ఆయన తాజా వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం
ప్లాంట్ పరిరక్షణ బాధ్యత కూటమి ప్రభుత్వానిదే
స్టీల్ ప్లాంట్‌ను నాశనం చేసేందుకు కుట్ర చేస్తోంది
రౌండ్‌టేబుల్ సమావేశంలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక ధ్వజం
2 నుంచి రాష్ట్రవ్యాప్త ఉద్యమం
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై ముఖ్యమంత్రి చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక ధ్వజమెత్తింది. ‘స్టీల్ ప్లాంట్ నష్టాలకు బాధ్యత ఎవరిది? సెంటిమెంట్ కాపాడుతుందా’.. అంటూ సీఎం చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని తెలిపింది. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. విశాఖ స్టీల్‌ను కాపాడేందుకు కేంద్రం చేయాల్సిందంతా చేస్తోందని కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు కితాబు ఇవ్వడాన్ని వక్తలు ఖండించారు.
ఈ సమావేశంలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ, భవిష్యత్ ఉద్యమ కార్యాచరణపై పోరాట వేదిక, కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాలు చర్చించాయి. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నర్సింగరావు మాట్లాడుతూ గత నెలలో పోరాట కమిటీ చంద్రబాబును కలిసిన సందర్భంలో విశాఖ స్టీల్ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారన్నారు. కానీ ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయన్నారు. విశాఖ స్టీల్ అంశంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వ నాయకత్వంలో ఉద్యమం నడపాలని 2021 జూలైలో ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు పోరాట కమిటీకి ఇచ్చిన లేఖను మీడియాకు చూపించారు. విశాఖ ఉక్కు పరిరక్షణ బాధ్యత కూటమి ప్రభుత్వంపైనే ఉందన్నారు. పోరాట వేదిక కన్వీనర్లు జి.ఓబులేషు, వి. ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ విశాఖ స్టీల్‌ను నాశనం చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. స్టీల్ ఫ్యాక్టరీలో ఇప్పటికే రెండు ఫర్నేష్‌లు మూతపడ్డాయన్నారు.
కేంద్ర మంత్రి కుమారస్వామి ఇచ్చిన హామీ మూడు నెలలు అయినా అమలు కాలేదన్నారు. విశాఖ స్టీల్‌ను సెయిల్‌లో విలీనం చేయాలన్నారు. ప్రభుత్వం ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపరిచి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి కేంద్రం వద్దకు తీసుకెళ్లాలని కోరారు.
2 నుంచి ఉద్యమ కార్యాచరణ
విశాఖ స్టీల్ పరిరక్షణ కోసం ప్రత్యక్ష ఆందోళన చేపట్టాలని రౌండ్‌టేబుల్ సమావేశం తీర్మానించింది. ఈ నెలాఖరులోగా జిల్లా కమిటీలను ఏర్పాటు చేసి ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించింది. అక్టోబర్ 2, 3, 4 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, యూనివర్సిటీలు, కళాశాలల్లో ఆందోళనలు చేపట్టాలని తీర్మానించింది. రిలే నిరాహార దీక్షలు, నిరాహార దీక్షలు చేపట్టాలని పిలుపునిచ్చింది.
2న కార్మిక సంఘాలు, 3న రైతు సంఘాలు, 4న విద్యార్థి, యువజన సంఘాలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం చేపట్టాలని కోరింది. ఈ సమావేశంలో ఇఫ్టూ రాష్ట్ర నాయకులు పి.పోలారి, మోహన్, రైతు సంఘం నాయకులు ఎం. కృష్ణయ్య, ఎం. హరిబాబు, వెలగపూడి అజాద్, యం.వెంకటరెడ్డి, కొల్లా రాజమోహన్, యు.వీరబాబు, టీయూసీఐ రాష్ట్ర కన్వీనర్ మరీదు ప్రసాద్ బాబు, రవీంద్రనాథ్, విద్యార్థి సంఘాల నేతలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment