AP 3 Capitals Bill: CM YS Jagan Comments On Bill Withdraw - Sakshi
Sakshi News home page

AP 3 Capitals Bill Withdraw: ఈ ప్రాంతం అంటే నాకు వ్యతిరేకత లేదు: సీఎం జగన్‌

Published Mon, Nov 22 2021 3:21 PM | Last Updated on Mon, Nov 22 2021 4:08 PM

CM YS Jagan Comments On AP Three Capitals Withdraw Bill At Assembly - Sakshi

సాక్షి, అమరావతి: 1953 నుంచి 1956  వరకు ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా కర్నూలు ఉండేదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం మూడో రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రాజధాని అంశంపై ఏపీ అసెంబ్లీలో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రసంగించారు. గుంటూరులో హైకోర్టు ఉందేదని చెప్పారు. ఈ ప్రాంతం అంటే తనకు వ్యతిరేకత లేదని, తన ఇల్లు కూడా ఇక్కడే ఉందని తెలిపారు. అయితే ఇక్కడ కనీస వసతులు లేవని చెప్పారు. కనీస వసతులకు ఎకరాకు రూ.2 కోట్లు అవుతాయిని సీఎం జగన్‌ తెలిపారు. 

చదవండి:  AP Assembly Session 2021: త్వరలోనే సమగ్రమైన పూర్తి వికేంద్రీకరణ బిల్లుతో ముందుకు వస్తాం: సీఎం జగన్‌

రాజధానుల వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందిన వెంటనే మూడు ప్రాంతాలకూ న్యాయం చేసేలా మూడు రాజధానుల ప్రక్రియ ప్రారంభమై ఉంటే, ఈ రోజుకు దాని నుంచి మంచి ఫలితాలు ఈ పాటికే అందుబాటులోకి వచ్చేవని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. నాటి శ్రీబాగ్‌ ఒడంబడిక స్పూర్తితో, వెనకబడ్డ ఉత్తరాంధ్ర సహా అన్ని ప్రాంతాలూ కూడా సమాన అభివృద్ధి చెందాలన్న ఆకాంక్షతో వికేంద్రీకరణ బిల్లుల్ని ప్రవేశపెట్టటం జరిగిందని గుర్తుచేశారు. గతంలో కేంద్రీకరణ ధోరణలు, వీటిని ప్రజలు ఎంతగా వ్యతిరేకించారో, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన తీర్పు ద్వారా  ప్రస్ఫుటంగా వ్యక్తమయిందని తెలిపారు. మరోసారి హైదరాబాద్‌ లాంటి సూపర్‌ క్యాపిటల్‌ మోడల్‌ వద్దే వద్దని, అటువంటి చారిత్రక తప్పిదానికి ప్రభుత్వం పాల్పడరాదని ప్రజల తీర్పు స్పష్టం చేసిందని చెప్పారు. కాబట్టే వికేంద్రీకరణే సరైన విధానం అన్నది బలంగా నమ్మి అడుగులు ముందుకు వేశామని తెలిపారు. 

అన్ని ప్రాంతాలు, అన్ని కులాలు, అన్ని మతాలు.. వీరందరి ఆశలూ, ఆకాంక్షలూ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది కాబట్టే, వాటిని ఆవిష్కరించింది కాబట్టే, తమ ప్రభుత్వానికి గడచిన ఈ రెండున్నరేళ్లలో జరిగిన ఏ ఎన్నికల్ని తీసుకున్నా ప్రజలు మనసారా దీవిస్తూ వచ్చారని సీఎం చెప్పారు. అయితే, వికేంద్రీకరణకు సంబంధించి అనేక  అపోహలు, అనేక అనుమానాలు, అనేక కోర్టు కేసులు, న్యాయపరమైన వివాదాలు, దుష్ప్రచారాలు.. ఇలా ఈ రెండేళ్ల కాలంలో వీటినే ప్రచారాలు చేశారని అన్నారు. అందరికీ న్యాయం చేయాలన్న ప్రభుత్వ సదుద్దేశాన్ని పక్కనపెట్టి, కొందరికి అన్యాయం జరుగుతుందన్న వాదనను కూడా కొంతమంది ముందుకు తోయడం కూడా మన కళ్లతో చూశామని అన్నారు. 

చదవండి: 3 రాజధానుల ఉపసంహరణ బిల్లుపై మంత్రి బుగ్గన కీలక వ్యాఖ్యలు

ఈ నేపథ్యంలో మూడు రాజధానులకు సంబంధించిన బిల్లుల్లోని ప్రభుత్వ సదుద్దేశాన్ని విపులంగా వివరించేందుకు, చట్టపరంగా గానీ, న్యాయపరంగా గానీ అన్ని సమాధానాలను బిల్లులోనే పొందుపరచేందుకు, బిల్లుల్ని మరింత మెరుగుపరిచేందుకు, అన్ని ప్రాంతాలకు, అందరికీ, విస్తృతంగా వివరించేందుకు ఇంకా ఏవైనా మార్పులు అవసరమైతే వాటిని కూడా పొందుపరిచేందుకు, ఇంతకముందు ప్రవేశపెట్టిన బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుందని తెలిపారు. అదేవిధంగా ఇంతకుముందు చెప్పిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని, మళ్లీ పూర్తి, సమగ్రమైన, మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తుందని పేర్కొన్నారు.  విస్తృత, విశాల ప్రజా ప్రయోజనాలను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నామని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement