సీఎం జగన్‌ తిరుపతి పర్యటన.. పలు కార్యక్రమాలకు హాజరు | CM YS Jagan To participate Jagananna Vidya Deevena program | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ తిరుపతి పర్యటన.. పలు కార్యక్రమాలకు హాజరు

Published Thu, May 5 2022 3:23 AM | Last Updated on Thu, May 5 2022 9:16 AM

CM YS Jagan To participate Jagananna Vidya Deevena program - Sakshi

ముఖ్యమంత్రి సభ కోసం ముస్తాబైన ఎస్వీయూ స్టేడియం ప్రాంగణం

సాక్షి, ప్రతినిధి, తిరుపతి/సాక్షి, అమరావతి: తిరుపతి జిల్లా ఆవిర్భావం తర్వాత తొలిసారిగా సీఎం వైఎస్‌ జగన్‌ గురువారం తిరుపతి నగరంలో పర్యటించబోతున్నారు. పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలతో పాటు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జగనన్న విద్యా దీవెన సొమ్ము జమతో పాటు శ్రీ పద్మావతి చిల్డ్రన్స్‌ మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి భూమి పూజ, శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్యాన్సర్‌ కేర్‌ అండ్‌ అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ ఆస్పత్రి, శ్రీనివాస సేతు వంతెన ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో సీఎం జగన్‌ పాల్గొంటారు.   

విద్యార్థుల ఉన్నత చదువులకు అండగా..  
జగనన్న విద్యా దీవెన కింద 2022 జనవరి–మార్చి త్రైమాసికానికి గాను దాదాపు 10.85 లక్షల మంది విద్యార్థులకు వారి తల్లుల ఖాతాల్లో రూ.709 కోట్లను గురువారం తిరుపతి ఎస్వీ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో సీఎం జగన్‌ కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా జమ చేయనున్నారు. అక్కడే జరిగే బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోని అర్హులైన పేద విద్యార్థులందరికీ పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేసే పథకమే జగనన్న విద్యా దీవెన. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు చదివే విద్యార్థులు వారి కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజు మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాíసికం అయిన వెంటనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి ప్రభుత్వం నేరుగా జమ చేస్తోంది. అంతేకాకుండా టీడీపీ ప్రభుత్వం పెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.1,778 కోట్లతో సహా ఇప్పటివరకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కింద వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం రూ.10,994 కోట్లు సాయంగా అందించింది.  

చిన్న పిల్లలకు ‘సూపర్‌’ సేవలు 
చిన్న పిల్లలకు మరింత మెరుగైన వైద్యం అందించేందుకు సంబంధించిన శ్రీ పద్మావతి చిల్డ్రన్స్‌ మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ శంకుస్థాపన చేసి భూమి పూజలో పాల్గొంటారు. అలిపిరి వద్ద 6 ఎకరాల స్థలంలో రూ.300 కోట్ల వ్యయంతో దీనిని నిర్మిస్తున్నారు. అలాగే టీటీడీ ఆధ్వర్యంలోని బర్డ్‌ ఆస్పత్రిలో గ్రహణం మొర్రి, చెవుడు, మూగ రోగులకు సేవలందించే వార్డులను సీఎం ప్రారంభిస్తారు. అనంతరం శ్రీ పద్మావతి కార్డియాక్‌ ఆస్పత్రిలో చికిత్స పొందిన చిన్నారులు, వారి తల్లిదండ్రులతో ముఖ్యమంత్రి ముచ్చటిస్తారు. 

క్యాన్సర్‌ రోగులకు ఆధునిక వైద్యం.. 
టాటా ట్రస్టు సౌజన్యంతో అలమేలు చారిటబుల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్యాన్సర్‌ కేర్‌ అండ్‌ అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ ఆస్పత్రిని సీఎం జగన్‌ లాంఛనంగా ప్రారంభిస్తారు. క్యాన్సర్‌ రోగులకు అత్యున్నత వైద్యం అందించేందుకు రూ.190 కోట్ల వ్యయంతో 92 బెడ్ల సామర్థ్యంతో ఈ ఆస్పత్రిని నిర్మించారు. అలాగే తిరుపతి నగరంలో ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించేందుకు తిరుపతి స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో తొలి దశలో రూ.175 కోట్ల వ్యయంతో శ్రీనివాసం సర్కిల్‌ నుంచి వాసవి భవన్‌ సర్కిల్‌ వరకు నిర్మించిన వంతెన శిలాఫలకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారు. అనంతరం తిరుపతి కార్పొరేషన్‌ రూ.83.6 కోట్ల వ్యయంతో తూకివాకం గ్రీన్‌సిటీలో ఏర్పాటు చేసిన తడిచెత్త నుంచి బయోగ్యాస్‌ ఉత్పత్తి, వెట్‌ వేస్ట్, డ్రైవేస్ట్‌ ప్రాజెక్టులు, భవన నిర్మాణ వ్యర్థాల ప్రాజెక్టు, మురికినీరు శుభ్రపరిచే ప్రాజెక్టులను సీఎం లాంఛనంగా ప్రారంభిస్తారు.  

సీఎం పర్యటన షెడ్యూల్‌..   
సీఎం జగన్‌ గురువారం ఉదయం 10 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి 10.45 గంటలకు రేణిగుంటకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో తిరుపతి ఎస్వీ వెటర్నరీ కాలేజ్‌ గ్రౌండ్స్‌కు వెళ్తారు. స్థానిక నాయకులతో మాట్లాడిన అనంతరం 11.20 గంటలకు ఎస్వీ యూనివర్సిటీ స్టేడియానికి చేరుకొని జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో పాల్గొంటారు. 12.55 గంటలకు శ్రీ పద్మావతి చిల్డ్రన్స్‌ మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి చేరుకొని భవన నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. అక్కడి నుంచి కేన్సర్‌ కేర్‌ ఆస్పత్రికి చేరుకుని.. ఆ ఆస్పత్రిని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2.25కి రేణిగుంట నుంచి బయలుదేరి 3.35 గంటలకు తాడేపల్లికి చేరుకుంటారు. సీఎం పర్యటన ఏర్పాట్లను బుధవారం ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామి, ప్రభుత్వ ప్రోగ్రామ్స్‌ కన్వీనర్‌ తలశిల రఘురాం, వైఎస్సార్‌సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్‌రెడ్డి, కె.సంజీవయ్య, కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి పరిశీలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement