
సాక్షి, గుంటూరు: రేపల్లె మండలం లంకెవాని దిబ్బలో జరిగిన అగ్నిప్రమాదంలో ఒడిశా రాష్ట్రానికి చెందిన ఆరుగురు కూలీల మృతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మావనతా దృక్పథంతో స్పందించారు. మృతుల కుటుంబాలకు రూ.3 లక్షలు చొప్పున పరిహారం అందజేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.
బతుకు తెరువు కోసం ఒడిశా నుంచి మన రాష్ట్రానికి వచ్చి అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు మానవతా దృక్పథంతో సాయం అందించాలని సీఎం తెలిపారు. రొయ్యల చెరువు యాజమాన్యం నుంచి కూడా మృతుల కుటుంబాలకు తగిన పరిహారం అందేలా చూడాలని అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.
పగలంతా కాయకష్టం చేసి ఆదమరిచి నిద్రిస్తున్న ఆరుగురు యువకులు నిశిరాత్రి వేళ అగ్నికి ఆహుతయ్యారు. ప్రమాదం నుంచి మరో నలుగురు తప్పించుకుని క్షేమంగా బయటపడ్డారు. లంకెవానిదిబ్బ గ్రామంలోని రొయ్యల చెరువుల వద్ద గురువారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకున్న సంగతి విదితమే. పోలీసుల కథనం ప్రకారం.. ఒడిశాలోని రాయగఢ్ జిల్లా గునుపూర్ మండలానికి చెందిన 25 మంది యువకులు లంకెవానిదిబ్బలోని మండలి బెయిలీ అనే వ్యక్తికి చెందిన రొయ్యల చెరువుల్లో పని చేసేందుకు 15 రోజుల క్రితం వచ్చారు. చెరువుల వద్ద ఉన్న షెడ్లలోనే వారంతా మకాం ఉంటున్నారు. ఎప్పటిమాదిరిగానే గురువారం చెరువుల్లోని రొయ్యలకు మేత వేశారు.
రాత్రి వారంతా భోజనాలు చేసి షెడ్లలోని రెండు గదుల్లో నిద్రకు ఉపక్రమించారు. అర్ధరాత్రి వేళ షెడ్‌లోని ఒక గదిలో అకస్మాత్తుగా పొగలు కమ్ముకుని పేలుడు సంభవించగా, అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. ఆ గదిలో 10 మంది నిద్రిస్తుండగా.. మంటల్లో చిక్కుకుపోయిన నబీన్ సబార్ (23), పండబూ సబార్ (18), మనోజ్ సబార్ (18), కరుణకార్ సబార్ (18), రామ్మూర్తి సబార్ (19), మహేంద్ర సబార్ (20) అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment