పిఠాపురం(తూర్పుగోదావరి): సాధారణంగా ఒక్కో గ్రామానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలాగే పిఠాపురం సమీపంలోని చిత్రాడ గ్రామానికీ ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ దాదాపు ప్రతి ఇంటా ఒక లారీ ఉంటుంది. ఏ వీధి చూసినా, రోడ్డు మార్జిన్ చూసినా, ఎవరి ఇంటి వద్ద ఖాళీ స్థలం చూసినా లారీలే కనిపిస్తాయి. సుమారు 2 వేల కుటుంబాలు, 10 వేల జనాభా ఉన్న ఈ గ్రామంలో చిన్న వ్యాన్ నుంచి పెద్ద టాంకర్ల వరకూ సుమారు 500 వరకూ లారీలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. గ్రామ జనాభాలో ఎక్కువ మంది లారీ యజమానులు, డ్రైవర్లు, క్లీనర్లు, మెకానిక్‌లుగానే స్థిరపడ్డారంటే ఆశ్చర్యం కలగక మానదు. గతంలో చిత్రాడకు వ్యవసాయంలో మంచి పేరుండేది.
చదవండి: ఉమెన్స్ బ్యూటీ పార్లర్.. ఆమె డాబూ దర్పం చూసి.. చివరికి లబోదిబో..
ఏడాకుల బీరకు పుట్టినిల్లుగా చెప్పే ఈ గ్రామంలోని రైతులు ప్రతి ఇంటికీ ఒక ఎడ్ల బండి వాడేవారు. రానురానూ ట్రాక్టర్లు కొనుగోలు చేసి ఉపయోగించడం ప్రారంభించారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయం అంతగా గిట్టుబాటు కాని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ పరిస్థితులను చూసి వారు ఏమాత్రం భయపడలేదు. సరికొత్త జీవన మార్గాన్ని ఎంచుకున్నారు. అలా ఇక్కడి వారు రవాణా రంగంలోకి అడుగు పెట్టారు. క్వారీ లారీలు కొనుగోలు చేసి, సరికొత్త వ్యాపారానికి శ్రీకారం చుట్టారు. 216 జాతీయ రహదారిని ఆనుకుని ఉండడంతో పాటు సమీపంలోనే కాకినాడ పోర్టు, అక్కడ ఇతర పరిశ్రమలు ఉండటంతో రవాణా రంగం గణనీయంగా అభివృద్ధి సాధించింది. దీంతో చిత్రాడలో ఒకరిని చూసి మరొకరు లారీలు కొని తిప్పడం ప్రారంభించారు. అలా గ్రామంలో ఎక్కువ మంది దానినే జీవనోపాధిగా మార్చుకున్నారు.
ఎక్కువ మంది మోటార్ ఫీల్డే
గ్రామంలో ఎక్కువ మంది మోటార్ ఫీల్డ్‌లోనే ఉపాధి పొందుతున్నారు. ప్రతి వాహనంపై ఇద్దరి నుంచి నలుగురి వరకూ పని చేస్తుంటారు. సుమారు 2 వేల మంది డ్రైవర్లు, క్లీనర్లు, మెకానిక్‌లుగా ఉపాధి పొందుతున్నారు. 300 మంది వరకూ లారీల యజమానులు ఉన్నారు. వీరితో పాటు వాటర్ సర్వీసింగ్ సెంటర్లు తదితర వ్యాపారాల్లో పలువురు ఉపాధి పొందుతున్నారు.
పండగొస్తే ఊరంతా లారీలే
నిత్యం ఇతర ప్రాంతాలకు లోడ్‌లు వేసుకుని వెళ్లే వాహనదారులు సంక్రాంతి, దసరా, వినాయక చవితి వంటి పండగలకు ఇళ్లకు చేరుతారు. అలా ఎక్కడెక్కడో ఉన్న ఆ లారీలన్నీ ఆ సమయంలో గ్రామానికి చేరుకుంటాయి. ఆ లారీలను శుభ్రం చేసి, ప్రత్యేక పూజలు చేసి, అందంగా అలంకరించి, వాటిపై ఊరంతా తిరిగి ఇక్కడి వారు ఆనందిస్తారు. తద్వారా గ్రామంలో పండగ కోలాహలాన్ని ఇనుమడింపజేస్తారు.
లారీలే జీవనాధారం
మా గ్రామంలో చాలా మందికి లారీలున్నాయి. ఎక్కువ మంది దీనిపైనే ఆధారపడి జీవిస్తున్నాం. మాకు రెండు లారీలున్నాయి. వాటితో మా కుటుంబ పోషణ చూసుకుంటున్నాం. లారీని మా ఇంట్లో ఒక వ్యక్తిగా భావించి, చాలా జాగ్రత్తగా చూసుకుంటాం.
– పులుగుల శ్రీనివాస్, ఓనర్ కం డ్రైవర్, చిత్రాడ
లాభనష్టాలతో సంబంధం లేదు
రవాణా రంగంలో మా గ్రామానికి ఒక గుర్తింపు వచ్చింది. ఎక్కువ మంది ఈ రంగంపైనే ఆధారపడి ఉన్నారు. ఎడ్ల బళ్ల నుంచి పెద్ద లారీల వరకూ వచ్చిన మా ప్రయాణం ఇంకా కొనసాగుతుంది. లాభం వచ్చినా నష్టం వచ్చినా వాహనాలను నడపడం మాత్రం మానరు. లారీలు మా జీవనంలో భాగంగా మారిపోయాయి.
– పులుగుల అప్పారావు, లారీ ఓనర్, చిత్రాడ
నాలుగు టైర్ల లారీలతో ప్రారంభమై..
చిత్రాడలో మూడు దశాబ్దాల కిందట మూడు లారీలతో ఈ సరికొత్త జీవన విధానం ప్రారంభమైంది. ఇప్పుడు గ్రామంలో లారీల సంఖ్య వందల్లోకి చేరింది. క్వారీ లారీలతో ప్రారంభమైన వీరు రానురానూ అవసరాలకు అనుగుణంగా లారీలను కూడా మార్చుకుంటూ వచ్చారు. చిన్న లారీల స్థానంలో ఇప్పుడు పెద్ద లారీలు, ట్యాంకర్లు ఈ గ్రామంలో కనిపిస్తుంటాయి. ఆరు టైర్ల లారీల స్థానంలో ఇప్పుడు 40 టైర్ల లారీలు సైతం నడుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment