
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు హైదరాబాద్‌కు చెందిన భక్తురాలు రూ.7.50 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు సమర్పించారు. హైదరాబాద్ ఏఎస్‌రావు నగర్‌కు చెందిన డి.వెంకట సత్యవాణి కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి 104 గ్రాముల బంగారపు లక్ష్మీకాసుల హారం, 29 గ్రాముల బంగారపు పచ్చల నక్లెస్, 391 గ్రాముల వెండి పళ్లెం దేవస్థానానికి సమర్పించారు.
వీటిని అమ్మవారి ఉత్సవాలలో ఉపయోగించాలని దాత కోరారు. కాగా, దుర్గమ్మ సన్నిధిలో నిత్యాన్నదానానికి చెన్నై ఇందిరానగర్‌కు చెందిన భోగరం వెంకట మార్కాండేయ శర్మ కుటుంబం రూ.5 లక్షల విరాళాన్ని ఆలయ ఈవో భ్రమరాంబకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించి, అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవ్రస్తాలను అందచేశారు.