‘సిద్ధం’ బహిరంగ సభలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్
మనం వేసే ఈ ఓటు పేదవాడిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చే ఓటు. 10, 15 సంవత్సరాల తర్వాత మన పిల్లలు నిటారుగా నిలబడి పెద్దల పిల్లల మాదిరిగా ఇంగ్లిష్లో అనర్గళంగా మాట్లాడుతూ, పెద్ద పెద్ద కంపెనీలలో రూ.లక్షల జీతాలు తీసుకునేందుకు బాటలు వేసే ఓటు. పేదవాడు బతకాలన్నా, పేదవాడికి మంచి జరగాలన్నా, మంచి భవిష్యత్తు ఉండాలన్నా.. నిర్ణయించే ఓటు.
జరిగిన మంచి కొనసాగాలంటే మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉంటేనే జరుగుతుంది. ఈ రోజు చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో మార్పు తీసుకువచ్చింది మీ బిడ్డే.. ఎన్నికలంటే ఒక ఎన్నికల మేనిఫెస్టో ఇస్తారు. కేజీ బంగారం, బెంజ్ కారు ఇస్తామని మోసం చేస్తారు. కానీ విశ్వసనీయతకు నిజంగా అర్థం చెప్పింది మాత్రం మీ బిడ్డ జగన్ మాత్రమే. చేయగలిగిందే చెబుతాడు. కానీ ఒకసారి చెప్పిన తర్వాత చేస్తాడంతే. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: మనందరి ప్రభుత్వ పాలనలో మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీరే నా సైనికులని, ప్రతి ఇంటి నుంచి ఒక స్టార్ క్యాంపెయినర్ బయటకు రావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ప్రతి అక్క, చెల్లెమ్మ, అవ్వ, తాత, రైతన్న.. ఇలా మంచి జరిగిన వారంతా మీ బిడ్డ ప్రభుత్వానికి తోడుగా నిలిచేలా వారందరినీ సంసిద్ధం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ కనీసం వంద మందికి మన ప్రభుత్వం చేసిన మంచిని వివరించాలని కోరారు.
భీమిలి నియోజకవర్గం తగరపువలస జంక్షన్ వద్ద శనివారం ‘సిద్ధం’ పేరుతో ఏర్పాటు చేసిన ఉత్తరాంధ్ర వైఎస్సార్ కుటుంబ సమావేశంలో ఆయన మాట్లాడారు. మీ బిడ్డకు అబద్ధాలు, కుతంత్రాలు, కుట్రలు, మోసాలు తెలియదని స్పష్టం చేశారు. మీ బిడ్డ పొత్తులు, జిత్తులను నమ్ముకోలేదని చెప్పారు. ‘మీ బిడ్డ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5ని నమ్ముకోలేదు. దత్తపుత్రుడిని నమ్ముకోలేదు. మీ బిడ్డ నమ్ముకున్నది పైన దేవుడిని, కింద మిమ్మల్ని మాత్రమే’ అని అన్నారు. అందరికీ మంచి చేయాలన్న లక్ష్యంతోనే అడుగులు ముందుకు వేశానన్నారు.
ఈ విషయాలన్నింటినీ ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పాలని కోరారు. ‘మీ బిడ్డ తరఫున మీరే సైనికులుగా నిలబడాలని చెప్పండి. ప్రతి ఇంటి నుంచి ఒక స్టార్ క్యాంపెయినర్ బయటకు రావాలని అడగండి’ అని పిలుపునిచ్చారు. ‘రూ.2.53 లక్షల కోట్లు బటన్ నొక్కి అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా వేశాం. ఎవరూ లంచాలు అడగ లేదు. వివక్ష చూప లేదు. మనం బటన్ నొక్కడంతో రాష్ట్రంలో 84 శాతం ఇళ్లకు మంచి జరిగింది. గ్రామాల్లో 92 శాతం ఇళ్లకు మేలు జరుగుతోంది. ఇంత మంచి ప్రతి గ్రామంలో జరిగిందన్న విషయాన్ని ప్రతి ఇంటికి వెళ్లి వివరించాలన్నారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే..
కార్యకర్తలను గెలిపించే పార్టీ వైఎస్సార్‌సీపీ
► వార్డు మెంబర్లు, సర్పంచ్‌లు, ఎంపీపీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, జెడ్పీ చైర్‌పర్సన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, చైర్మన్లు, కార్పొరేటర్లు, మేయర్లు, నామినేటెడ్ పోస్టులలో ఉన్న చైర్మన్లు, డైరెక్టర్లు ఇతర ప్రజాప్రతినిధులు. వీరితోపాటు ప్రతి నాయకుడు, కార్యకర్త, అభిమానికి ఒక విషయం చెబుతున్నా.. ఇది ఒక జగన్ పార్టీ కాదు. ఇది మీ అందరి పార్టీ అని గుర్తుంచుకోండి. మీ బిడ్డ కేవలం మీ అందరికీ, ప్రజలకు ఓ మంచి సేవకుడు మాత్రమే.
కార్యకర్తలను, నాయకులను అభిమానించే విషయంలో, వారికి పదవులు, అధికారం ఇచ్చే విషయంలో, రాష్ట్ర చరిత్రలోనే కాదు.. దేశ చరిత్రలో ఏ పార్టీ చేయని విధంగా చేశాం. కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చైర్మన్లు, డైరెక్టర్లును నియమించిన ప్రభుత్వం మనది. మార్కెట్ యార్డులు, దేవాలయాల బోర్డుల్లో మొత్తంగా నామినేటెడ్ పదవుల భర్తీ చేసే విషయంలో ఏకంగా 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చైర్మన్లు, డైరెక్టర్లు ఇవ్వడం కేవలం మీ బిడ్డకే సాధ్యమైందని చెప్పడానికి గర్వపడుతున్నా.
► 56 నెలల పాలనలో ప్రతి ఇంటికి మంచి చేయగలిగాం కాబట్టే.. వివక్ష, లంచాలు లేని పాలన ఇవ్వగలిగాం కాబట్టే.. ఇవాళ ఎవరైనా మన పార్టీ తరుఫున వార్డు మెంబర్ నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కార్పొరేటర్, ఎమ్మెల్యే, ఎంపీ వరకు.. ఏ పదవికి పోటీ చేసినా సాధారణ మెజారీ్టతో కాదు.. గొప్ప మెజారీ్టతో గెలిపించి ఆ స్థానాల్లో కూర్చో బెడతారు. వైఎస్సార్‌సీపీలో ఉన్న వారు, పార్టీ కోసం కష్టపడిన వారందరికీ అంచెలంచెలుగా ఏ రాజకీయ పార్టీలో ఇవ్వని అవకాశాలు ఇచ్చామని గర్వంగా చెబుతున్నా.
చంద్రబాబుకు ఓటేస్తామని అనగలరా?
► అక్కచెల్లెమ్మలకు మంచి చేసే విషయంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా దేశంతో మనం పోటీ పడుతున్నాం. వారి కోసం ఆసరా, అమ్మ ఒడి, సున్నా వడ్డీ, చేయూత, లక్షాధికారులను చేయాలని 35 లక్షల ఇళ్ల పట్టాలు, అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణం, ఇలా ఇంటింటికి మేలు చేసింది మీ బిడ్డ ప్రభుత్వం. 2014 ఎన్నికల ప్రణాళికలో రూ.14,205 కోట్ల పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేశాడు.
ప్రతి ఏటా సబ్సిడీపై 12 సిలిండర్లు ఇస్తామని మోసం చేశాడు. బ్యాంకుల్లో ఉన్న బంగారాన్ని విడిపిస్తానని మోసం చేసిన చరిత్ర. సున్నా వడ్డీని 2016 అక్టోబర్ నుంచి నిలిపివేసి దుర్మార్గానికి పాల్పడిన చరిత్ర. ఇళ్ల పట్టాలు ఒక్కటి కూడా పేద కుటుంబానికి ఇవ్వకపోవడం చంద్రబాబు చేసిన ఇంకో మోసం. అన్నింటిలోను మోసమే.
► ఇవన్నీ చూసినా తర్వాత, నిజాలు తెలిసిన తర్వాత.. ఏ ఒక్కరైనా కూడా మీ బిడ్డ ప్రభుత్వానికి ఓటు వేయకుండా, తోడుగా నిలబడకుండా ఉండగలరా? చంద్రబాబుకు ఓటు వేస్తామని అనగలరా? కులం, మతం, పార్టీ చూడకుండా, అర్హత ఉన్న ప్రతి పేదవాడికి లబ్ధి కలిగించాం. అక్కచెల్లెమ్మల గత 10 సంవత్సరాల బ్యాంకు ఖాతాలను చూస్తే ఎవరెంత మేలు చేశారో తెలుస్తుంది. కోవిడ్ కష్టాలు ఎన్ని వచ్చినా మీ బిడ్డ ఆ పేద వాడి ముఖంలోను, కుటుంబంలో చిరునవ్వులు చూడాలని ఆరాటపడ్డాడు. ఈ విషయాలన్నీ అక్కచెల్లెమ్మలకు, అవ్వాతాతలకు, రైతన్నలకు చెప్పండి.
► గతంలో చంద్రబాబు జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసి వారి కార్యకర్తలకే.. అదీ కొద్ది మందికే సంక్షేమ పథకాలు ఇచ్చారు. ఆ స్థానంలో మనం చదువుకున్న పిల్లలను తీసుకువచ్చి వలంటీర్ల వ్యవస్థ ఇంటింటికి వెళ్లి లంచాలు, వివక్ష లేకుండా ప్రతి పథకాన్ని అందిస్తున్నాం. జగనన్న అన్నీ వలంటీర్ల చేతుల్లోనే పెట్టాడని కొందరు అనుకోవచ్చు. ఆ వలంటీర్లు ఎవరో కాదు. వారు కూడా మనల్ని, మన పార్టీని అభిమానించే మనలో నుంచి వచ్చిన మనవారే.
ఈ ఎన్నికలు ఎంత ముఖ్యమో చెప్పాలి
∙ఈ ఎన్నికలు ఎంత ముఖ్యమో, ఎంత అవసరమో ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి. కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకోడానికి మాత్రమే కాదు. పేద కుటుంబాల భవిష్యత్తు, వారిని నడిపించే భవిష్యత్తు. ప్రతి పేదవాడి భవిష్యత్తు మారాలంటే ఈ ఎన్నికల్లో జగనే మళ్లీ రావాలని చెప్పండి. విద్య, వైద్యం కోసం అప్పులు చేసే పరిస్థితి రాకూడదంటే మళ్లీ జగనే రావాలని వివరించండి. అక్కచెల్లెమ్మల సాధికారత కొనసాగాలంటే మళ్లీ జగనే సీఎం కావాలని చెప్పండి. రైతు భరోసా, ఉచితంగా ఇన్సురెన్స్, ఇన్‌పుట్ సబ్సిడీ, ఆర్బీకే వ్యవస్థ కొనసాగింపు.. ఇలా ఏది జరగాలన్నా జగన్ ముఖ్యమంత్రిగా ఉండాలని విడమరచి చెప్పండి.
►ఈ రోజు 56 నెలల్లోనే ఇచ్చిన ఏ స్కీం కొనసాగాలన్నా, భవిష్యత్తులో పెరగాలన్నా, ఇంటికే ఆ పెన్షన్, డీబీటీ స్కీంల మంచి జరగాలన్న మీ అన్న ప్రభుత్వం మాత్రమే చేయగలదు. ప్రతిపక్షాలకు ఓటు వేయడమంటే దాని అర్థం, స్కీంలన్నీ వద్దు, రద్దుకు మీరే ఆమోదం తెలిపినట్టే. లంచాలు, వివక్షతో కూడిన జన్మభూమి కమిటీల వ్యవస్థకు ఓటు వేయడమే. ఇలా ఏ మంచి చేయని, పొత్తు లేకపోతే పోటీ చేయలేని, పోటీ చేయడానికి అభ్యర్థులే లేని వీరంతా పెద్ద పెద్ద డైలాగ్‌లు కొడుతుంటే ‘ఓటి కుండకు మోత ఎక్కువ.. ఉత్త గొడ్డుకు అరుపులెక్కువ. చేతకాని వాడికి మాటలెక్కువ’ అనే సామెతలు గుర్తుకొస్తున్నాయి.
మేము సైతం..
ముఖ్యమంత్రి జగన్‌కు జైకొట్టిన పార్టీ శ్రేణులు
సాక్షి, విశాఖపట్నం: సిఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు మేము సైతం కురుక్షేత్ర సంగ్రామానికి సిద్ధమేనని నినదించాయి. లక్షల గొంతులు ఏకమై తమ సంఘీభావాన్ని తెలిపాయి. సంగివలసలో జరిగిన ‘సిద్ధం’ బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ చేసిన ప్రసంగం పార్టీ క్యాడర్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలు, కులమతాలకతీతంగా జరిగిన మేళ్లను ఆయన సోదాహరణంగా వివరించిన తీరు వారిని మంత్రముగ్ధులను చేసింది.
ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను గెలిపించేవే కాదు.. అన్ని వర్గాల ప్రజలకు వైఎస్సార్‌సీపీ పాలనలో కొనసాగేందుకు దోహదపడేవన్న వాస్తవాన్ని అందరికీ చెప్పండి’ అంటూ సీఎం జగన్ చేసిన విజ్ఞప్తి పార్టీ శ్రేణులను ఎంతగానో ఆలోచింపజేసింది. చంద్రబాబు హయాంలో జరిగిన మోసాలను సభలో కళ్లకు కట్టినట్టు వివరించిన తీరు ఆకట్టుకుంది. 2019కి ముందు, తర్వాత రాష్ట్ర ప్రజలకు ఒనగూరిన ప్రయోజనాల్లో వ్యత్యాసాలను గుర్తించాలని ప్రజలను కోరాలని సూచించారు.
వలంటీర్ల వ్యవస్థతో పాటు నుంచి సచివాలయాల ద్వారా అవినీతి లేని సుపరిపాలన, ఆర్బీకేలు, విలేజి క్లినిక్‌లు, ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్ష, నాడు–నేడు వంటి వాటి వల్ల చేకూరే ప్రయోజనాలు, హామీలో 99 శాతం అమలు చేసిన తీరును సోదాహరణంగా వివరించడంతో సభికులంతా అచ్చెరువొందారు. సభలో సరిగ్గా గంటా 17 నిమిషాల సేపు జరిగిన సీఎం ప్రసంగం ఆద్యంతం ఎంతో పరిణతితో సాగింది.
భావితరాల భవిష్యత్‌కు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కొనసాగడం ఎంత అవసరమో తేటతెల్లం చేసిందని భావిస్తున్నారు. సీఎం మాట్లాడే సమయంలో అప్పుడప్పుడూ ప్రజలు సీఎం.. సీఎం అంటూ అభివాదాలు చేశారు. వచ్చే ఎన్నికలకు ఎలా సన్నద్ధం కావాలో, ప్రతిపక్షాల కుట్రలను ఎలా తిప్పికొట్టాలో సవివరంగా వివరించడంతో వైఎస్సార్‌సీపీ మరోసారి విజయదుందుభి మోగించేందుకు కంకణం కట్టుకుంటామంటూ పార్టీ క్యాడరు, నాయకులు ఉత్సాహంతో ఉన్నారు.
పర్యటన సాగిందిలా..: సీఎం జగన్మోహనరెడ్డి శనివారం మధ్యాహ్నం 3:12 గంటలకు విమానంలో విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి 3.26 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి సంగివలస వద్ద ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. అక్కడ నుంచి సభాస్థలి వద్దకు 3.55 గంటలకు చేరుకున్నారు. సాయంత్రం 4.10 గంటలకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగించారు. అక్కడ నుంచి 10 నిమిషాల పాటు బహిరంగ సభలో ఏర్పాటు చేసిన ర్యాంప్‌పై నుంచి కార్యకర్తలకు అభివాదం చేసుకుంటూ నడిచారు. సభ పూర్తయిన తరువాత హెలికాఫ్టర్‌లో సాయంత్రం 5.55 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి 6.07 గంటలకు విమానంలో విజయవాడకు తిరుగు పయనమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment