సాక్షి, అమరావతి: వెనుకబడిన వర్గాలకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలిచింది. విద్య, ఉపాధి రంగాల్లో కొండంత భరోసా ఇచ్చింది. విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో బీసీల్లోని ఏబీసీడీఈ కేటగిరీల వారీగా రిజర్వేషన్లు మరో పదేళ్లపాటు కొనసాగించనుంది. దీనికితోడు ప్రభుత్వ ఉద్యోగాల్లో గరిష్ట వయో పరిమితిలో ఐదేళ్ల సడలింపు ఇవ్వడంతో ఉద్యోగ అవకాశాల్లో బీసీలకు మరింత మేలు చేకూరనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వెనుకబడిన వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న తాజా నిర్ణయంతో ఈ ఏడాది జూన్ నుంచి 2031 మే 31 వరకు (పదేళ్లపాటు) బీసీల్లోని ఏబీసీడీఈ కేటగిరిల్లో విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కొనసాగుతాయి.
రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల్లో (బీసీల్లో) దాదాపు 142 కులాలున్నాయి. రాష్ట్ర జనాభాలో 49.55 శాతం మంది బీసీలు ఉంటారని అంచనా. రాష్ట్ర జనాభాలో సగం ఉన్న బీసీలు విద్య, ఉద్యోగాల్లో పురోగమించేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయం ఎంతో దోహదం చేస్తుందని బీసీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బీసీల్లోనూ అభివృద్ది చెందిన (ఫార్వర్డ్) కులాలతోపాటు అత్యంత వెనుకబడిన (మోస్ట్ బ్యాక్‌వర్డ్) కులాలు కూడా ఉన్నాయి. బీసీల్లోని జనాభా ప్రాతిపదికగా ఏబీసీడీఈ విభాగాల వారీగా విద్య, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్ల కొనసాగింపుతో అందరికీ సమాన అవకాశాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆయా కులాలు అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ప్రభుత్వ నిర్ణయం దోహదం చేస్తుందని బీసీ నేతలు విశ్వాసం వ్యక్తం చేశారు. మంత్రివర్గం తీసుకున్న తాజా నిర్ణయంతో బీసీల హక్కుల పరిరక్షణ మరో పదేళ్లు కొనసాగే అవకాశం ఏర్పడిందన్నారు.
మంత్రివర్గం మంచి నిర్ణయం
బీసీలకు చదువు, ఉద్యోగాల్లో పదేళ్లపాటు రిజర్వేషన్లు కొనసాగిస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామం. ఉద్యోగాల్లో బీసీలకు గరిష్ట వయో పరిమితి ఐదేళ్లు సడలించడం వల్ల వయో పరిమితి తీరిన బీసీ యువత కూడా ఐదేళ్లపాటు ఉద్యోగ అవకాశాలకు ప్రయత్నించుకునే వీలు కలుగుతుంది. దీంతో ఎంతోమంది వెనుకబడిన తరగతులకు చెందిన యువతకు విద్య, ఉద్యోగాల్లో మేలు జరుగుతుంది. ఇదే మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మనసుతో స్థానిక సంస్థల్లోనూ ఏబీసీడీఈ కేటగిరీల్లో బీసీ జనాభాకు రిజర్వేషన్లు అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలి.
– కేశన శంకర్‌రావు, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
హక్కుల పరిరక్షణకు గొప్ప నిర్ణయం
బీసీలకు సంబంధించిన సమగ్ర విశ్లేషణ గత 70 ఏళ్లుగా జరగకపోవడం వల్ల బీసీ కులాల్లో ఉన్న అణగారిన జాతులకు రాజ్యాంగ ఫలాలు అందని పరిస్థితి. ఇటువంటి స్థితిలో విద్య, ఉపాధి రంగాల్లో బీసీలకు ఉన్న హక్కులకు కాలదోషం పట్టకుండా వాటి పరిరక్షణకు రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నాను. బీసీ కులాల్లో ఏబీసీడీఈ వర్గీకరణ దేశంలో తొమ్మిది, పది రాష్ట్రాల్లో మినహా ఎక్కడా జరగలేదు. దీనివల్ల కొన్ని రాష్ట్రాల్లో బలమైన బీసీలు, అభివృద్ధి చెందని బలహీనమైన బీసీ వర్గాలకు చెందిన ఫలాలు అనుభవించే పరిస్థితి ఉంది. అందుకు భిన్నంగా బీసీల్లోని అట్టడుగు జాతులకు కూడా మేలు జరిగేలా విద్య, ఉద్యోగ రంగాల్లో ఏబీసీడీఈ వర్గీకరణ ద్వారా రిజర్వేషన్లను మరో పదేళ్లపాటు కొనసాగించే నిర్ణయం మంచి పరిణామం. దీనివల్ల బీసీల్లోని అట్టడుగున ఉన్న సంచార జాతుల వారికి సైతం సమాన అవకాశాలు దక్కేలా ఈ రిజర్వేషన్లు దోహదం చేస్తాయి. అటువంటి హక్కుల పరిరక్షణ దిశగా అడుగులు వేసిన రాష్ట్ర మంత్రివర్గానికి అభినందనలు తెలుపుకొంటున్నాం.
– పాకా వెంకటసత్యనారాయణ, బీసీ హక్కుల పోరాట సమితి, రాష్ట్ర కన్వీనర్
Comments
Please login to add a commentAdd a comment