
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఇంకోసారి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తనను రెండు రోజుల పాటు సీఐడీ కస్టడీకి అప్పగిస్తూ ఏసీబీ కోర్టు శుక్రవారం ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ శనివారం ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఆ ఉత్తర్వులను కొట్టేయాలని తన క్వాష్ పిటిషన్‌లో కోర్టును కోరారు. ఈ వ్యాజ్యం తేలేంత వరకు ఏసీబీ కోర్టులో విచారణ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థించారు. 45 ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉన్న తనను అవమానించేందుకే సీఐడీ కస్టడీ కోరిందన్న విషయాన్ని ఏసీబీ కోర్టు పరిగణనలోకి తీసుకోలేకపోయిందని పిటిషన్‌లో పేర్కొన్నారు.
జస్టిస్ శ్రీనివాసరెడ్డి సెలవులో ఉండటంతో ఈ క్వాష్ పిటిషన్ గురించి చంద్రబాబు న్యాయవాది ఎస్.ప్రణతి మరో న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్ రెడ్డి ముందు ప్రస్తావించారు. లంచ్‌మోషన్ రూపంలో శనివారం మధ్యాహ్నం అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు. అత్యవసర విచారణకు న్యాయమూర్తి నిరాకరించారు. సాధారణ పద్ధతిలో తమ ముందు విచారణకు వచ్చినప్పుడే ఈ వ్యాజ్యాన్ని విచారిస్తామని న్యాయమూర్తి జస్టిస్ సురేష్‌రెడ్డి స్పష్టం చేశారు.
పారని పాచిక!
పోలీసు కస్టడీ ఉత్తర్వులను అడ్డం పెట్టుకుని, స్కిల్ కుంభకోణంపై సీఐడీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించి ఏసీబీ కోర్టులో జరుగుతున్న విచారణ తాలూకు తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని చంద్రబాబు తన పిటిషన్‌లో కోరారు. వాస్తవానికి పోలీసు కస్టడీని అడ్డుకోవడం ఇక్కడ చంద్రబాబు వ్యూహం కాదు. ఎందుకంటే పోలీసు కస్టడీ ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు ఒకవేళ లంచ్‌మోషన్ రూపంలో అత్యవసరంగా విచారణ జరిపి ఉన్నా, విచారణ పూర్తయి కోర్టు ఉత్తర్వులు జారీ చేసే సమయానికి ఒక రోజు కస్టడీ ముగుస్తుంది.
మరో రోజు కస్టడీ మాత్రమే మిగిలి ఉంటుంది. సాధారణంగా క్రిమినల్ కేసుల్లో హైకోర్టు తమ ముందు దాఖలయ్యే ప్రతి కొత్త పిటిషన్‌పై వెంటనే పూర్తి స్థాయి విచారణ జరపదు. కేసుకు సంబంధించిన వివరాలను కోర్టుకు సమర్పించేందుకు పోలీసులకు వారం గడువునిస్తుంది. ప్రతి కేసులోనూ హైకోర్టు ఇదే వైఖరి అవలంభిస్తుంది.
ఒకవేళ ఇలానే తమ పిటిషన్‌ను వివరాల సమర్పణ నిమిత్తం ఓ వారానికి వాయిదా వేస్తే, కనీసం అప్పటి వరకైనా ఏసీబీ కోర్టులో జరుగుతున్న విచారణను నిలుపుదల చేయిస్తూ మధ్యంతర ఉత్తర్వుల కోసం కోర్టును గట్టిగా కోరవచ్చన్నది చంద్రబాబు ఎత్తుగడ. ఇక్కడ చంద్రబాబు తన అదృష్టాన్ని పరీక్షించుకోదలిచారు. అయితే ఆయన ఎత్తుగడ పారలేదు.
ఎప్పుడైతే న్యాయమూర్తి అత్యవసర విచారణకు నిరాకరించారో అప్పుడే చంద్రబాబు ఆశలు ఆవిరైపోయాయి. పోలీసు కస్టడీపై తాజాగా దాఖలు చేసిన వ్యాజ్యం సోమవారం విచారణకు వచ్చి, దానిపై కోర్టు విచారణ జరిపినా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఆదివారం సాయంత్రానికల్లా ఏసీబీ కోర్టు ఇచ్చిన రెండు రోజుల కస్టడీ ముగుస్తుంది. దీంతో సోమవారం విచారణకు వచ్చినా ఆ వ్యాజ్యం నిరర్థకం అవుతుంది. ప్రధాన అభ్యర్థనే నిరర్థకం అయినప్పుడు కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉండదు.
వాస్తవానికి ఇంతకు ముందు తనపై సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు, ఆ పిటిషన్‌లో సైతం ఏసీబీ కోర్టులో జరుగుతున్న విచారణకు సంబంధించిన తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. అయితే ఆ క్వాష్ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాస్‌రెడ్డి మధ్యంతర ఉత్తర్వులు కాకుండా ప్రధాన వ్యాజ్యంలోనే తుది తీర్పునిస్తానంటూ, ఆమేర చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను కొట్టేస్తూ శుక్రవారం తీర్పునిచ్చారు. ఏసీబీ కోర్టులో జరుగుతున్న విచారణలో ఏ రకంగానూ జోక్యం చేసుకోవడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. శనివారం జస్టిస్ శ్రీనివాసరెడ్డి సెలవులో ఉండగా, చంద్రబాబు మరో క్వాష్ పిటిషన్ దాఖలు చేయడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment