పలమనేరు నుంచి క్రిష్ణగిరి వరకు నాలుగులైన్ల రోడ్డు
కుప్పం–బెంగళూరు మధ్య గ్రీన్‌ఫీల్డ్ హైవే
నియోజకవర్గ అభివృద్ధికి మళ్లీ ‘కడా’ ఏర్పాటు
కుప్పం బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు
సాక్షి, చిత్తూరు/కుప్పం: రానున్న ఐదేళ్లల్లో కుప్పాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన సీఎం హోదాలో తొలిసారిగా సొంత నియోజకవర్గం కుప్పానికి మంగళవారం వచ్చారు. అక్కడి నుండి శాంతిపురం మండలం జెల్లిగానిపల్లి చేరుకుని హంద్రీనీవా కాలువను సందర్శించారు.
అనంతరం సా.4 గంటలకు స్థానిక ఆర్టీసీ బస్టాండు ఆవరణలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ ఐదేళ్లల్లో కుప్పాన్ని అగ్రస్థానంలో నిలబెట్టి, ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు. పేదరికం లేని సమాజం చేస్తానన్నారు. గత ప్రభుత్వంలో అప్రజాస్వామ్యం, రౌడీయిజం, అన్నా క్యాంటీన్‌పై దాడులు, ఏకంగా తననే బెదిరించే స్థాయి దౌర్జన్యాలతో కుప్పాన్ని భ్రష్టు పట్టించారన్నారు.
కేజీఎఫ్ గనులు, గ్రానేట్ దోపిడీ చేశారన్నారు. ఇకపై అలాంటి పరిస్థితి ఉండదని, అభివృద్ధి బాధ్యత తనేదన్నారు. తనకు ఎవరిపైనా కోపంలేదని, ప్రశాంతమైన పట్టణంగా అభివృద్ధికే కట్టుబడి ఉన్నానన్నారు. ఇకపై కుప్పంలో ఎవరు రౌడీయిజం చేసినా అదే కడపటి రోజు అవుతుందని చంద్రబాబు హెచ్చరించారు. గంజాయి, అక్రమ వ్యాపారాలు చేస్తే అణచివేస్తామన్నారు.
కుప్పం అభివృద్ధికి ‘కడా’ ఏర్పాటు..
ఇక కుప్పం అభివృద్ధి కోసం గతంలో తాను సీఎంగా ఉన్నప్పుడు కుప్పం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (కడా) ఏర్పాటుచేశానని, తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. మళ్లీ ‘కడా’ను ఏర్పాటుచేస్తానని, ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారిని నియమించి అభివృద్ధి చేస్తామన్నారు. కుప్పం నియోజకవర్గంలో మరో రెండు మండలాలుగా మల్లానూరు, రాళ్ళబూదుగూరులను ఏర్పాటుచేయనున్నట్లు ప్రకటించారు.
ఆర్టీసి డిపోను ఆధునీకరించి, ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొస్తామన్నారు. కుప్పంలోని ప్రధాన ఆలయాలను అభివృద్ధి చేస్తానన్నారు. అలాగే, కుప్పంలో విమానాశ్రయం నిర్మించనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. కుప్పంలో ఉత్పత్తి చేసే కూరగాయలు, పండ్లు, పూలు, ఇతర వస్తువులు ఇక్కడి నుంచి దేశవిదేశాలకు ఎగుమతి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. పూలకు ప్రత్యేకంగా మార్కెట్ సదుపాయం కల్పిస్తామన్నారు.
కోళ్ళు, గొర్రెల పెంపకం పరిశ్రమలు ఏర్పాటుచేసి రైతులను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. పాల ఉత్పత్తి సామర్థ్యాన్ని 10 లక్షల లీటర్ల వరకు పెంచే చర్యలు చేపడతామన్నారు. కుప్పంలో ప్రతి కుటుంబాన్ని లక్షలాధికారులుగా తీర్చిదిద్దే బాధ్యత తాను తీసుకుంటున్నట్లు చంద్రబాబు చెప్పారు.
కుప్పం–బెంగళూరు మధ్య గ్రీన్‌ఫీల్డ్ హైవే..
కుప్పం నియోజకవర్గాన్ని తమిళనాడు, కర్ణాటకలతో అనుసంధానం చేసేందుకు ఫోర్‌వే రోడ్లను అభివృద్ది చేయనున్నట్లు సీఎం చెప్పారు. ఇందులో భాగంగా కుప్పం–బెంగళూరు మధ్య గ్రీన్‌ఫీల్డ్ హైవే, పలమనేరు–క్రిష్ణగిరి మధ్య ఫోర్ వే రోడ్లను నిర్మించనున్నట్లు చెప్పారు. అలాగే, హంద్రీ–నీవా కాలువ అభివృద్ధి పనులను గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించి, ట్రాక్టర్లతో నీటిని నింపి సినిమా షో చేసిందని విమర్శించారు.
కానీ, తాను ఈ ఏడాదిలోనే పూర్తిస్థాయిలో కృష్ణాజలాలు కుప్పానికి తీసుకొస్తానన్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులకు భారీ మెజారిటీలు రాగా.. తనకు ఆ స్థాయిలో మెజారిటీ రాకపోవడంపై చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లాలోని 4 లక్షల డ్వాక్రా పొదుపు సంఘాలు అమరావతి నిర్మాణం కోసం రూ.4.5 కోట్లు విరాళం చెక్కులను సీఎంకు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment