108 వాహనంలో ఆడబిడ్డకు జన్మనిచ్చిన రామలక్ష్మి
కొయ్యూరు/దేవరాపల్లి: అత్యవసర వైద్య సేవలందిస్తూ 108 అంబులెన్స్‌లు అపర సంజీవినిలా నిలుస్తున్నాయి. ముఖ్యంగా పురిటి నొప్పులతో బాధపడే గర్భిణులకు మరో జన్మ అందించడమే కాక పండంటి బిడ్డను చేతిలో పెడుతున్నాయి. విశాఖ జిల్లాలో ఆదివారం ఇలాంటి సంఘటనలు రెండు జరిగాయి. కొయ్యూరు మండలం బూదరాళ్ల పంచాయతీ ముకుడుపల్లికి చెందిన గిరిజన మహిళ తాంబేలు లక్ష్మికి పురిటి నొప్పులు రావడంతో 108లో రాజేంద్రపాలెం ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆమెను ఇక్కడ నుంచి నర్సీపట్నం ఆస్పత్రికి రిఫర్ చేశారు.
108 సిబ్బంది లక్ష్మిని నర్సీపట్నం తీసుకెళ్తుండగా కృష్ణాదేవిపేట దాటిన తరువాత నొప్పులు అధికమయ్యాయి. దీంతో ఆమెకు వాహనంలోనే ప్రసవం చేశారు. మగ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం జరిగిన వెంటనే దగ్గరలో ఉన్న గొలుగొండ ప్రాథమిక ఆస్పత్రికి తరలించారు. ఈఎంటీ ఈశ్వరరావు, పైలెట్ కె.వరప్రసాద్‌లను అందరూ అభినందించారు. అలాగే దేవరాపల్లి మండలం మామిడిపల్లికి చెందిన నెక్కెళ్ల రామలక్ష్మి 108 అంబులెన్స్‌లో ప్రసవించింది.
ఆమెకు ఆదివారం తెల్లవారుజాము 5 గంటలకు పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108కి ఫోన్ చేశారు. కె.కోటపాడుకు చెందిన 108 సిబ్బంది మామిడిపల్లి కి చేరుకొని కె.కోటపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో 108 ఈఎంటీ కాన్పు చేశారు. రామలక్ష్మికి ఆడబిడ్డ జన్మించింది. ప్రథమ చికిత్స అనంతరం తల్లీబిడ్డను కె.కోటపాడు సీహెచ్‌సీలో చేర్చారు.
Comments
Please login to add a commentAdd a comment