CM Jagan: ‘నాడి’ పట్టిన నేత | CM YS Jagan has changed the face of public health | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌.. ‘నాడి’ పట్టిన నేత

Published Thu, Dec 21 2023 5:57 AM | Last Updated on Thu, Dec 21 2023 2:41 PM

CM YS Jagan has changed the face of public health - Sakshi

సాక్షి, గుంటూరు: 2019కి ముందు చిన్న జబ్బు చేసినా ప్రజలు పట్టణాలు, నగరాల్లోని ప్రైవేట్‌ ఆస్పత్రులకు పరుగులు తీయాల్సిన దుస్థితి. ఇప్పుడు అందుకు పూర్తి భిన్నం. ఏకంగా రూ.16 వేల కోట్లకుపైగా నిధులతో నాడు–నేడు కింద వివిధ కార్యక్రమాలను చేపట్టారు.

గతంలో పడకేసిన డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రాష్ట్రంలోని పేద, మధ్య తరగతి కుటుంబాల్లోని ప్రజల ఆరోగ్యానికి రెట్టింపు భరోసా కల్పిస్తున్నారు. పథకంలో ఏకంగా 3,257 వైద్య ప్రొసీజర్లు అందుబాటులో తీసుకొచ్చారు. అంతేకాక.. దేశంలో ఎక్కడా లేనట్లుగా వైద్యులే ప్రజల వద్దకు వెళ్లి చికిత్సలు అందించే ఫ్యామిలీ డాక్టర్‌ విధానాన్ని సీఎం జగన్‌ ప్రవేశపెట్టారు.

నాడు
ప్రభుత్వాసుపత్రుల్లో శిశువులను ఎలుకలు పీక్కుతిన్న అధ్వాన పరిస్థితులు.. సెల్‌ఫోన్‌ లైట్‌ వెలుతురులో సర్జరీలు చేసిన ఘటనలు.. విపరీతమైన  సిబ్బంది కొరత.. వెరసి  ప్రభుత్వాసుపత్రులపై రాష్ట్ర ప్రజలకు నమ్మకం అడుగంటింది.. 

నేడు
సర్కారీ వైద్యం ప్రజలకు అత్యంత చేరువైంది. నాడు–నేడుతో ప్రభుత్వాసుపత్రులు కార్పొరేట్‌ ఆస్పత్రులకు ఏమాత్రం తీసిపోని విధంగా మారాయి. 53 వేలకుపైగా పోస్టుల భర్తీ. అటకెక్కిన ఆరోగ్యశ్రీ మళ్లీ పట్టాలెక్కింది. పిలవగానే పలికే అంబులెన్సులు. గ్రామస్థాయిలో ఆరోగ్య శిబిరాలు. ఇలా నాలుగున్నరేళ్ల పాలనలో ప్రజారోగ్య ముఖచిత్రాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ సమూలంగా మార్చేశారు.  

ఆరోగ్యశ్రీ బలోపేతం ఇలా.. 
♦ 2014–19 మధ్య ఆరోగ్యశ్రీ పథకంలో ప్రొసీజర్లు 1,059  
♦  వైఎస్‌ జగన్‌ సర్కార్‌ కొత్తగా చేర్చిన ప్రొసీజర్లు 2,198  
♦ వైద్యం ఖర్చు రూ. వెయ్యి దాటే ప్రతి చికిత్సకు ఆరోగ్యశ్రీ పథకం వర్తింపు.  
♦ 2019 నుంచి ఈ ఏడాది నవంబరు వరకు ఆరోగ్యశ్రీలో వైద్యం పొందినవారు– 37,40,525 మంది  
♦ వీరికి వైద్యం కోసం ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తం – రూ. 11,859.96 కోట్లు  
♦ ఆరోగ్య ఆసరా కోసం వెచ్చించిన మొత్తం– రూ.1,309.90 కోట్లు  
♦ నాలుగున్నరేళ్లలో ఆరోగ్యశ్రీ, ఆసరా కోసం చేసిన ఖర్చు–  రూ.13,169.86 కోట్లు  
♦ ఆరోగ్యశ్రీకి 2014–19 మధ్య గత టీడీపీ ప్రభుత్వం చేసిన ఖర్చు– రూ. 5,177.38 కోట్లు  
♦  కరోనాకు సంబంధించిన 10 రకాల చికిత్సలను 2021 మే, జూన్‌ నెలల్లో ఆరోగ్యశ్రీలోకి చేర్చారు.  
♦ రెండు లక్షల మందికిపైగా కరోనా బాధితులకు ఉచితంగా చికిత్స అందించారు.  
♦ కోవిడ్‌ బాధితుల చికిత్స కోసం ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.744 కోట్లు.  

ప్రజారోగ్యానికి రక్ష జగనన్న ఆరోగ్య సురక్ష.. 
♦ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన శిబిరాలు12,423 
♦  మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రులకు రిఫర్‌ చేసింది 86,690 మంది 
♦  సొంత గ్రామంలోనే చికిత్స పొందినవారు 60.27 లక్షలు 
♦  కేటరాక్ట్‌ సర్జరీలు నిర్వహించింది 78,292 మందికి   

 నాడు–నేడులో పనులు.. 
♦  రూ.1,692 కోట్లతో 10,032 వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌ల ఏర్పాటు.. వీటి ద్వారా 12 రకాల వైద్యసేవలు, 14 రకాల పరీక్షలు, 105 రకాల మందులు గ్రామంలోనే 
అందుతున్నాయి.  
♦ రూ.664.96 కోట్లతో పీహెచ్‌సీల బలోపేతం చేశారు. 983 పీహెచ్‌సీ భవనాలకు మరమ్మతులు చేయడంతోపాటు 150 కొత్త భవనాలను నిర్మించారు. కొత్తగా 176 పీహెచ్‌సీల ఏర్పాటు. ప్రతి పీహెచ్‌సీలో 63 రకాల వైద్య పరీక్షలు, 215 రకాల మందులను అందుబాటులోకి తెచ్చారు. 
♦ రూ. 374.61 కోట్లతో 528 వైఎస్సార్‌ పట్టణ ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు. వీటికోసం 184 భవనాలకు మరమ్మతులు, 344 కొత్త భవనాల నిర్మాణం. 
♦ రూ.682 కోట్లతో 42 ఏరియా ఆస్పత్రులు, రూ.13 కోట్లతో ఎంసీహెచ్‌­/­జిల్లా ఆస్పత్రులు, రూ.528 కోట్లతో 121 సీహెచ్‌సీల బలోపేతం చేశారు. 
♦ రూ.246 కోట్లతో రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో ఐదు ట్రైబల్‌ మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటు.. 
♦ రూ. 272 కోట్లతో కడపలో క్యాన్సర్, మెంటల్‌ హెల్త్, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం..  
♦ రూ.85 కోట్లతో శ్రీకాకుళం జిల్లా పలాసలో డాక్టర్‌ వైఎస్సార్‌ కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌ ఏర్పాటుచేశారు.  



17 వైద్యకళాశాలల ఏర్పాటుతో నూతన అధ్యాయం
 
మన విద్యార్థులకు వైద్యవిద్య అవకాశాలను మెరుగుపరచడంతో పాటు.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సూపర్‌ స్పెషాలిటీ వైద్యసేవలను చేరువ చేస్తూ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలనలో తన ముద్ర చూపించారు. ప్రభుత్వ వైద్యరంగాన్ని బలోపేతం చేయడంలో భాగంగా వైద్యవిద్యకు పెద్దపీట వేశారు.

♦  రూ. 8,480 కోట్లతో 17 కొత్త కళాశాలల ఏర్పాటుద్వారా 2,550 ఎంబీబీఎస్‌ సీట్లు. 
♦ 2023లో విజయనగరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, రాజమహేంద్రవరం వైద్యకళాశాలల ప్రారంభం. 
♦   కొత్త వైద్య కళాశాలలో ఒక్కోచోట 150 చొప్పున మొత్తం 750 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి.  
♦  వచ్చే విద్యాసంవత్సరంలో మార్కాపురం, మదనపల్లె, పాడేరు, పులివెందుల, ఆదోని వైద్యకళాశాలల ప్రారంభం.  
♦ ఇక మిగిలిన ఏడు కళాశాలలు 2025–26లో ప్రారంభించడానికి అనుగుణంగా చర్యలు. 

108 సేవలకు ఊపిరి.. 
ఇక వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చే నాటికి 108 అంబులెన్సు సేవలు 336 వాహనాలతో అరకొరగా ఉండేవి. అంటే అప్పట్లో 679 మండలాలు (ప్రస్తుతం 686) ఉంటే మండలానికి ఒక అంబులెన్స్‌ కూడా లేని దుస్థితి ఉండేది. ఈ పరిస్థితుల్లో మార్పునకు శ్రీకారం చుట్టిన సీఎం జగన్‌ 2020 జూలై 1న 412 కొత్త అంబులెన్సులను ప్రారంభించారు. దీంతో.. 

♦ ఒక్కసారిగా ప్రభుత్వ అంబులెన్సుల సంఖ్య 748కు పెరిగింది. ఇందుకోసం మొత్తం రూ.96.5 కోట్లు ఖర్చుచేశారు.  
♦ గిరిజన ప్రాంతాల కోసమే ప్రత్యేకంగా రూ.4.76 కోట్లతో 20 కొత్త అంబులెన్స్‌లను 2022 అక్టోబరులో అదనంగా కొన్నారు. దీంతో 108 అంబులెన్సుల సంఖ్య 768కి చేరింది. 
♦ వీటిలో 2.5 లక్షల కిలోమీటర్లకు పైగా తిరిగిన పాత వాహనాలను తొలగించి వాటి స్థానంలో ఈ ఏడాది జూలైలో 146 కొత్త అంబులెన్సులను అందుబాటులోకి తెచ్చింది. వీటి కొనుగోలుకు మరో రూ.34.79 కోట్లు ఖర్చుచేసింది.  
♦ మరోవైపు.. గత ప్రభుత్వంలో కేవలం 292 ‘104’ వాహనాలు ఉండగా ఇందులో పాతవాటిని తొలగించి మొత్తం 910 మొబైల్‌ క్లినిక్‌ యూనిట్లను ఈ ప్రభుత్వం కొనుగోలు చేసింది. వీటి నిర్వహణ కోసం గత ప్రభుత్వం కన్నా ఇప్పుడు భారీగా ఖర్చు పెడుతున్నారు.   
♦ ఇలా అంబులెన్స్‌ల కొనుగోలుకు రూ.136.05 కోట్లు ఖర్చుచేశారు. వీటి నిర్వహణ కోసం ఏటా రూ.188 కోట్ల చొప్పున ఖర్చుచేస్తున్నారు.  
♦ ఈ లెక్కన పరిశీలించినట్లయితే నిర్వహణ, కొత్త వాహనాల కొనుగోలు రూపంలో రూ.750 కోట్లకు పైగానే ఖర్చు చేసినట్లయింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement