సాక్షి, అమరావతి: నవరత్నాలు–పేదలందరికీ ఇళ్ల పథకం కింద నిరుపేదలకు ప్రభుత్వం గృహ యోగం కల్పిస్తోంది. జగనన్న కాలనీల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించి గేటెడ్ కమ్యూనిటీల రీతిలో తీర్చిదిద్దుతోంది. రాష్ట్రవ్యాప్తంగా రూ. 75 వేల కోట్ల విలువ చేసే స్థలాలను 30.7 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసింది.
అంతేకాకుండా ఇంటి నిర్మాణానికి రూ. 2.70 లక్షల ఆర్థికసాయం అందజేస్తోంది. 17,005 వైఎస్సార్, జగనన్న కాలనీల రూపంలో కొత్తగా ఊళ్లనే నిర్మిస్తోంది. కాలనీల్లో మౌలిక వసతులను కల్పించి గేటెడ్ కమ్యూనిటీల్లా రూపొందిస్తోంది. ఇందులో భాగంగా 25 అంతకంటే ఎక్కువ ఇళ్లు ఉన్న కాలనీలకు స్వాగత ద్వారాలు నిర్మించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
5,684 ఆర్చిల నిర్మాణానికి శ్రీకారం
21.75 లక్షల (19.13 లక్షల సాధారణ+2.62 లక్షల టిడ్కో) ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. సాధారణ ఇళ్లు నిర్మిస్తున్న 5,684 కాలనీలకు ఆర్చ్‌లు నిర్మించాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.100 కోట్లు ఖర్చు చేసేందుకు పరిపాలన అనుమతులు కూడా మంజూరు చేసింది.
ఇప్పటికే ఈ పనుల కోసం 2,314 ప్రాంతాల్లో టెండర్లను ఖరారు చేయగా వీటిలో 594 కాలనీల్లో పనులు ప్రారంభించారు. పలు కాలనీల్లో వీటి నిర్మాణాలు సైతం పూర్తయ్యాయి. ఖరీదైన ప్రాంతాల్లో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణానికి అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా నిలుస్తోంది. రూ. 32,909 కోట్లతో కాలనీల్లో రోడ్లు, డ్రెయిన్లు, విద్యుత్, నీటి సరఫరా తదితర సౌకర్యాలను కల్పిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment