CM Jagan Serious On Eenadu News Ramoji For Govt School Education - Sakshi
Sakshi News home page

విద్యారంగాన్ని దెబ్బతీస్తారా?

Published Fri, Nov 4 2022 3:25 AM | Last Updated on Fri, Nov 4 2022 8:41 AM

CM Jagan On Eenadu News Ramoji for Govt School Education - Sakshi

తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

యుద్ధం చేస్తున్నాం..
విద్యారంగంలో తెచ్చిన సంస్కరణల ఫలితాలు రాత్రికి రాత్రి వచ్చేయవు. ఇపుడిప్పుడే క్రమంగా వస్తున్న ఫలితాలు పిల్లల భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దుతాయి. 45 వేల స్కూళ్లను బాగు చేయాలంటే కనీసం 3 నుంచి 4 ఏళ్లు పడుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే అయినా దురదృష్టవశాత్తూ కొన్ని మీడియా సంస్థలు, ప్రతిపక్షాలు వ్యతిరేక వార్తలు, వ్యతిరేక రాజకీయాలతో మంచిని అడ్డుకునే యత్నం చేస్తున్నారు. వారి స్వార్థ రాజకీయాల కోసమే ఇదంతా చేస్తున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. మనం వీటన్నింటితో యుద్ధం చేస్తున్నాం.

పిల్లల భవిష్యత్తుతో ఆటలొద్దు..
రాజకీయంగా జగన్‌ను ఇబ్బంది పెట్టాలి కాబట్టి అసత్యాలతో ఇలాంటి తప్పుడు కథనాలు రాస్తున్నారు. రాజకీయంగా జరుగుతున్న ఈ యుద్ధంలో దురదృష్టవశాత్తూ  సామాన్యులు, తల్లిదండ్రులు, బడిపిల్లలు ఇబ్బంది పడుతున్నారు. వారి స్థైర్యం దెబ్బతినేలా నిరంతరం కథనాలు రాస్తున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి అంటే రామోజీరావుకు, ఈనాడుకు ఇష్టం లేదు. అంత మాత్రాన పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవడం తప్పు. ఇలా తప్పుడు వార్తలు రాయకూడదు.
– సమీక్షలో అధికారులతో సీఎం జగన్‌ 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని విద్యార్థులందరినీ ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దేలా నాణ్యమైన బోధనకు విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా కునారిల్లిపోయిన ప్రభుత్వ విద్యారంగం, ప్రభుత్వ విద్యాసంస్థలను దేశంలోనే అత్యున్నతమైనవిగా తీర్చిదిద్దుతున్నామన్నారు. పునాది పటిష్టంగా ఉంటేనే ఉన్నత స్థాయిలో విద్యార్థులు రాణించగలుగుతారని, అందుకోసమే పునాది విద్య, ప్రాథమిక విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు.

దేశంలోనే తొలిసారిగా ఫౌండేషనల్, ప్రైమరీవిద్యకు పెద్దపీట వేసిన రాష్ట్రం మనదేనని గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని కల్పించి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడమే కాకుండా చదువుకునేందుకు అవసరమైన అన్ని వస్తువులను విద్యా కానుక ద్వారా అందిస్తున్నామన్నారు. విద్యాశాఖపై సీఎం జగన్‌ గురువారం క్యాంపు కార్యాలయంలో ఉన్నత సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలివీ..

స్కూళ్లు తెరిచిన తొలిరోజే..
‘రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా పాఠశాలలు ప్రారంభమయ్యే తొలిరోజే విద్యాకానుక కిట్‌లు అందిస్తున్నాం. కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులుండాలన్న ఉద్దేశంతో స్టూడెంట్‌ కిట్లలో స్కూల్‌ బ్యాగు, బైలింగ్యువల్‌ (ద్విభాషా) పాఠ్యపుస్తకాలు, నోట్‌ బుక్స్, యూనిఫాం, షూ, సాక్సులు, బెల్టు, ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ అందచేస్తున్నాం.

వీటన్నింటినీ ఒకేసారి పిల్లలకు స్కూల్‌ ప్రారంభించే తొలిరోజే ఇస్తున్నాం. గతంలో స్కూల్‌ పిల్లలకు సెప్టెంబరు, అక్టోబరు వరకు కూడా పాఠ్యపుస్తకాలు ఇవ్వలేని దుస్థితి. ఆ విధానంలో మార్పు తెచ్చి స్కూల్‌ ప్రారంభించిన తొలిరోజే పాఠ్యపుస్తకాలు  ఇతర మెటీరియల్‌ అందిస్తున్నాం. గతానికి ఇప్పటికీ ఉన్న పెద్ద తేడా ఇదీ‘ అని సీఎం వివరించారు.

పేద పిల్లలకు పెద్ద చదువులు అందకుండా దుష్ప్రచారం
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న కొన్ని మీడియా సంస్థలు ప్రభుత్వ స్కూళ్ల పిల్లలు,  తల్లిదండ్రుల నైతిక స్థైర్యం దెబ్బ తీసేందుకు తప్పుడు వార్తలతో గందరగోళ పరిచే యత్నాలు చేస్తున్నాయని సీఎం జగన్‌ మండిపడ్డారు. ‘ఇంగ్లీషు మీడియం, ప్రభుత్వ విద్యారంగానికి వారు తొలినుంచి వ్యతిరేకం కాబట్టి ఇలాంటి తప్పుడు వార్తలు రాసి దుష్ప్రచారం చేస్తున్నారు.

ప్రైవేట్, కార్పొరేట్‌ విద్యాసంస్థలకు కొమ్ము కాసే ఆ మీడియా సంస్థలు, విపక్షం కలసి పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలు అధికంగా ఆధారపడే ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా కుట్రలు చేస్తున్నాయి. పేద పిల్లలకు ఇంగ్లీషు మీడియం చదువులు అందడం వాళ్లకి ఇష్టం లేదు. అందుకే ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు’ అని సీఎం విమర్శించారు.

రెండో సెమిస్టర్‌ రాకుండానే పుస్తకాలా?
పాఠ్యపుస్తకాల సరఫరాపై ప్రభుత్వ వ్యతిరేక మీడియాలో వెలువడ్డ తప్పుడు కథనాల అంశం సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. రెండో సెమిస్టర్‌ మొదలైనా పుస్తకాలు అందలేదంటూ తప్పుడు కథనాలు ప్రచురించటాన్ని అధికారులు ఖండించారు.  డిసెంబరులో రెండో సెమిస్టర్‌ ప్రారంభం అవుతుందని, అలాంటిది ఇప్పుడే పుస్తకాలు అందలేదని రాయడం కచ్చితంగా ప్రజలను తప్పుదోవ పట్టించడమేనన్నారు. డిసెంబర్‌లో రెండో సెమిస్టర్‌ ప్రారంభం అవుతుందన్న విషయాన్ని అకడమిక్‌ క్యాలెండర్‌లో పేర్కొన్నామని ప్రస్తావిస్తూ ఇది తెలిసి కూడా తప్పుదోవ పట్టించే కథనాలు ప్రచురించారని అధికారులు సీఎంకు వివరించారు.

ఇది వారి దురుద్దేశాలను తేటతెల్లం చేస్తోందని సీఎం వ్యాఖ్యానించారు. ‘మన ప్రభుత్వం రాగానే పాఠ్యప్రణాళికలో సమూల మార్పులు తెచ్చాం. అదనపు సమాచారం, బైలింగ్యువల్‌ కాన్సెప్ట్‌ వల్ల పాఠ్య పుస్తకాల సైజు పెరిగింది. బైలింగ్యువల్‌ టెక్ట్స్‌బుక్స్‌లో ఒక పేజీ తెలుగు, ఒక పేజీ ఇంగ్లీషు ఉంటుంది. దీంతో సాధారణంగానే టెక్ట్స్‌బుక్స్‌ సైజు పెరుగుతుంది. వాటిని సెమిస్టర్‌ వారీగా విభజించి పంపిణీ చేస్తున్నారు. దీన్ని వక్రీకరించి పిల్లలు, తల్లిదండ్రుల్లో ఆందోళన రేకెత్తించేలా తప్పుడు వార్తలు రాస్తున్నారు’ అని సీఎం పేర్కొన్నారు.

తల్లిదండ్రుల్లో నమ్మకం..
‘మనం అధికారంలోకి రాకముందు 2018–19లో ప్రభుత్వ స్కూళ్లలో 37 లక్షల మంది విద్యార్థులు ఉంటే ప్రస్తుతం 42 లక్షల మంది ఉన్నారు. కోవిడ్‌ టైంలో కూడా మనం ఈ సంఖ్య చేరుకున్నాం. ప్రభుత్వ స్కూళ్లలో అమలు చేస్తున్న సంస్కరణల ఫలితాలు క్రమంగా వస్తున్నాయి. ప్రస్తుతం నాడు – నేడు కార్యక్రమం 15 వేల స్కూళ్లలో జరిగింది.

ఈ ఏడాది సుమారు మరో 22 వేల స్కూళ్లలో, ఆ తర్వాత సంవత్సరం మిగిలిన స్కూళ్లలో జరుగుతుంది. ఇది దశలవారీగా జరిగే ప్రక్రియ. దీనికి మరో 3–4 సంవత్సరాలు పడుతుంది. ఈ పనులన్నీ పూర్తయితే ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత పెరుగుతుంది. ప్రభుత్వం ఈ పనులు చేపట్టి తల్లిదండ్రుల్లో నమ్మకాన్ని కలిగించింది. నాడు–నేడులో చివరి ప్రక్రియ తరగతి గదుల డిజిటలైజేషన్‌. అది జరిగితే నాడు – నేడు పూర్తయినట్లు’ అని సీఎం పేర్కొన్నారు.

ప్రతి తరగతీ డిజిటలైజేషన్‌
స్కూళ్లల్లో ప్రతి తరగతి గది డిజిటలైజేషన్‌ కావాలని సీఎం సూచించారు. ‘విద్యారంగంలో పెడుతున్న ఖర్చును మానవ వనరుల మీద వెచ్చిస్తున్న అతి పెద్ద పెట్టుబడి కింద భావించాలి. ప్రభుత్వ స్కూళ్లలో చదివే పేద పిల్లలకు మంచి భవిష్యత్‌ అందించాలన్నదే మన లక్ష్యం. అప్పుడే వారి జీవితాల్లో మార్పు వస్తుంది. పేదరికం నుంచి బయటపడతారు. విద్య ద్వారా మాత్రమే ఇది సాధ్యం. విద్యారంగంలో చేపడుతున్న మార్పుల విషయంలో రాజీ పడొద్దు.

ఈ విషయంలో ఎలాంటి వెనుకడుగు వేయాల్సిన పనిలేదు’ అని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. జగనన్న గోరుముద్ద అమలు ప్రక్రియ పక్కాగా ఉండాలని ఆదేశించారు. పాఠశాలల్లో పరిశుభ్రమైన వాతావరణం కనిపించాలని, మరుగుదొడ్లు, ఇతర పారిశుధ్య కార్యక్రమాలను పక్కాగా అమలు చేయాలని సూచించారు. స్కూల్‌ మెయింట్‌నెన్స్‌ ఫండ్‌ (ఎస్‌ఎంఎఫ్‌), టాయిలెట్‌ మెయింట్‌నెన్స్‌ ఫండ్‌ (టీఎంఎఫ్‌) వినియోగించుకొని వీటి నిర్వహణకు అధిక ప్రాధాన్యతనివ్వాలన్నారు. 

నాడు–నేడు స్కూళ్లకు సీబీఎస్‌ఈ గుర్తింపు
నాడు–నేడు కింద అభివృద్ధి చేస్తున్న ప్రతి స్కూలుకూ సీబీఎస్‌ఈ గుర్తింపు ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఇప్పటివరకు 1,000 స్కూళ్లకు సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌ వచ్చిందని అధికారులు వివరించారు. 2024–25లో సీబీఎస్‌ఈ పరీక్షలు రాయనున్న విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని బోధనలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.

పటిష్టంగా సబ్జెక్ట్‌ టీచర్ల కాన్సెప్ట్‌
విద్యారంగాన్ని పటిష్టం చేసే చర్యల్లో భాగంగా మూడో తరగతి నుంచే సబ్జెక్టు టీచర్లతో బోధనకు వీలుగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని సీఎం గుర్తు చేశారు. ‘గతంలో క్లాస్‌ టీచర్‌కే అవకాశం లేని పరిస్థితుల నుంచి సబ్జెక్ట్‌ టీచర్‌ కాన్సెప్ట్‌ తెస్తున్నాం. పాఠ్యాంశాలను అదే సబ్జెక్టులో నిపుణుడైన టీచర్‌ బోధించే పరిస్థితి గతంలో లేదు.  సబ్జెక్టు టీచర్‌ కాన్సెప్ట్‌ పేరుతో సంస్కరణలు తెచ్చాం. మూడు నుంచి 10వ తరగతి వరకూ సబ్జెక్ట్‌ టీచర్స్‌ కాన్సెప్ట్‌ సమర్ధంగా అమలు చేయాలి‘ అని అధికారులను సీఎం ఆదేశించారు. 

గత నిర్ణయాల్లో పురోగతి ఇలా
గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు ప్రగతిని అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. బైజూస్‌ కంటెంట్‌ను పాఠ్య ప్రణాళికలో పొందుపరుస్తున్నామని, ఆఫ్‌ లైన్‌లోనూ ట్యాబ్‌లు వినియోగించుకునేందుకు వీలుగా కంటెంట్‌ ప్రీలోడ్‌ చేస్తున్నామని వివరించారు. 2023 ఏప్రిల్‌లోగా తరగతి గదుల్లో డిజిటల్‌ క్లాస్‌ రూమ్స్‌ ఏర్పాటు చేసేలా కార్యాచరణ రూపొందించామన్నారు.

మధ్యాహ్న భోజనానికి సార్టెక్స్‌ బియ్యాన్ని సరఫరా చేస్తున్నామని, మెనూలో కూడా మార్పుచేర్పులకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు. గుడ్లు పాడైపోకుండా పాటించాల్సిన పద్ధతులపై ఎస్‌వోపీలు రూపొందించినట్లు చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి షెడ్యూల్‌ ప్రకారం విద్యాకానుక వస్తువుల కొనుగోలు ప్రక్రియను ముందే చేపట్టామని వివరించారు. ఫేజ్‌– 2 కింద 22,344 పాఠశాలల్లో నాడు–నేడు పనులు కొనసాగుతున్నాయన్నారు. 

పీజీఐ ర్యాంకింగ్‌లో ఏపీకి ఉన్నత స్థానం
కేంద్ర విద్యాశాఖ వెలువరించిన పర్‌ఫార్మెన్స్‌ గ్రేడింగ్‌ ఇండెక్స్‌ (పీజీఐ)లో అగ్రశ్రేణి రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ నిలవడం గర్వకారణమని సీఎం జగన్‌ పేర్కొన్నారు.  ఇందుకు కృషి చేసిన అధికారులను ఆయన అభినందించారు. పాఠశాల విద్య పనితీరు సూచికల్లో రాష్ట్రం అద్భుత పనితీరు కనపరచిందన్నారు. పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగాలలో 2020–21 పనితీరు గ్రేడింగ్‌ సూచీలను (పీజీఐ) కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.

రాష్ట్రాల వారీగా పాఠశాల విద్యావ్యవస్థను విశ్లేషించేందుకు ఇది సాక్ష్యాధారిత ప్రత్యేక సూచీగా నిలుస్తుంది. మొత్తం 70 ఇండికేటర్ల ప్రాతిపదికన 1,000 పాయింట్లను నిర్దేశించారు. ఫలితాలు, పాలనా యాజమాన్యం అనే రెండు కేటగిరీలుగా విభజించారు. వీటిని మళ్లీ అభ్యాస ఫలితాలు, లభ్యత, మౌలిక సదుపాయాలు, ఈక్విటీ, పాలన ప్రక్రియకు సంబంధించిన ఐదు డొమైన్లుగా విభజించి పాయింట్లు కేటాయించారు.

ఇందులో 950 పాయింట్లు సాధించే రాష్ట్రం లెవల్‌–1లో ఉంటుంది. అయితే లెవల్‌–1 జాబితాలో ఏ రాష్ట్రమూ లేదు. 901 నుంచి 950 మధ్య స్కోరు సాధించిన లెవల్‌–2 రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ నిలిచింది. విద్యా రంగంలో చేపట్టిన సంస్కరణలు, విప్లవాత్మక మార్పుల ఫలితంగా రాష్ట్రం ఈ జాబితాలో చోటు దక్కించుకుంది. ఏపీ తొలిసారిగా లెవల్‌–2 చేరుకోవడం గమనార్హం. గతంలో ఎప్పుడూ ఈ స్థాయికి చేరుకోలేదు. ఇలాంటి ప్రగతి సాధించేందుకు కృషి చేసిన అధికారులను సమావేశంలో సీఎం జగన్‌ ప్రత్యేకంగా అభినందించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement