
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో నవరత్నాలు– పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా వందేళ్లు చెక్కు చెదరకుండా నిలిచి ఉండేలా.. అత్యంత నాణ్యంగా ఇళ్లు నిర్మించి ఇస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు చెప్పారు. వెలగపూడి అసెంబ్లీ ప్రాంగణంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. సుమారు రూ.1,08,553 కోట్లతో 28,30,227 మంది పేదలకు 2,023 నాటికి ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. తొలి దశలో ఇప్పటికే 15,60,227 ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టామని, రెండో దశలో 12.70 లక్షల ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు. ఇళ్ల నిర్మాణాల కాలనీల్లో రూ.1,200 కోట్లతో తాగునీటి వసతి కల్పించడంతో పాటు రూ.32,909 కోట్లతో రహదారులు, విద్యుత్, డ్రైనేజీ తదితర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్టు చెప్పారు.
నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రతి జిల్లాకు ఒక జాయింట్ కలెక్టర్‌ను ప్రత్యేకంగా నియమించినట్టు చెప్పారు. ప్రతి లేఅవుట్‌కు ఒక మండల స్థాయి అధికారిని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక జిల్లా స్థాయి అధికారిని ఇన్‌చార్జిగా నియమించినట్టు తెలిపారు. ఒక్కో ఇంటి నిర్మాణాన్ని రూ.1.80 లక్షలతో చేపట్టామని, లబ్ధిదారులకు ప్రభుత్వం ఇసుక ఉచితంగా అందిస్తోందన్నారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, అధికారులు ఆయా కంపెనీలతో సంప్రదింపులు జరిపి సిమెంట్, ఇనుము, మెటల్ తదితర మెటీరియల్‌ను మార్కెట్ ధర కంటే తక్కువకు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఆగస్టు 7 లోగా నియోజకవర్గం, డివిజన్ స్థాయిలో సమావేశాలు నిర్వహించి, ఇళ్ల నిర్మాణాల్లో ఎదురవుతున్న సమస్యలపై చర్చించి.. పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment