ప్రముఖ కంపెనీలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందాలు | CM YS Jagan Said Government Was Focused On Women Empowerment | Sakshi
Sakshi News home page

మహిళా స్వయం సాధికారిత దిశగా కీలక అడుగులు

Aug 3 2020 1:06 PM | Updated on Aug 3 2020 3:58 PM

CM YS Jagan Said Government Was Focused On Women Empowerment - Sakshi

సాక్షి, అమరావతి: మహిళా స్వయం సాధికారితపై ప్రభుత్వం పూర్తిగా దృష్టిపెట్టిందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. దీనిలో భాగంగా సోమవారం సీఎం వైఎస్‌ జగన్‌ సమక్షంలో ప్రఖ్యాత కంపెనీలైన హిందుస్థాన్‌ యూనిలీవర్, ఐటీసీ, ప్రొక్టర్‌ అండ్‌ గాంబిల్‌తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. 'గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, అలాగే వ్యవస్థలో దిగువన ఉన్న వారి తలరాతలను మార్చకపోతే మార్పులు సాధ్యంకావు. మహిళల జీవితాలను మార్చాలని ప్రయత్నిస్తున్నాం. ఆగస్టులో 12న వైఎస్సార్‌ చేయూత ప్రారంభిస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన 45–60 ఏళ్లలోపు అర్హత మహిళలకు చేయూతను అందిస్తున్నాం. పారదర్శకంగా, సంతృప్త స్థాయిలో మేము ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. 

ఈ కేటగిరీలో ఉన్న మహిళలు కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. వీరు చాలాకాలంగా నిరాదరణకు గురయ్యారు. వీరంతా స్వయం సహాయక సంఘాల్లో ఉన్నారు. చేయూత కింద ఎంపిక అయిన మహిళలకు నాలుగేళ్లలో రూ.75వేల ఇస్తాం. ప్రతి ఏటా రూ.18,750 ఇస్తాం. ఈ సహాయం వారి జీవితాలను మార్చేందుకు ఉయోగపడాలి. స్థిరమైన ఆదాయాలను కల్పించే దిశగా వారికి ఉపాధి అవకాశాలను కల్పించాలి.ఇటీవలే అమూల్‌ కూడా అవగాహన ఒప్పందం చేసుకుంది.ప్రభుత్వం చేయూత నిస్తుంది, బ్యాంకు రుణాలకు గ్యారంటీ ఇస్తుంది. ఈ కార్యక్రమంలో కంపెనీలు భాగస్వామ్యం కావాలని ఆకాంక్షిస్తున్నాం.  (అక్కాచెల్లెమ్మలకు శుభాకాంక్షలు: సీఎం జగన్‌)

ఆగస్టు 12న సుమారు రూ.4,500 కోట్లు ఈ పథం కింద ఇస్తున్నాం. సెప్టెంబరులో వైఎస్సార్‌ ఆసరా అమలు చేస్తున్నాం. 90 లక్షల స్వయం సహాయక సంఘాల వారికి ఆసరా అమలు చేస్తున్నాం. చాలావరకు చేయూత అందుకున్న మహిళలకూ ఆసరా కూడా వర్తిస్తుంది. 9 లక్షల మంది మహిళలకు దాదాపు రూ.6,700 కోట్లు ఆసరా కింద ఏటా ఇస్తున్నాం. ఇలా ప్రతి ఏటా రూ.11వేల కోట్ల చొప్పున, నాలుగేళ్లపాటు రూ.44వేల కోట్ల  దాదాపుగా కోటి మంది మహిళల చేతికి ఇస్తున్నాం. ఈ సహాయం వారికి స్థిరమైన ఆదాయాలు ఇచ్చేదిగా, స్థిరమైన ఉపాధి కల్పించేదిగా ఉండాలి. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను, మహిళల జీవితాలను మారుస్తుంది. సమాజంలో అణగారిన వర్గాల్లోని మహిళల జీవితాల్లో వెలుగును నింపుతుంది. వారి కాళ్లమీద వాళ్లు నిలబడగలిగేలా మీరు సహకారం అందించాలి' అని సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గాంబిల్‌ సీనియర్‌ మేనేజర్‌ జోసెఫ్‌వక్కీ, ఐటీసీ డివిజనల్‌ సీఈవో రజనీకాంత్‌ కాయ్‌, హెచ్‌యూఓల్‌ జీఎస్‌ఎం చట్ల రామకృష్ణారెడ్డి వివిధ కంపెనీల ప్రతినిధులు, సంబంధిత ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement