సున్నా వడ్డీ పొందేలా చూసుకోండి | CM YS Jagan request to the beneficiaries of YSR Sunna Vaddi Scheme | Sakshi
Sakshi News home page

సున్నా వడ్డీ పొందేలా చూసుకోండి

Published Thu, Oct 21 2021 2:22 AM | Last Updated on Thu, Oct 21 2021 1:31 PM

CM YS Jagan request to the beneficiaries of YSR Sunna Vaddi Scheme - Sakshi

జగనన్న తోడు చెక్కుతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్, మంత్రి బాలినేని, లబ్ధిదారులు, అధికారులు

ఇంకా రుణం చెల్లించని వాళ్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. కచ్చితంగా డిసెంబర్‌లోగా రుణాలు చెల్లించండి. ఆటోమేటిక్‌గా మీరు కట్టిన వడ్డీ ప్రభుత్వం మీకు చెల్లిస్తుంది. మళ్లీ మీకు రూ.10 వేలు బ్యాంకు రుణం ఇస్తుంది. మీరు మీ వ్యాపారాలు చక్కగా చేసుకోవచ్చు. ఈ విషయాలన్నీ మీకు చెప్పాలన్నదే మా తపన, తాపత్రయం. అలా చెప్పకపోతే ఇది తెలియక మీరు అన్యాయమైన పరిస్థితుల్లోకి పోతారనేది మా భయం. అలాంటి పరిస్థితి రాకూడదన్న ఆత్రుతతో ఈ కార్యక్రమం ద్వారా పిలుపునిస్తున్నాం.    
– సీఎం వైఎస్‌ జగన్‌ 

సాక్షి, అమరావతి: ‘జగనన్న తోడు’ కింద రుణాలు తీసుకున్న చిరు వ్యాపారులు సకాలంలో రుణం చెల్లించి, సున్నా వడ్డీ రాయితీ పొందాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. సకాలంలో కిస్తీలు కట్టడం ద్వారా బ్యాంకర్ల విశ్వాసం పొందాలని సూచించారు. నెల నెలా కిస్తీలు కట్టకపోతే సున్నా వడ్డీ రుణం పొందడానికి వీలుండదని, అటువంటి పరిస్థితిని తెచ్చుకుని మళ్లీ వడ్డీ వ్యాపారుల బారిన పడవద్దని విజ్ఞప్తి చేశారు. సకాలంలో రుణం చెల్లించిన చిరు వ్యాపారులు సున్నా వడ్డీ రాయితీ పొందడమే కాకుండా మళ్లీ సున్నా వడ్డీకి కొత్త రుణం పొందవచ్చని స్పష్టం చేశారు. బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి జగనన్న తోడు పథకం కింద 2020 నవంబర్‌ నుంచి 2021 సెప్టెంబర్‌ 30 వరకు రూ.10 వేలు చొప్పున రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన 4,50,546 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.16.36 కోట్ల వడ్డీని కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి జమ చేశారు.

ఈ సందర్భంగా జిల్లాల్లోని లబ్ధిదారులనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. 2021 జూన్‌లో రెండో దఫా కింద రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించే లబ్ధిదారులందరికీ కూడా వారి రుణ కాల పరిమితి ముగియగానే వడ్డీని తిరిగి చెల్లిస్తామని చెప్పారు. ఇక నుంచి ప్రతి ఏటా రెండు దఫాలుగా ఈ కార్యక్రమాన్ని ప్రాధాన్యత అంశంగా భావించి అమలు చేస్తామన్నారు. రుణం తీసుకున్న వారి కాల పరిమితి డిసెంబర్‌ నాటికి పూర్తయితే, ఆ లోన్‌ క్లోజ్‌ చేసి.. వారి వడ్డీ డబ్బులు వెనక్కిస్తామని తెలిపారు. ఒకసారి డిసెంబర్‌లో, మరోసారి జూన్‌ నెలలో ఇలా చేస్తామని స్పష్టం చేశారు. రుణాలు చెల్లించిన వారికి వడ్డీ సొమ్ము వెనక్కు ఇవ్వడంతో పాటు అదే రోజు మళ్లీ కొత్తగా రుణాలిచ్చే కార్యక్రమాన్ని కలిపి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఎం ఇంకా ఏమన్నారంటే..

రుణాలు కట్టకపోతే ఇప్పుడైనా చెల్లించండి 
► ఈ పథకానికి సంబంధించి ఎవరైనా రుణాలు కట్టకపోతే ఇప్పుడైనా కట్టండి. మళ్లీ డిసెంబర్‌లో, జూన్‌లో తిరిగి వడ్డీ లేని రుణాలు పొందడానికి అవకాశం ఉంటుంది. వడ్డీ విషయంలో కానీ, రుణాలు పొందే విషయంలో కానీ ఎవరికైనా సందేహాలుంటే  0891 2890525 నంబరుకు ఫోన్‌ చేస్తే అన్ని సందేహాలను పూర్తిగా నివృత్తి చేస్తారు.  
► తాజాగా బ్యాంకర్ల నుంచి అందుతున్న డేటా చూస్తే.. దాదాపు 5 శాతం ఎన్‌పీఏలు, 11 శాతం ఓవర్‌ డ్యూస్‌గా ఉన్నాయని బ్యాంకర్లు చెప్పారు. ఇటువంటి మంచి కార్యక్రమంపై అందరికీ పూర్తి అవగాహన కలగాలి. ఇది నలుగురికి మంచి చేసే కార్యక్రమం అని, అవగాహన కల్పించడం కోసం అక్టోబర్‌లోనే వడ్డీ జమ చేస్తున్నాం. ఇందులో 100 శాతం రికవరీ ఉండాలి. అప్పుడే బ్యాంకర్లకు మన మీద నమ్మకం పెరుగుతుంది. అప్పుడే బ్యాంకర్లు మరో నలుగురికి రుణాలివ్వడానికి ముందుకు వస్తారు. 
► గ్రామ సచివాలయం, వలంటీర్లు, కలెక్టర్లు అందరూ భాగస్వాములై ఈ విషయం లబ్ధిదారులందరికీ తెలిసేలా  చెప్పాలి. ప్రతి నెలా ఈఎంఐ కట్టకపోతే గడువు దాటినట్లే. అంటే ఓవర్‌ డ్యూ అయినట్లే లెక్క. అలా 90 రోజులు కట్టకపోతే ఎన్‌పీఏ (నాన్‌ ఫెర్ఫార్మింగ్‌ అసెట్‌) కింద మారుస్తారు. ఈ విషయాలన్నీ వారికి వివరించాలి. ఏ ఖాతా అయినా ఎన్‌పీఏ అయిందంటే ప్రభుత్వం నుంచి సున్నా వడ్డీ అందని పరిస్థితి ఉంటుందనేది చాలా స్పష్టంగా చెప్పాలి. 

వీళ్ల పరిస్థితి మారాలనేదే లక్ష్యం
► చిరు వ్యాపారుల పరిస్థితి మార్చి, వీళ్లకు అండగా ఉండాలన్న ఉద్దేశంతో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేశాం. వారి ద్వారా వడ్డీ లేకుండా రూ.10 వేలు రుణం ఇప్పించేలా ఒప్పించి ఈ పథకాన్ని గతేడాది ప్రారంభించాం. వాళ్లు కట్టిన వడ్డీని ప్రభుత్వం తిరిగి వారికి వెనక్కు ఇస్తుంది.
► దాదాపు 9,05,458 మందికి రూ.10 వేలు చొప్పున రూ.905 కోట్లు వడ్డీ లేని రుణాలు ఇప్పించాం. గత ఏడాది నవంబర్‌ 25 నుంచి 5 లక్షల 35 వేల మందికి మొదటి విడతలో రుణాలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఈ ఏడాది జూన్‌ 8 నుంచి రెండో విడతగా మరో 3 లక్షల 70 వేల మందికి రుణాలు పంపిణీ చేశాం.  
► ఈ కార్యక్రమంలో విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

గతంలో ఏ ప్రభుత్వం వీరిని పట్టించుకోలేదు 
► తోపుడు బండ్ల మీద పండ్లు, సామాన్లు అమ్ముకునే వారు, నగరాల్లో ఫుట్‌పాత్‌ల మీద ఇడ్లీ, దోశ లాంటి టిఫిన్లు అమ్ముకునే వారు, రోడ్డు పక్కన చిన్న బంక్‌ పెట్టుకుని చిన్న, చిన్న వ్యాపారాలు చేసేవాళ్లు, కూరగాయలు, పండ్లు, పూలు అమ్ముకునేవాళ్లు, చిన్న మోపెడ్‌ మీద వీధుల్లో తిరుగుతూ సామాన్లు అమ్ముకునే వాళ్లు.. ప్రతి ఊళ్లో కనిపిస్తుంటారు.
► ఇలాంటి వాళ్లకు ఏ రోజు కూడా బ్యాంకుల దగ్గర నుంచి వీళ్ల అవసరాలు తీర్చేందుకు సహాయ, సహకారాలు అందని పరిస్థితి. ఎందుకంటే సెక్యూరిటీ ఇచ్చే స్తోమత వీళ్లకు ఉండదు. గతంలో ఏ ప్రభుత్వమూ వీళ్లను పట్టించుకోని పరిస్థితి. లోన్లు అందక వీరి జీవితాలు తల్లడిల్లిపోయాయి.
► అలాంటి వాళ్లు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర రూ.1,000 వర్కింగ్‌ క్యాపిటల్‌ కింద అప్పు తీసుకుంటే రూ.900 మాత్రమే చేతికిస్తారు. అయితే రోజుకు రూ.100 చొప్పున మొత్తం రూ.1,000 కట్టాలి. ఇలాంటి పరిస్థితులను నా 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో కళ్లారా చూశాను.

దుకాణం ఏర్పాటు చేసుకున్నా..
వీధుల్లో తిరుగుతూ వ్యాపారం చేసే స్థాయి నుండి కూరగాయల దుకాణం ఏర్పాటు చేసుకునే స్థాయికి ఎదిగాను. రోజుకు నాలుగు ఐదు వందల రూపాయల ఆదాయం లభిస్తోంది. నెలకు రూ.15 వేల ఆదాయం వస్తోంది. ఆసరా పథకం ద్వారా వచ్చిన సొమ్ముతో ఆవును కొనుగోలు చేశాను. దాని ద్వారా కూడా ఆర్థికంగా అండ లభించింది. మీ మేలు మరవలేను.
– పిలకా పద్మ, సీహెచ్‌ రాజాం, రణస్థలం మండలం, శ్రీకాకుళం జిల్లా

అధిక వడ్డీల భారం తప్పింది
అన్నా.. నాకు ఇద్దరు పిల్లలు. అధిక వడ్డీలకు డబ్బులు తీసుకొని పెట్టుబడిగా పెట్టి వచ్చిన ఆదాయం మొత్తాన్ని వడ్డీలకే కట్టేదాన్ని. మీరు ప్రారంభించిన జగనన్న తోడు పథకం ద్వారా నాకు పది వేల రూపాయలు రుణం వస్తుందని మా వలంటీరు చెప్పాడు. అలా రుణం తీసుకుని వ్యాపారంలో పెట్టుబడి పెట్టాను. అధిక వడ్డీ చెల్లించే బాధ తప్పింది. దీంతో రోజుకు 500 రూపాయల వరకు ఆదాయం పొందుతున్నాను. మీ వల్ల మా స్కూలు బాగుపడిందని మా పాప చెబుతోంది. మా లాంటి వాళ్లందరం సంతోషంగా ఉన్నాం. 
–మాధవి, లబ్ధిదారు, వెంకటాచలం, నెల్లూరు జిల్లా

అన్నా.. నేను ఫ్యాన్సీ షాపు పెట్టుకున్నా
జగనన్నా.. మీరు ప్రవేశపెట్టిన జగనన్న తోడు పథకం ద్వారా స్టేట్‌ బ్యాంక్‌లో రూ.10 వేల రుణం పొందాను. వార్డు వలంటీర్‌ ద్వారా ఈ పథకం గురించి తెలుసుకొని దరఖాస్తు చేసుకున్నాను. బ్యాంకు ఇచ్చిన రుణంతో ఫ్యాన్సీ దుకాణం పెట్టుకున్నాను. కరోనా సమయంలో ఇది నాకు చాలా మేలు చేసింది. మీరు అమలు చేస్తున్న ఇతరత్రా పథకాల ద్వారా మేము ఎంతగానో లబ్ధి పొందుతున్నాం. ఆరోగ్యశ్రీ, దిశ యాప్, సచివాలయ వ్యవస్థ ఎంతో అద్భుతం.  
– కె.నాగజ్యోతి, ఆర్‌ ఆర్‌ పేట, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement