AP CM YS Jagan Speech Highlights In Jagananna Amma Vodi Second Phase Launch - Sakshi
Sakshi News home page

‘అమ్మ ఒడి’లో ల్యాప్‌టాప్

Published Tue, Jan 12 2021 3:18 AM | Last Updated on Tue, Jan 12 2021 3:50 PM

CM Jagan Launched Second Phase of Amma Vodi Scheme - Sakshi

నెల్లూరు బహిరంగ సభలో మాట్లాడుతూ ల్యాప్‌టాప్‌ చూపిస్తున్న సీఎం జగన్‌

‘‘పుట్టిన ప్రతి బిడ్డకు అమ్మ ఒడి శ్రీరామరక్ష అయితే చదువులమ్మ బడిలో ఎదిగే పిల్లలకు అమ్మ ఒడి పథకం శ్రీరామరక్ష లాంటిది’’  

కోవిడ్‌ సమయంలో పెద్ద స్కూళ్లు, కాలేజీలు ఆన్‌లైన్‌లో క్లాసులు నిర్వహిస్తే.. ప్రభుత్వ బడుల్లో చదివే పేదింటి పిల్లలు చదువుకు దూరం కావడాన్ని మనమంతా చూస్తున్నాం. ఈ పరిస్థితి మారాలని, ఈ తరం పిల్లలు ఇంగ్లిష్‌ మీడియం, కంప్యూటర్ల వాడకానికి దూరం కారాదనే ఉద్దేశంతో వచ్చే ఏడాది నుంచి అమ్మ ఒడి ద్వారా మీరు కోరుకుంటే నగదుకు బదులుగా ల్యాప్‌టాప్‌ ఇవ్వాలని నిర్ణయించాం. పదేళ్ల తర్వాత మారిన తరంలో ఈ పిల్లలు  వెనుకబడకూడదనే బాధ్యతతో ఒక అన్నగా, తమ్ముడిగా, మీ పిల్లలకు మేనమామగా ఇది చేస్తున్నా
– సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి , నెల్లూరు: రాష్ట్రంలో చదువుల విప్లవాన్ని తెచ్చి 19 నెలల్లో విద్యారంగంపై రూ.24 వేల కోట్లు ఖర్చు చేశామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. బడి వయసు పిల్లలంతా వంద శాతం చదువుకునేలా వచ్చే మూడేళ్లలో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. పిల్లలకు ఓటు హక్కు లేదని గత పాలకులు విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. పిల్లలకు ఓటు హక్కు లేకపోయినా ఒక మేనమామగా వారి మంచి చెడులను చూడడం తన బాధ్యతని స్పష్టం చేశారు. సోమవారం నెల్లూరులోని శ్రీవేణుగోపాలస్వామి కళాశాల ప్రాంగణంలో ‘జగనన్న అమ్మ ఒడి’ పథకం రెండో ఏడాది నగదు జమ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడారు. అమ్మ ఒడి ద్వారా 84 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి కలిగేలా 44.48 లక్షల మందికిపైగా తల్లుల ఖాతాల్లో రూ. 6,673 కోట్ల నగదును బటన్‌ నొక్కడం ద్వారా నేరుగా జమ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వచ్చే ఏడాది నుంచి అమ్మ ఒడి కింద నగదుకు బదులుగా తల్లులు కోరుకుంటే ల్యాప్‌టాప్‌లు ఇస్తామని ప్రకటించారు. పథకంలో కొత్త ఆప్షన్‌ను చేర్చి 9 నుంచి 12 తరగతుల విద్యార్థులకు దీన్ని వర్తింప చేయనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, జలవనరుల శాఖ మంత్రి పోలుబోయిన అనిల్‌  యాదవ్, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఎంపీలు ఆదాల ప్రభాకర్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. సీఎం ప్రసంగంలో ముఖ్యాంశాలివీ...
నెల్లూరు సభలో అమ్మ ఒడి నగదును విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ 

ప్రైవేట్‌ స్కూళ్ల నుంచి 4 లక్షల మంది సర్కారు బడులకు.. 
స్కూలు ఫీజులు కట్టలేక తమ పిల్లలను కూలి పనులకు పంపుతున్న పరిస్థితులను 3,648 కిలోమీటర్లు సాగిన నా పాదయాత్రలో చూశా. ఇలాంటి పరిస్థితులను మార్చేందుకే అమ్మఒడి పథకాన్ని తెచ్చాం. 42.33 లక్షల మంది పేద తల్లులకు గతేడాది రూ.6,400 కోట్లు ఇచ్చాం. ఈ సంవత్సరం 44.48 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.6,673 కోట్లు అమ్మఒడి కింద ఇస్తున్నాం. గతేడాది 82 లక్షల మంది పిల్లలకు లాభం కలిగితే ఈ ఏడాది 84 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతోంది. మరో రెండు లక్షల మందికి ఈ పథకం ద్వారా మేలు జరుగుతోంది. ప్రభుత్వ స్కూళ్లలో గతంలో దాదాపు 38 లక్షల మంది విద్యార్థులుంటే ఇప్పుడు 42 లక్షల మంది ఉన్నారు. నాలుగు లక్షల మంది ప్రైవేట్‌ స్కూళ్ల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. కోవిడ్‌ సమయంలో కూడా అమ్మఒడి పారదర్శకంగా ఇస్తుండటంతో తమ పిల్లలను వారి మేనమామ చూసుకుంటాడన్న నమ్మకం అక్కచెల్లెమ్మల్లో పెరిగింది. 

బడికి రాకపోతే వెంటనే మెసేజ్‌..  
ఇక నుంచి పిల్లలు బడికి రాకపోతే వెంటనే తల్లిదండ్రుల ఫోన్‌కు మెసేజ్‌ వస్తుంది. మూడో రోజు వలంటీర్‌ నేరుగా ఇంటికి వచ్చి పిల్లల యోగ క్షేమాలను విచారిస్తారు. పిల్లలను బడికి పంపే బాధ్యత తల్లిదండ్రులదైతే తీసుకొచ్చే బాధ్యతను గ్రామ సచివాలయానికి అనుసంధానంగా ఉన్న ఉద్యోగులు, వలంటీర్లు, పేరెంట్స్‌ కమిటీతో పాటు టీచర్ల మీద పెడుతున్నాం. ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్రంలోని 55,607 అంగన్‌వాడీ కేంద్రాలను వైఎస్సార్‌ ప్రీ ప్రైమరీ –1, వైఎస్సార్‌ప్రీ ప్రైమరీ – 2, వైఎస్సార్‌ ప్రీ ఫస్ట్‌ క్లాస్‌గా మార్చి ఇంగ్లిష్‌ మీడియంకు శ్రీకారం చుడుతున్నాం. అంగన్‌వాడీల రూపు రేఖలు మార్చడానికి మరో రూ.4 వేల కోట్లు ఖర్చు చేసేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సంపూర్ణ పోషణ పథకం కోసం ఏటా రూ.1,870 కోట్లు ఖర్చు చేస్తున్నాం. గత ప్రభుత్వం ఏటా రూ.550 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. 

టాయిలెట్స్‌ లేక చదువులు మానేస్తున్న దుస్థితి.. 
బడుల్లో సరైన టాయిలెట్స్‌ లేకపోవడం వల్ల 12 నుంచి 23 శాతం వరకు ఆడ పిల్లలు చదువు మానేస్తున్నారని యూనిసెఫ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు చెబుతున్నాయి. టాయిలెట్స్‌ మీద మనం ఖర్చు చేసే ప్రతి ఒక్క రూపాయి మీద రూ.34 ఫలితం వస్తుందని ప్రపంచ బ్యాంకు నివేదికలు చెబుతున్నాయి. అందుకే అమ్మ ఒడి ద్వారా మార్పు కోసం శ్రీకారం చుట్టాం. మేం రూ.వెయ్యి ఇచ్చాం, టాయిలెట్లు ఎందుకు బాగాలేవని హెడ్మాస్టర్లను ప్రశ్నించవచ్చు.  సక్రమంగా నిర్వహించకుంటే 1902కు డయల్‌ చేస్తే సీఎం ఆఫీస్‌ రంగ ప్రవేశం చేస్తుంది.  
పుస్తకాలను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌ 

విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు..
అమ్మఒడి ద్వారా ఇస్తున్న సొమ్మును తమ పిల్లల కోసం మరింత మెరుగ్గా వినియోగించుకునేలా వచ్చే ఏడాది నుంచి ప్రతి అక్క చెల్లెమ్మకు ఒక ఆప్షన్‌ ఇస్తున్నాం. 9 నుంచి 12వ తరగతి విద్యార్థుల తల్లులు కావాలంటే నగదుకు బదులుగా ల్యాప్‌టాప్‌ తీసుకోవచ్చు. బయట మార్కెట్లో రూ.25 వేల నుంచి రూ.27 వేల వరకు ఉండే ఈ ల్యాప్‌టాప్‌ల కొనుగోళ్లకు ప్రభుత్వం పెద్ద కంపెనీలతో చర్చలు జరిపింది. హెచ్‌పీ, డెల్, లెనోవా, ఏసర్, ఎంఐ, ఫాక్స్‌కాన్‌ లాంటి కంపెనీలతో చర్చలు జరపడంతో 18 శాతం జీఎస్టీ కలుపుకుని రూ.18,500కే ల్యాప్‌టాప్‌ ఇవ్వడానికి కంపెనీలు ముందుకు వస్తున్నాయి.

టెండర్లు పిలిచి రివర్స్‌ టెండరింగ్‌ జరపడం వల్ల రేటు ఇంకా తగ్గే అవకాశం ఉంది. 4 గిగాబైట్‌ ర్యామ్, 500 గిగా బైట్‌ స్టోరేజీ, ఇంటెల్‌ ఏఎండీ లేదా సమానమైన ప్రాసెసర్, విండోస్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పాటు విండోస్‌ 365 స్టూడెంట్‌ వెర్షన్‌ స్పెసిఫికేషన్లు కలిగిన ల్యాప్‌టాప్‌లకు టెండర్లు పిలుస్తాం. వసతి దీవెన కింద ఆర్థిక సాయం పొందుతున్న విద్యార్థులకు కూడా ల్యాప్‌టాప్‌లు పొందే ఆప్షన్‌ ఇస్తాం. మూడేళ్ల పాటు వాటి వారెంటీ కూడా సంబంధిత కంపెనీపైనే పెడుతున్నాం. ఒక వేళ ల్యాప్‌టాప్‌ పాడైతే 7 రోజుల్లో బాగు చేసి ఇవ్వాలి. లేదంటే రీప్లేస్‌ చేసి ఇవ్వాలి. ఇందుకోసం వచ్చే మూడేళ్లలో ప్రతి గ్రామానికి ఇంటర్నెట్‌ అందించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. కేవలం అండర్‌ గ్రౌండ్స్‌ కేబుల్‌ వేయడానికే రూ.5,900 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. నిర్వహణ వ్యయం కూడా ఉంటుంది. అయినా సరే ఇది చేస్తున్నాం.

ప్రతిపక్షాలకు కడుపు మంట.. రేపు బడుల మీద పడతారేమో! 
రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాం కాబట్టి ప్రతిపక్షానికి చోటు లేకుండా పోతోందనే కడుపు మంట కనిపిస్తోంది. అది ఏ స్థాయిలో ఉందంటే.. ఎవరూ లేని చోట, రాత్రి పూట విగ్రహాలను ఎవరు ధ్వంసం చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. ధ్వంసమైన విగ్రహాలను పరిశీలిస్తామంటూ మళ్లీ అక్కడకు వారు ఎందుకు వెళ్తున్నారో అర్థం చేసుకోండి. రథాలు ఎందుకు తగలబెడుతున్నారో, ఆ తర్వాత రథయాత్రలు ఎందుకు చేయబోతున్నారో ఆలోచించండి. మనం ప్రజలకు మంచి చేసే ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా సరిగ్గా ఒకటి రెండు రోజులు అటు ఇటుగా చీకట్లో వెళ్లి గుడులను గోపురాలను టార్గెట్‌ చేస్తున్నారు. వీరంతా రేపు బడుల మీదా పడతారేమో.. అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నా. మన కుటుంబాలు ఎదుగుతుంటే, సమాజంలో మంట పెట్టడానికి వస్తున్న వారికి బుద్ధి చెప్పాలని కోరుతున్నా. 

బడికి వచ్చే పిల్లలు ముఖ్యంగా ఆడ పిల్లలు, మహిళా టీచర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు ప్రతి ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లో టాయిలెట్లను నిర్మించడమే కాకుండా నిర్వహణ కోసం అమ్మ ఒడిలో ఇచ్చే రూ.15 వేలల్లో రూ.1,000 మినహాయిస్తున్నాం. ఇంత డబ్బు ఖర్చు చేస్తున్న ప్రభుత్వానికి ఈ వెయ్యి రూపాయలు ఎక్కువ కాకపోయినా పిల్లల చదువుకునే బడి, పరిశుభ్రతను వారి డబ్బుతోనే నిర్వహిస్తే జవాబుదారీతనం, పరిస్థితులు మెరుగు పడతాయనే ఉద్దేశంతో మినహాయిస్తున్నాం.

దైవ భక్తి లేని వారు.. దేవాలయ భూములు కాజేసిన వారు.. పట్టపగలు గుడులను కూల్చిన వారు.. చివరికి అమ్మవారి ఆలయంలో క్షుద్రపూజలు చేసిన వారు ఇవాళ ఉన్నట్లుండి కొత్త వేషాలు కడుతున్నారు. దేవుడి మీద ప్రేమ ఉన్నట్లు డ్రామాలాడుతున్నారు. కోవిడ్‌కు భయపడి ప్రతి పక్షనేత, ఆయన కుమారుడు హైదరాబాద్‌లో దాక్కుంటున్నారు. సామాన్య ప్రజలు చస్తే ఎంత? బతికితే ఎంత? అని ఎలక్షన్‌ నోటిఫికేషన్‌ ఇస్తున్న బాబు కోవర్టులు పదవుల్లో ఎలా ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతున్నా. పేదలకు మంచి చేయడానికి అడుగులు ముందుకు వేస్తే అడ్డు తగులుతూ ఏకంగా దుర్మార్గపు ఆర్డర్లు ఇస్తున్న పరిస్థితిని గమనించాలని కోరుతున్నా. 

మామ మనసు చాలా గొప్పది..
దేశంలోనే అద్భుతమైన పథకం అమ్మ ఒడి ద్వారా ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో ఏటా రూ.15 వేలు జగన్‌ మామ జమ చేస్తున్నారని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గిద్దలూరు హైస్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న టి.ఆశ్రిత ఆనందం వ్యక్తం చేసింది.   సంక్షేమ పథకాల అమలు తీరుపై ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యాకానుక, వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ, పేదలందరికీ ఇళ్లు తదితర పథకాలను సీఎం జగన్‌ ప్రవేశ పెట్టారని గుర్తు చేసింది. ఇంగ్లిష్‌ను ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశ పెట్టి పేదల పట్ల జగన్‌ మామ గొప్ప మనసును చాటుకున్నారని పేర్కొంది. నాడు–నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్లలో చక్కటి సదుపాయాలు సమకూర్చారని, బ్లాక్‌ బోర్డులు, డ్రింకింగ్‌ వాటర్, టాయిలెట్స్‌ బాగు చేశారని, తమ కుటుంబంలో నాలుగు పథకాల ద్వారా లబ్ధి పొందామని తెలియచేస్తూ జగన్‌ మామకు కృతజ్ఞతలు తెలిపింది. 

ఇలాంటి సీఎం ఉంటే నేనూ చదివేదాన్ని..
ఇళ్లలో పనులు చేసుకుంటూ పొట్ట పోషించుకునే నేను మా అమ్మాయిని ప్రైవేట్‌ స్కూల్‌లో చేర్చి ఎనిమిదేళ్లు ఫీజులు కట్టలేక అల్లాడిపోయాను. ఇక నావల్ల కాదని భావించి నాతోపాటు పనికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నా. ఆ సమయంలో అమ్మఒడి ద్వారా నా కోరిక నెరవేరింది. జగనన్న విద్యాకానుక ద్వారా ఇచ్చిన వస్తువులు బయట కొనాలంటే రూ.7 వేలు అయ్యేవి. ఆ వస్తువులు రూ.10 వడ్డీతో ప్రైవేట్‌ స్కూళ్లలో కొనుగోలు చేయాల్సి వచ్చేది. నా చిన్నప్పుడు ఇలాంటి సీఎం ఉంటే నేనూ చదువుకునేదాన్ని. 
– వెంకట రమణమ్మ, విద్యార్థిని తల్లి, గుమ్మళ్లదిబ్బ, కోవూరు మండలం, నెల్లూరు జిల్లా 

అమ్మ ఒడిని అడ్డుకోవాలని చూశారు
ప్రతిపక్ష నేత చంద్రబాబు కుటిల, నీచ రాజకీయాలతో జగనన్న అమ్మ ఒడి కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చూశారని మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ ధ్వజమెత్తారు. జగనన్న అమ్మ ఒడి రెండో విడత కార్యక్రమంలో అనిల్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టేందుకు నిర్ణయించగా.. చంద్రబాబు కోర్టులో కేసు వేయించారన్నారు. ఇప్పుడు పేద విద్యార్థుల చదువు కోసం అమలు చేస్తున్న అమ్మఒడి సాయంతో మహిళలు మహా సంక్రాంతి జరుపుకుంటుంటే అడ్డుకునే ప్రయత్నం చేశారని దుయ్యబట్టారు. విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ.. అమ్మ ఒడి కార్యక్రమానికి ప్రతిపక్షం ఎన్నో అడ్డంకులు సృష్టించినా.. కుట్రల్ని ఛేదించుకుని పథకాన్ని మరింత ఎక్కువ మందికి వర్తింప చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ.. దివంగత సీఎం వైఎస్సార్‌ సంక్షేమంలో పది అడుగులు వేస్తే.. ఆయన బిడ్డగా సీఎం జగన్‌ వంద అడుగులు ముందుకు వేస్తున్నారన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement