సాక్షి, అమరావతి: అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసగించడంలో నిస్సిగ్గుగా వ్యవహరించే ప్రతిపక్ష నేత చంద్రబాబు మరోసారి తన నైజాన్ని ప్రదర్శించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు సాగు బిల్లుల అంశంలో అదే రీతిలో ప్రజల్ని మోసగించేందుకు రంగంలోకి దిగారు. ఆనాడు సాగు బిల్లులపై పార్లమెంటులో చర్చ సందర్భంగా రైతుల ప్రయోజనాల కోసం కనీసం ఓ సలహా, సూచన ఇవ్వని టీడీపీ.. తమ అనుకూల మీడియా ద్వారా ప్రజల్ని మభ్య పెట్టేందుకు యత్నిస్తోంది. పంటలకు కనీస మద్దతు ధర ఉండాలని చంద్రబాబు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారు. మరోవైపు వైఎస్సార్‌సీపీ ఎంపీలు రైతుల ప్రయోజనాల కోసం పార్లమెంటులో మాట్లాడలేదని అబద్ధపు ఆరోపణలతో ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తున్నారు. కానీ ఆ మూడు బిల్లులపై చర్చ సందర్భంగా వైఎస్సార్‌సీపీ.. రైతుల ప్రయోజనాలు, పంటలకు కనీస మద్దతు ధర కోసం నిర్దిష్టంగా మాట్లాడిందని పార్లమెంటు రికార్డులే స్పష్టం చేస్తున్నాయి.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిశా నిర్దేశంతో వైఎస్సార్‌సీపీ ఎంపీలు విజయ సాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, శ్రీకృష్ణదేవరాయలు, తలారి రంగయ్యలు పార్లమెంటులో రైతుల వాదనను బలంగా వినిపించారు. మరోవైపు రైతుల ప్రయోజనాల కోసం టీడీపీ ఎలాంటి ప్రతిపాదనలు లేకుండానే ఆ మూడు బిల్లులకు సంపూర్ణంగా మద్దతిచ్చిన విషయం పార్లమెంట్ సాక్షిగా అందరికీ తెలిసిందే. వ్యవసాయ రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపార, వాణిజ్యం (ప్రోత్సాహం, సులభతరం) బిల్లు, రైతాంగ (రక్షణ, సాధికారికత) ధరల హామీ బిల్లు, వ్యవసాయ సేవల ఒప్పందం బిల్లు (మూడు బిల్లులు) తీసుకువచ్చింది. ఆ బిల్లులపై ఈ ఏడాది సెప్టెంబరు 17న లోక్‌సభ, సెప్టెంబర్ 20న రాజ్యసభలో చర్చించిన అనంతరం ఆమోదం పొందాయి. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ, టీడీపీ ఎంపీలు పార్లమెంటులో మాట్లాడిన వివరాలు ఇలా ఉన్నాయి.
కనీస మద్దతు ధరకు హామీ కచ్చితంగా ఉండాలి : వైఎస్సార్‌సీపీ
► పంటలకు కనీస మద్దతు ధర కచ్చితంగా అమలు చేయాలని వైఎస్సార్‌సీపీ ఎంపీలు డిమాండ్ చేశారు. తమ పార్టీ రైతు పక్షపాతి అని చెబుతూ రైతులకు ఏమాత్రం నష్టం జరగడానికి వీల్లేదని స్పష్టం చేశారు. పంటలకు కనీస మద్దతు ధర కల్పిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీని విశ్వసిస్తూనే ఆ బిల్లులకు మద్దతు తెలుపుతున్నామని చెప్పారు.
► పార్టీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ రంగంలో ఏకస్వామ్య విధానాలు, సిండికేట్, దళారీ వ్యవస్థలను రూపు మాపాలని పట్టుబట్టారు. వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరకు బిల్లులో కచ్చితమైన హామీ ఉండాలని స్పష్టం చేశారు.
► స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ విధానంలో స్థానిక అవసరాలు, మార్కెటింగ్ అవసరాలకు మధ్య సమతుల్యత ఉండాలని కూడా చెప్పారు.
► కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కంటే రైతుల ప్రయోజనాలకే పెద్దపీట వేయాలని తేల్చి చెప్పారు. రైతులకు విస్తృత మార్కెటింగ్ అవకాశాలతోపాటు పంటలకు కనీస మద్దతు ధర ఉండాల్సిందేనని మరో ఎంపీ తలారి రంగయ్య కూడా స్పష్టం చేశారు.
ప్రైవేటు సంస్థలు కూడా కనీస మద్దతు ధర ఇవ్వాల్సిందే
► రైతుల పంటలకు కనీస మద్దతు ధర కల్పనకు స్పష్టమైన హామీ ప్రాతిపదికనే మూడు సాగు బిల్లులకు మద్దతు ఇస్తామని వైఎస్సార్‌సీపీపీ నేత విజయసాయిరెడ్డి తమ పార్టీ విధానాన్ని స్పష్టం చేశారు.
► ఆ బిల్లులపై రాజ్యసభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘కనీస మద్దతు ధర’ అంశంపై స్పష్టత లేకపోవడం సందిగ్దతకు దారితీస్తోందని చెప్పడం గమనార్హం. ప్రభుత్వ మార్కెటింగ్ వ్యవస్థలే కాదు కార్పొరేట్/ ప్రైవేట్ సంస్థలు కూడా పంటలకు కనీస మద్దతు ధరకు స్పష్టమైన హామీ ఇవ్వాలని ఆయన నిర్దిష్టమైన సూచన చేశారు.
బేషరతుగా సాగు బిల్లులకు టీడీపీ మద్దతు
► ఈ మూడు సాగు బిల్లులకు టీడీపీ బేషరతుగా సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఆ బిల్లులపై చర్చ సందర్భంగా లోక్‌సభలోగానీ, రాజ్యసభలోగానీ ఆ పార్టీ ఎంపీలు నిర్దిష్టమైన సలహాలు, సూచనలు ఇవ్వనే లేదు.
► రైతుల ప్రయోజనాల పరిరక్షణను పట్టించుకోలేదు. బీజేపీకి మళ్లీ ఎలా దగ్గర కావాలన్న లక్ష్యం, తాపత్రయం మేరకే చంద్రబాబు తమ పార్టీ ఎంపీలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. పైగా కార్పొరేట్ మార్కెటింగ్ వ్యవస్థలు ఉండటం మంచిదని కూడా టీడీపీ ఎంపీలు చెప్పడం గమనార్హం.
► చంద్రబాబు ఆదేశాలతో లోక్‌సభలో ఆ పార్టీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ.. ‘మూడు సాగు బిల్లులకు టీడీపీ పూర్తి మద్దతు తెలుపుతోంది. ఆ బిల్లుల ఆవశ్యకత ఎంతైనా ఉంది. బిల్లులో ప్రతిపాదించిన ‘ఇ–ప్లాట్‌ఫాం’ ఎంతో బాగుంది. ప్రత్యామ్నాయ మార్కెటింగ్ వ్యవస్థ ఏర్పాటు మంచిది’ అని స్పష్టంగా చెప్పారు.
రాష్ట్ర, రైతుల ప్రయోజనాల కోసం బలంగా వాదించాలి : సీఎం
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ ఏడాది సెప్టెంబర్ 15న ప్రారంభమయ్యాయి. అంతకు ముందు రోజు అంటే సెప్టెంబర్ 14నే పార్టీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ తాడేపల్లి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమ పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు. పార్లమెంట్‌లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై దిశా నిర్దేశం చేశారు. విభజన చట్టం హామీల అమలుతోపాటు రైతు ప్రయోజనాల పరిరక్షణకు పార్లమెంటులో బలంగా వాదించాలని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment