సాక్షి, అమరావతి: కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ పదవి యనమల రామకృష్ణుడి కుటుంబంలో చిచ్చు రేపింది. యనమల రామకృష్ణుడు తన సోదరుడు యనమల కృష్ణుడిని కాదని తన కుమార్తె దివ్యకు ఇన్‌చార్జి పదవి ఇప్పించుకున్నారు. రెండుసార్లు అక్కడ పోటీ చేసి..ఇన్నాళ్లూ తునిలో పార్టీని నడిపిన తనకు చంద్రబాబు మొండిచేయి చూపడంతో కృష్ణుడు తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు.
చంద్రబాబు, తన అన్న యనమల రామకృష్ణుడు తనను మోసం చేశారని ఆయన సన్నిహితుల వద్ద వాపోయారు. కార్యకర్తల సమావేశం నిర్వహించి ఇటీవల తన ఆవేదనను వ్యక్తం చేశారు. తన అన్న రామకృష్ణుడి రాజకీయ ఎదుగుదలకు 40 ఏళ్లుగా సహకరించానని, ఆయన ఉన్నత పదవుల్లో ఉన్నా నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు లేకుండా చూశానని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు అవకాశవాదంతో తనను పక్కనపెట్టి ఆయన కుమార్తెను ఇన్‌చార్జిగా నియమించడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో చంద్రబాబు బుజ్జగింపుల పర్వం మొదలుపెట్టారు.
బాబుని కలవడానికి ఇష్టపడని కృష్ణుడు..!
బుధవారం ఉండవల్లిలోని తన నివాసానికి యనమల బ్రదర్స్‌ని చంద్రబాబు పిలిపించుకున్నారు. అయితే కృష్ణుడు రావడానికి ఇష్టపడకపోవడంతో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మను పంపి ఆయన్ను ఇంటికి రప్పించారు. యనమల రామకృష్ణుడి సమక్షంలో కృష్ణుడిని చంద్రబాబు బుజ్జగించి భవిష్యత్తులో మంచి అవకాశం ఇస్తానని, పార్టీకి సహకరించాలని బతిమలాడారు.
అనంతరం యనమల కుటుంబంలో వివాదం సద్దుమణిగినట్లు మీడియాకు లీకులు ఇచ్చారు. కానీ కృష్ణుడు ఇంకా అసంతృప్తిలోనే ఉన్నట్లు తెలిసింది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నియోజకవర్గంలో అన్నీ తానై పార్టీ కార్యక్రమాలను నిర్వహించానని కృష్ణుడు గుర్తుచేస్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లో తుని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కృష్ణుడు పోటీ చేశారు.
ఈ సారి కూడా తనకే పార్టీ అధిష్టానం ఎమ్మెల్యే టికెట్ ఇస్తుందని ఆయన ఆశిస్తున్న తరుణంలో బాబు ఆయనకు ఝలక్ ఇచ్చారు. దీంతో బాబు తీరును కృష్ణుడు బాహాటంగానే తప్పుబడుతున్నారు. ఇలా అయితే రానున్న ఎన్నికల్లో మరోసారి పార్టీ చావుదెబ్బ తింటుందని ఆయన తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించారు.
కృష్ణుడికి శఠగోపం
Published Thu, Feb 9 2023 4:54 AM | Last Updated on Thu, Feb 9 2023 4:54 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment