సాక్షి, అమరావతి: వరుసగా ఐదో దఫా ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా నవరత్నాల పథకాలు అమలు కొనసాగిస్తూ అన్ని వర్గాలకు అండగా నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం 2023–24 వార్షిక బడ్జెట్‌కు రూపకల్పన చేసింది. ఈ ఏడాది కూడా మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం జెండర్ బేస్డ్ బడ్జెట్ సిద్ధం చేసింది.
రాష్ట్ర సొంత ఆదాయం, కేంద్రం నుంచి పన్నుల వాటా రూపంలో వచ్చే నిధులను వాస్తవ రూపంలో బేరీజు వేస్తూ వార్షిక బడ్జెట్ రూపొందించారు. కేంద్రం నుంచి పన్నుల వాటా రూపంలో రూ.41,388 కోట్లు రానున్నాయి. మొత్తం మీద 2023 – 24 వార్షిక బడ్జెట్ రూ.2.79 లక్షల కోట్లుగా ఉండనుందని అంచనా.
నేటి ఉదయం మంత్రిమండలి ఆమోదం
వైఎస్సార్ సీపీ ప్రభుత్వం గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ఐదో బడ్జెట్ జనరంజకంగా ఉండనుంది. ఉదయం 8 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది. అనంతరం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ 2023–24 వార్షిక బడ్జెట్‌ను ఉదయం 10 గంటలకు అసెంబ్లీకి సమర్పించనున్నారు.
శాసన మండలిలో డిప్యూటీ ముఖ్యమంత్రి అంజాద్ బాషా బడ్జెట్‌ను చదవనున్నారు. వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టడం పూర్తయిన వెంటనే ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్‌ను వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అసెంబ్లీలో చదివి వినిపిస్తారు. మండలిలో వ్యవసాయ బడ్జెట్‌ను పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు చదవనున్నారు.
నవరత్నభరితంగా బడ్జెట్..
నవరత్నాలను ప్రతిబింబించేలా బడ్జెట్‌ను తీర్చిదిద్దారు. వృథా, దుబారా, ఆర్భాటపు వ్యయాలకు తావు లేకుండా అందరి సంక్షేమం, అన్ని రంగాల అభివృద్ధిని సమ్మిళితం చేస్తూ ఆయా రంగాలకు బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు. అమ్మ ఒడి, వైఎస్సార్ రైతు భరోసా, పేదల గృహాలతో పాటు వ్యవసాయం, సాగునీరు, విద్య, వైద్య రంగాలకు బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇచ్చారు. వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ పథకాలకు తగినన్ని కేటాయింపులు చేయనున్నారు.
గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థకు బడ్జెట్‌లో తగిన కేటాయింపులు ఉండనున్నాయి. ప్రధానంగా ప్రభుత్వ విద్యా సంస్థలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయింపులు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉప ప్రణాళికలను ప్రత్యేకంగా రూపొందించారు. మహిళలు, పిల్లల కోసం ప్రత్యేకంగా కేటాయింపులు చేయనున్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా కోసం సబ్సిడీకి తగినన్ని నిధులు కేటాయించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment