
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి పైడిపల్లి వంశీయు లు అర్చక మిరాశీ కుటుంబానికి చెందిన శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు అర్చకం శ్రీనివాసనారాయణ దీక్షితులు (75) కరోనా బారిన పడి చికిత్స పొందుతూ సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. కొద్దిరోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయన్ని కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు. ఆయన కుమారుడు కృష్ణశేషాచల దీక్షితులు శ్రీవారి ఆలయంలో ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్నారు.
సీఎం జగన్ సంతాపం
శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు అర్చకం శ్రీనివాసనారాయణ దీక్షితులు మృతిపై సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. ఈ కష్ట సమయంలో వారి కుటుంబసభ్యులకు దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆకాంక్షించారు. ప్రధానార్చకుడి మృతిపై టీటీడీ ఉన్నతాధికారులు, అర్చక కుటుంబసభ్యులు సంతాపం తెలిపారు.