‘సాక్షి’పై కేసు సరికాదు | The case against the editor of Sakshi should be withdrawn | Sakshi
Sakshi News home page

‘సాక్షి’పై కేసు సరికాదు

Published Sat, Oct 19 2024 5:32 AM | Last Updated on Sat, Oct 19 2024 5:32 AM

The case against the editor of Sakshi should be withdrawn

నినదించిన పాత్రికేయ సంఘాలు  

‘సాక్షి’ ఎడిటర్‌పై కేసు ఉపసంహరించుకోవాలి: ఏపీయూడబ్ల్యూజే  

ఈ కేసును వ్యతిరేకిస్తున్నాం: ఏపీడబ్ల్యూజేఎఫ్‌  

కేసు అక్రమం: చిన్న, మధ్య తరహా వార్తాపత్రికల సంఘం 

సాక్షిపై కేసు అన్యాయం: ఏపీడబ్ల్యూజేయూ 

ఇటీవల విజయవాడలో వరద సహాయక చర్యల్లో జరిగిన అవినీతిని ఎండగట్టినందుకు సాక్షి  ఎడిటర్‌పై కేసు నమోదు చేయడాన్ని పలు సంఘాల నేతలు తీవ్రంగా ఖండించారు. ఇది సరికాదని పేర్కొన్నారు. ఈకేసునుఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.  –సాక్షి, అమరావతి/విశాఖ సిటీ 

కేసు ఉపసంహరించుకోవాలి: ఏపీయూడబ్ల్యూజేమీడియా కథనాలపై కేసు నమోదు చేయడం మంచిది కాదని ఆంధ్రప్రదేశ్‌ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ (ఏపీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఐ.వి.సుబ్బారావు, చందు జనార్దన్‌ పేర్కొన్నారు. ఈ మేరకు వారు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సాక్షి కథనా­ల్లో అవాస్తవాలు ఉంటే వివరణ ఇచ్చుకోవచ్చని తెలిపారు. అలా కాకుండా ఎడిటర్‌ వర్ధెల్లి మురళిపై కేసు పెట్టడం సరైనచర్య కాదని పేర్కొన్నా­రు. కేసును ఉపసంహరించుకోవాలని కోరారు.  

ఈ కేసును వ్యతిరేకిస్తున్నాం: ఏపీడబ్ల్యూజేఎఫ్‌  పత్రికల్లో ప్రచురితమైన వార్తాకథనాలపై అనుమానాలు, తప్పులు, పొరపాట్లు ఉంటే వాటిని ఎత్తిచూపే పద్ధతిని విస్మరించి పోలీసు కేసులు పెట్టే వైఖరిని ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌ (ఏపీడబ్ల్యూజేఎఫ్‌) వ్యతిరేకిస్తోందని ఆ ఫెడరేషన్‌ అధ్యక్షుడు ఎస్‌.వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి  జి.ఆంజనేయులు తెలిపారు. ఈ సంస్కృతిని ఖండిస్తున్నట్లు తెలిపారు.

 ‘సాక్షి’ ఎడిటర్‌ వర్ధెల్లి మురళిపై పోలీసులు కేసు బనాయించటం సరికాదు. పత్రికల్లో ప్రచురితమయ్యే వార్తా కథనాలకు సంపాదకుడిదే బాధ్యత అయినా పత్రిక ప్రధాన లక్ష్యం ప్రజలకు సమాచారాన్ని చేరవేయడం. ఆ ప్రక్రియలో లోటుపాట్లుంటే సరిదిద్దే ప్రయత్నాలు జరగాలి. పోలీసు కేసులు పెట్టడం మీడియాను భయపెట్టే చర్యగా భావిస్తున్నాం. మీడియాను భయపెట్టేందుకు చేసే ఇటువంటి ప్రయత్నాలు విరమించుకోవాలి. 

సాక్షి సంపాదకులు వర్ధెల్లి మురళిపై పెట్టిన కేసు ఆ కోవలోకే వస్తుంది. ఇటువంటి ధోరణులను పోలీసు యంత్రాంగం మానుకోవాలి..’ అని వారు చెప్పారు. ఈ కేసు సరికాదని ఏపీడబ్ల్యూజేఎఫ్‌ విశాఖ జిల్లా అధ్యక్షుడు పోతుమహంతి నారాయణ్, కార్యదర్శి జి.శ్రీనివాస్‌ పేర్కొన్నారు.  

కేసు అక్రమం: స్సామ్నా  
మీడియా స్వేచ్ఛను హరించే విధంగా కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు తాజాగా జరిగిన కొన్ని ఘటనలు రుజువు చేస్తున్నాయని చిన్న, మధ్యతరహా వార్తాపత్రికల సంఘం (స్సామ్నా) శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. ఒక వార్తా కథనం పేరుతో ‘సాక్షి’ ఎడిటర్‌ వి.మురళిపై విజయవాడలో పోలీస్‌ కేసు నమోదు చేయడం అక్రమమని స్సామ్నా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నల్లి ధర్మారావు, సిహెచ్‌.రమణారెడ్డి తీవ్రంగా ఖండించారు. 

ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఒక జర్నలిస్టుపై ఈ మాదిరిగానే నమోదు చేసిన కేసును ఇటీవల సుప్రీంకోర్టు కొట్టేసిన సంగతిని కూటమి ప్రభుత్వం గుర్తుచేసుకోవాలని హితవు పలికారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాసే విధంగా ఆదిలోనే కూటమి ప్రభుత్వం అడుగులు వేయడం ప్రజాస్వామ్యానికి మేలు చేసేది కాదన్నారు. గతంలోను చట్టాలు, జీవోలు, అధికార ఒత్తిళ్లతో కొన్ని చానళ్ల ప్రసారాలు నిలిపేయించడం, జర్నలిస్టులపై కేసులు బనాయించడం వంటి ప్రయత్నాలు జరిగాయని చెప్పారు. 

ఇప్పటికైనా సాక్షి ఎడిటర్, జర్నలిస్టులపై పెట్టిన కేసును ఉపసంహరించాలని, చానళ్ల ప్రసారాల విషయంలో కేబుల్‌ టీవీ ఏజెన్సీలపై ఒత్తిళ్లను మానుకోవాలని డిమాండ్‌ చేశారు. మీడియా స్వేచ్ఛను హరించే ప్రయత్నం సరికాదని, జర్నలిస్టులపై కేసుల విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలని స్సామ్నా విజయవాడ నగర అధ్యక్షుడు ఎం.వి.సుబ్బారావు, కార్యదర్శి ఎస్‌.గంగరాజు కోరారు. 

సాక్షి ఎడిటర్‌పై కేసు అన్యాయం: ఏపీడబ్ల్యూజేయూ 
సాక్షి ఎడిటర్‌ మురళిపై విజయవాడలో కేసు నమోదు చేయడం అన్యాయమని ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ యూనియన్‌ (ఏపీడబ్ల్యూజేయూ) విశాఖ జిల్లా యూనిట్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. స్వేచ్ఛను హరించే విధంగా ప్రభు­త్వం వ్యవహరిస్తోందని ఆ యూనిట్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.రాము, ఆర్‌.రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వార్తా కథనం పేరుతో సాక్షి ఎడిటర్‌ వి.మురళిపై కేసు నమోదు అక్రమమని పేర్కొన్నారు. 

గతంలో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఇదేరీతిలో ఒక జర్నలిస్టుపై నమోదుచేసిన కేసును సుప్రీంకోర్టు కొట్టేసిన సంగతిని ప్రభుత్వం గుర్తుచేసుకోవాలని సూచించారు. ప్రభుత్వాలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తే జర్నలిస్టు సంఘాలు అంగీకరించే పరిస్థితి లేదని హెచ్చరించారు. సాక్షి ఎడిటర్‌పై కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.  

సంయమనంతో వ్యవహరించాలి: జాతీయ జర్నలిస్టుల సంఘం 
పత్రికల్లో ప్రచురితమైన వార్తా కథనాలపై అనుమానాలు, తప్పులు, పొరపాట్లు ఉంటే వాటిని ఎత్తిచూపే పద్ధతిని విస్మరించి.. పోలీసు కేసులు పెట్టే వైఖరి సరికాదని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు పేర్కొన్నా­రు. సమాజంలో వైషమ్యాలు, అంతరాలు మరింతగా పెరిగేందుకు దోహదపడే చర్యలకు పాల్పడకుండా పోలీసులు సంయమనంతో వ్యవహరించాలని ఆయన సూచించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement