్హత లభించింది. దాన్ని కూడా వక్రీకరించి రాశారు. మత్స్యకారుల కుటుంబాల్లో పిల్లలు ఎవరైనా వివాహం చేసుకుని వేరే కాపురం పెడితే... వారికి కూడా ఈ స్కీములన్నీ వర్తిస్తాయి. మత్స్యకారులకు, బీసీలకు ఏనాడూ ఏమీ చేయని చంద్రబాబును సమర్థించి.. ఇలాంటి మంచి స్కీముల్ని విమర్శించటాన్ని జర్నలిజం అంటారా? లేక అధికార పిచ్చి, కుల పిచ్చి అంటారా?’ అని ముత్యాలనాయుడు ప్రశ్నించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement