సంపూర్ణ సాధికారత | CM Jagan Key Decisions | Sakshi
Sakshi News home page

సంపూర్ణ సాధికారత

Published Sat, Nov 4 2023 5:08 AM | Last Updated on Sat, Nov 4 2023 2:35 PM

CM Jagan Key Decisions  - Sakshi

"అణగారిన వర్గాల అభ్యున్నతికి కుల గణన మరింత దోహదం చేస్తుంది. ఆర్థిక, సామాజిక సాధికారత దిశగా చేయూత అందిస్తుంది. ఇంకా ఎవరైనా అర్హులు ప్రభుత్వ పథకాలు అందకుండా మిగిలి­పోయినా కూడా ఈ గణన ద్వారా తెలుస్తుంది. తద్వారా వారికి లబ్ధి చేకూర్చేందుకు వీలుంటుంది."
-సీఎం జగన్‌మోహన్ రెడ్డి 

సాక్షి, అమరావతి: సంపూర్ణ సామాజిక సాధికా­రతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభు­త్వం సమగ్ర కుల గణనకు శ్రీకా­రం చుడుతోంది. సమా­జంలో అణగారిన వర్గాలకు సామాజిక, రాజకీయ, ఆర్థిక, ఆరోగ్య, విద్యా ఫలాలు అందేందుకు వీలుగా ఈ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దాదాపు శతా­బ్దం తర్వాత రాష్ట్రంలో కుల గణన ద్వారా మరిన్ని పేదరిక నిర్మూలన పథకాలు, మానవ వనరుల అభివృద్ధితోపాటు తారతమ్యాలు, అసమానతలను రూపు మాపేలా ప్రణాళిక రూపొందించింది. శుక్రవా­రం వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి కీలక సమావేశంలో ఈమేరకు కుల గణన నిర్ణయానికి ఆమోదం లభించింది.

సమాచార, పౌర సంబంధాలు, బీసీ సంక్షేమ శాఖల మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మంత్రి మండలి నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. ఈ నెల 20వ తేదీ తర్వాత కుల గణన ప్రక్రియ చేపడతామని తెలిపారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో ఆయా సామాజిక వర్గాల నాయకులతో సమావేశాలు, ఐదు ప్రాంతాల్లో రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు నిర్వహించి అభిప్రాయ సేకరణ చేపడతామన్నారు. కుల గణన చేపట్టాలని కోరుతూ ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపినా స్పందన లేదన్నారు. ఈ నేపథ్యంలో బీసీల ఆత్మ బంధువుగా సీఎం జగన్‌ చేపడుతున్న కుల గణనను ‘సామాజిక సాధికార సురక్ష’గా అభివర్ణించారు.

సంక్షేమ ఒరవడిలో భాగంగా నవంబరు 7వతేదీన వైఎస్సార్‌ రైతు భరోసా సాయం పంపిణీతో పాటు 15వతేదీన భూమిలేని నిరు పేదలకు అసైన్డ్‌ భూముల పంపిణీ, 22–ఏ జాబితా నుంచి ఈనామ్‌ భూముల మినహాయింపు, ఎస్సీ కార్పొరేషన్‌ రుణాల ద్వారా భూమి కొనుగోలు చేసిన వారికి రుణాలను మాఫీ చేయడంతో పాటు వాటిపై పూర్తి హక్కులు కల్పిస్తామన్నారు. ఎస్సీ శ్మశాన వాటికల కోసం భూములు, లంక భూములకు పట్టాల పంపిణీ చేపడతామన్నారు. 28వ తేదీన జగనన్న విద్యా దీవెన, 30న పేదింటి ఆడబిడ్డలకు వైఎస్సార్‌ కళ్యాణ­మస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా అందజేస్తామన్నారు. జర్నలిస్టుల చిరకాల వాంఛ, విజ్ఞప్తిని గౌరవిస్తూ అక్రిడేటెడ్‌ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేసేందుకు సీఎం జగన్‌ సారథ్యంలోని మంత్రి మండలి అంగీకారం తెలిపిందని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లకు 3.64 శాతం డీఏ (01–07–2022 నుంచి) ఇవ్వనున్నట్లు చెప్పారు.

మంత్రి మండలి నిర్ణయాలపై మంత్రి ఏమన్నారంటే..

ఆస్పత్రికి వెళ్లేందుకు రూ.500 ప్రయాణ ఖర్చులు
జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి. ప్రభుత్వం గ్రామ స్థాయి­లో ఇంటింటికీ వెళ్లి పేదల ఆరోగ్యంపై ఆరా తీస్తోంది. ఇప్పటి వరకు 11,710 క్యాంపులను నిర్వహించింది. సుమారు 60 లక్షల మంది శిబిరాల వద్ద వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఇంటి వద్దే 6.40 కోట్ల ర్యాపిడ్‌ టెస్టులు చేశారు. 8,72,212 మందికి కంటి పరీక్షలు చేయగా 5,22,547 మందికి కంటి అద్దాలు అందజేశారు. మిగి­లిన వారికి మెరుగైన వైద్యం కోసం ఆస్ప­త్రు­లకు సిఫారసు చేశారు. జగనన్న ఆరోగ్య సుర­క్షలో భాగంగా వైద్య పరీ­క్షల్లో అనారోగ్య సమ­స్య­లను గుర్తిస్తే చికిత్స విషయంలో సమగ్రంగా ఫాలో అప్‌ చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. గతంలో ఆరోగ్యశ్రీ చికిత్సలు చేయించుకున్న వ్యక్తులు, శిబి­రాల ద్వారా ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకోవాల్సిన వారు, తీవ్ర వ్యాధులతో బాధప­డు­తున్న వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిర్దేశించారు. మెరుగైన వైద్యం కోసం రిఫరెల్‌ను వీడియో కాన్ఫ­రెన్స్‌ ద్వారా/ఆస్పత్రికి పంపించాలన్నారు. వారికి ప్రయాణ ఖర్చులు కింద రూ.500 అందించాలని ఆదేశించారు. చికిత్స సమయంలో, అనంతరం కూడా సకాలంలో మందులు అందించడంతో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్ర­మంలో భాగస్వామ్యం కావాలని దిశానిర్దేశం చేశారు.

కొత్తగా రెండు రవాణా శాఖ యూనిట్లు
తూర్పు గోదావరి జిల్లా నల్లజెర్ల, గోపాలపురం, తాళ్లపూడి మండలాలతో కలిపి దేవరాపల్లిలో రవాణా శాఖకు యూనిట్‌ ఆఫీసు ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో ఒక మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్, ఒక సీనియర్‌ అసిస్టెంట్, ఒక టెక్నికల్‌ సపోర్ట్‌ ఇంజనీర్, ఒక హోంగార్డు నియామకానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో 6 మండలాలు (ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి, రామగిరి, కనగానపల్లె, సీకే పల్లె)తో కలిపి రవాణా శాఖకు కొత్తగా యూనిట్‌ ఆఫీసు నెలకొల్పి ఒక మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్, ఒక సీనియర్‌ అసిస్టెంట్, ఒక జూనియర్‌ అసిస్టెంట్, ఒక టెక్నికల్‌ ఇంజనీరు, ఇద్దరు సెక్యూరిటీ గార్డులు, ముగ్గురు హోంగార్డులను నియమించనున్నాం.

స్కూళ్లలో టెక్నాలజీ వినియోగం
అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మెరుగైన విద్య అందించే చర్యల్లో భాగంగా 6,790 ప్రభుత్వ ఉన్నత పాఠశా­లల్లో ఫ్యూచర్‌ స్కిల్స్‌ ఎక్స్‌పర్ట్స్‌ నియామకానికి మంత్రి మండలి ఆమోదించింది. ఫ్యూచర్‌ స్కిల్స్‌పై బోధన కోసం సమీపంలోని ఇంజనీరింగ్‌ కాలేజీలను మ్యాపింగ్‌ చేసింది. ఇంజనీరింగ్‌ కళాశాలల విద్యార్థులు ట్యాబ్‌లు, డిజిటల్‌ పరికరాలు, యాప్‌లు, ఐఎఫ్‌పీ ప్యానళ్ల వినియోగంపై శిక్షణ ఇస్తారు. వీటిల్లో ఎక్కడైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే సరిదిద్దుతారు.   

భూ కేటాయింపులపై కొత్త పాలసీ
భారీ ప్రాజెక్టుల్లో భాగంగా ఇంటిగ్రేటెడ్‌ ఎలక్ట్రిక్‌ బస్‌ అండ్‌ ట్రక్‌ కాంప్లెక్స్, డీజిల్‌ బస్‌ రిట్రో ఫిటింగ్, బ్యాటరీ ఫ్యాక్‌ అసెంబుల్డ్‌ చేసే పెప్పర్‌ మోషన్‌ సంస్థకు ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు కల్పించింది. ఈ సంస్థ రూ.4,640 కోట్ల పెట్టుబడితో 8,080 మందికి ఉపాధి కల్పించనుంది. పరిశ్రమలకు భూ కేటాయింపులపై కొత్త పాలసీ ‘న్యూ ల్యాండ్‌ అలాట్‌మెంట్‌’కి ఆమోదం లభించింది. ఇకపై లీజు విధానం స్థానంలో సేల్‌ డీడ్‌ ద్వారా కేటాయింపులు జరుగుతాయి. పరిశ్రమల కోసం మాత్రమే ఆ భూమిని వినియోగించేలా తగిన షరతులతో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు.

విద్యుత్‌ రంగంలో..
 ►అనకాపల్లి జిల్లా పూడిమడకలో ఎన్టీపీసీకి థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు కోసం గతంలో ఏపీఐఐసీ 1,200 ఎకరాలు కేటాయించింది. ఇందులో ఎన్టీపీసీ రూ.95 వేల కోట్ల పెట్టుబడితో గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌ ఏర్పాటు చేయడంతో పాటు దీన్ని సబ్‌ లీజ్‌కు ఇచ్చేందుకు కేబినెట్‌ ఆమోదించింది.

►ఏపీ ఫెర్రో అల్లాయిస్‌ ప్రొడ్యూసర్స్‌ అసోసియేషన్‌ విజ్ఞప్తి మేరకు వివిధ రకాల విద్యుత్‌ డ్యూటీలలో ప్రభుత్వం మినహాయింపులు ఇచ్చింది. తద్వారా సుమారు రూ.766 కోట్ల భారాన్ని ప్రభుత్వం భరించనుంది. ఈ పరిశ్రమలపై 50 వేల మంది ఆధారపడటంతో ఈమేరకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

► 902 మెగావాట్ల సామర్థ్యం ఉన్న సోలార్‌ పవర్‌ ప్రాజెక్టు ఏర్పాటు కోసం ఎకోరన్‌ ఎనర్జీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు నంద్యాల, వైఎస్సార్‌ జిల్లాలలో 5,400 ఎకరాలు లీజు ప్రాతిపదికన కేటాయింపు. ఈ కంపెనీ ఎకరానికి ఏడాదికి రూ.31 వేలు చెల్లించనుంది. 

►కర్నూలు జిల్లాలో 800 మెగావాట్ల పవన విద్యుత్‌ ప్రాజెక్టు ఏర్పాటుకు ఎకోరన్‌ ఎనర్జీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు అనుమతి. 

మంత్రి మండలి ఆమోదించిన మరిన్ని అంశాలు 

► పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఖరీఫ్‌ 2023–24 ధాన్యం సేకరణకు మార్క్‌ఫెడ్‌ ద్వారా రూ.5 వేల కోట్ల రుణ సేకరణకు సంబంధించి ప్రభుత్వ గ్యారంటీలకు, రాష్ట్రంలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు అనుమతినిస్తూ గత నెల 30వతేదీన స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు సమావేశం ప్రతిపాదనలకు, రెండు పుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లకు స్పెషల్‌ ప్యాకేజీ ఇవ్వాలన్న ఎస్‌ఐపీబీ నిర్ణయానికి ఆమోదం లభించింది. 

►రహదారుల, భవనాల శాఖలో వసతి గృహాల మెరు­గైన నిర్వహణకు అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో 467 పోస్టుల భర్తీ. 

►పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపాల్టీలో పురపా­లకశాఖ భవన నిర్మాణానికి స్థలం కేటాయింపు. 

►50 ఎకరాల లోపు ఏపీఐఐసీ ద్వారా 285 భూ కేటాయింపులకు ఆమోదం. 

► తిరుపతి జిల్లా పేరూరులో ఎంఆర్‌కేఆర్‌ గ్రూపు హోటల్‌ నిర్మాణానికి అదనంగా మరో 2 ఎకరాలు, వైఎస్సార్‌ జిల్లా గండికోటలో, విశాఖపట్నంలో మే ఫెయిర్‌ గ్రూపులకు గతంలో కేటాయించిన భూములు కాకుండా కొత్త సర్వేనెంబర్లలో భూ కేటాయింపులు.

► విశాఖపట్నానికి చెందిన అంతర్జాతీయ టెన్నిస్‌ క్రీడాకారుడు సాకేత్‌ మైనేని గ్రూప్‌–1 అధికారిగా నియామకానికి ఆమోదం. 

► కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు 4.12 ఎకరాల భూమి కేటాయింపు. ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లెలో ఏపీఐఐసీకి 2.92 ఎకరాల భూమి కేటాయింపు.

► శ్రీకాకుళం, విశాఖపట్నం, నెల్లూరు, అన్న­మయ్య జిల్లాల్లో వివిధ ప్రభుత్వ కార్యాల­యాల ఏర్పాటుకు అవసరమైన భూమి కేటాయింపు.  

► నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం రావూరులో 39.08 ఎకరాల భూమి రామాయపట్నం నాన్‌ మేజర్‌ పోర్టు నిర్మాణం కోసం ఏపీ మారిటైమ్‌ బోర్డుకు కేటాయింపు. 

► రాష్ట్రంలో 100 ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల భర్తీ. ఇందులో 45 పోస్టులు అప్‌గ్రేడేషన్, 55 సూపర్‌ న్యూమరీ పోస్టులు. ఏపీ స్టేట్‌ పోలీస్‌ కంప్లైంట్స్‌ అథారిటీలో విజయవాడతో పాటు విశాఖపట్నం, రాజమండ్రి, గుంటూరు, కర్నూలులో 22 పోస్టుల భర్తీకి ఆమోదం. 

► కర్నూలులో సెకండ్‌ నేషనల్‌ లా యూనివర్సిటీ, స్టేట్‌ క్వాజీ జ్యుడీషియల్‌ అండ్‌ లీగల్‌ ఇనిస్టిట్యూషన్స్‌ ఏర్పాటుకు అవసరమైన మరో 100 ఎకరాల భూమి కేటాయింపు. ఇప్పటికే వీటి కోసం 50 ఎకరాల భూమిని కేటాయించిన ప్రభుత్వం. 

► దేవదాయ శాఖలో సిబ్బంది బలోపేతానికి దేవదాయశాఖ కమిషనర్‌ పరిధిలో ఒక డిప్యూటీ కమిషనర్‌ పోస్టు ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం.

► దేవాలయాలు ఆర్జించే ఆదాయాల ఆధారంగా ఏర్పాటు చేసే పోస్టులకు సంబంధించిన ఆదాయ పరిమితుల పెంపు. గతంలో డిప్యూటీ కమిషనర్‌ పరిధిలో రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు ఉంటే ఇప్పుడు దానిని రూ.7 కోట్ల నుంచి రూ.12 కోట్లకు, జాయింట్‌ కమిషనర్‌ పరిధిలో గతంలో రూ.కోటి పైన ఉంటే దానిని రూ.12 కోట్లు కంటే ఎక్కువ పరిమితి పెంచారు.

► విశాఖపట్నం జిల్లాలో నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా ఇళ్ల పట్టాల లబ్ధి­దారులకు స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ చార్జీలు, యూజర్‌ చార్జీల నుంచి మినహాయింపు. 

► పోలవరం ముంపు గ్రామాల పునరావాసంలో భాగంగా ఏలూరు జిల్లా పరిధిలో పోలవరం, వేలేరుపాడు, కుకునూరు మండలాల పరిధిలో 12,984 కుటుంబాలకు, తూర్పు గోదావరి జిల్లాలో దేవీపట్నం, కూనవరం, వరరామచంద్రపురం మండలాల్లో 3,823 కుటుంబాలకు కేటాయించిన ఇళ్ల పట్టాలకు, భూమి కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయ భూమి కేటాయింపునకు సంబంధించి ఉచితంగా రిజిస్ట్రేషన్‌. 

► విశాఖ జిల్లా పెందుర్తి మండలం నరవలో ప్రముఖ జానపద కళాకారుడు, దివంగత వంగపండు ప్రసాదరావు సతీమణి  వంగపండు విజయలక్ష్మికి 1,000 గజాల ఇంటి స్థలం కేటాయింపు.  

ఇదీ చదవండి: బాబు ఉచిత ఇసుక విధానం.. పేదల కోసం కాదు.. పెద్దల కోసం 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement