కల్తీ నెయ్యి ట్యాంకర్లను జూలై 23నే వెనక్కి పంపించామన్న టీటీడీ ఈవో శ్యామలరావు
అయినా శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిన నెయ్యి వాడారన్న సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: పరమ పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని దేశ, విదేశాల్లో భక్తులు అమృతంగా భావిస్తారు. అలాంటి శ్రీవారి లడ్డూ ప్రసాదంపై రాజకీయ ప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబు పిచ్చికూతలు కూశారు. ఆవు నెయ్యితో కాకుండా జంతువుల కొవ్వుతో తిరుమల లడ్డూలను తయారు చేసి.. భక్తులకు పంపిణీ చేశారని, వాటిని భక్తులు తిన్నారంటూ దారుణమైన అబద్ధాలు చెప్పి కోట్లాది మంది భక్తుల విశ్వాసాలను, మనోభావాలను గాయ పరిచారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యధావిధిగా సీఎం చంద్రబాబుకు వంత పాడారు. నాలుగు కల్తీ నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపేశామని.. శ్రీవారికి సమర్పించే నైవేద్యాలు, లడ్డూ ప్రసాదాల్లో కల్తీ నెయ్యిని వాడలేదని టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) ఈవో జె.శ్యామలరావు జూలై 23నే స్పష్టంగా చెప్పారు. కల్తీ నెయ్యిని శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీలో వాడలేదన్నది స్పష్టమవడంతో భక్తులు, అధ్యాత్మీకవేత్తలు, టీటీడీ అధికార వర్గాల నుంచి తన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తమవుతుండటంతో.. ఆ వ్యాఖ్యలను దేవుడే తనతో చెప్పించాడేమోనంటూ చంద్రబాబు సరికొత్త డ్రామాకు తెరతీశారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరో అడుగు ముందుకేసి ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. పరమ పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదంపై దారుణమైన వ్యాఖ్యలు చేసి.. అపవిత్రం చేసింది సీఎం చంద్రబాబు. ఆయన వల్లె వేసిన అబద్ధాలను సమర్ధించడం ద్వారా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేశారని భక్తులు మండిపడుతున్నారు.
ఈవోకు భిన్నంగా సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు
కల్తీ నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపేశామని టీటీడీ ఈవో శ్యామలరావు పలు సందర్భాల్లో చెప్పారు. శ్రీవారి లడ్డూల తయారీలో కల్తీ నెయ్యిని ఎన్నడూ వాడలేదని స్పష్టం చేశారు. కానీ.. ఈ నెల 18న కూటమి శాసనసభ పక్ష సమావేశంలో తాను కూసిన పిచ్చి కూతలను నిజమని చిత్రీకరించడానికి ఆదివారం సీఎం చంద్రబాబు మరోసారి జంతువుల కొవ్వు కలిసిన నెయ్యితో లడ్డూలు తయారు చేశారని పునరుద్ఘాటించారు.
ఏఆర్ డైరీ ఫుడ్స్ సంస్థ కల్తీ నెయ్యి సరఫరా చేసిందని గుర్తించిన టీటీడీ మార్కెటింగ్ విభాగం.. బ్లాక్ లిస్ట్‌లో ఎందుకు పెట్టకూడదో చెప్పాలంటూ జూలై 28న షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఆ నోటీసుకు సమాధానంగా వెనక్కి పంపిన నెయ్యి ట్యాంకర్ల స్థానంలో టెండర్ నిబంధనల మేరకు కొత్తగా నెయ్యి ట్యాంకర్లు పంపుతామని ఏఆర్ ఫుడ్స్ టీటీడీకి వివరించింది.
కానీ.. దానికి ఒప్పుకోని టీటీడీ ఆ సంస్థను టెండర్ నిబంధన మేరకు బ్లాక్ లిస్ట్‌లో పెడతామని స్పష్టం చేసింది. దీన్ని బట్టి చూస్తే కల్తీ నెయ్యిని శ్రీవారి లడ్డూ తయారీలో కాదు కదా కనీసం టీటీడీ గోదాములోకి కూడా అనుమతించలేదన్నది స్పష్టమవుతోంది.
సిట్ పేరుతో సరి కొత్త డ్రామా
శ్రీవారి లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి, సీబీఐలతో విచారణ జరిపించాలని టీటీడీ ఛైర్మన్లుగా పని చేసిన వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి సవాల్ విసిరారు. లేదంటే చేసిన తప్పునకు శ్రీవారి పాదాల చెంత క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో నిజానిజాలను నిగ్గు తేల్చి.. టీటీడీ ఔన్యత్యాన్ని, భక్తుల విశ్వాసాలను పరిరక్షించాలని కోరుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ లేఖ రాశారు.
సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి, సీబీఐ విచారణ జరిగితే.. తాను చెప్పింది అబద్ధమని తేలుతుందని ఆందోళన చెందిన సీఎం చంద్రబాబు ఆదివారం రాత్రి హడావుడిగా సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్)ను ఏర్పాటు చేసి, దర్యాప్తు చేస్తామంటూ సరికొత్త డ్రామాకు తెరతీశారు.
Comments
Please login to add a commentAdd a comment