CM YS Jagan Speech Highlights In YSR Matsyakara Bharosa Program In Konaseema - Sakshi
Sakshi News home page

YSR Matsyakara Bharosa Program Konaseema: ఇదీ మా ఘనత.. ధైర్యంగా చెబుతున్నాం: సీఎం జగన్‌

Published Fri, May 13 2022 1:20 PM | Last Updated on Thu, Jun 2 2022 4:26 PM

CM YS Jagan Speech In YSR Matsyakara Bharosa Program Konaseema - Sakshi

ఎంతగానో మంచి చేశామని ఇంటింటికీ వెళ్లి చెప్పే నైతికత కేవలం మనకు మాత్రమే ఉంది. కాబట్టే ‘గడప గడపకు మన ప్రభుత్వం’ పేరుతో మీరంతా గెలిపించిన మన ఎమ్మెల్యేలు, ఎంపీలు మీ ఇంటి వద్దకు బయలు దేరారు. మనం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. ఈ 34 నెలల కాలంలో మీ ఇంటికి ఏయే పథకాలు అందాయో ఆ కుటుంబంలో ఉన్న అక్కచెల్లెమ్మల పేరుతో నేను స్వయంగా రాసిన లేఖలు ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకునే గొప్ప కార్యక్ర మానికి శ్రీకారం చుట్టాం. బాబు ఏం మేలు చేశారో ఇంత ధైర్యంగా ఆ దుష్టచతుష్టయం, దత్తపుత్రుడు చెప్పగలరా?

పేదవాళ్లకు మంచి చేయడానికి రాష్ట్రానికి డబ్బులు రావడాన్ని కూడా ఈ దుష్టచతుష్టయం అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. కేంద్రం నుంచి డబ్బులు వచ్చినా బాధే. బ్యాంకులు అప్పులు ఇచ్చినా బాధే. ఢిల్లీ దాకా కోర్టుల్లో అన్ని చోట్లా అబద్ధాలతో కూడిన పిటిషన్లు వేస్తూ నిరంతరం అడ్డుకుంటున్న పరిస్థితులు రాష్ట్రంలో చూస్తున్నాం. ఇలాంటి రాబందులను ఏమనాలి? ద్రోహులు అందామా? లేక దేశ ద్రోహులు అందామా? కళ్లు ఉండి మంచిని చూడలేని కబోదులు అందామా?
– సీఎం వైఎస్‌ జగన్‌

మురమళ్ల నుంచి సాక్షి ప్రతినిధి: ‘మన ప్రభుత్వ మూడేళ్ల పాలనలో 32 పథకాల ద్వారా అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్నాం. మేనిఫెస్టోలో 95 శాతం వాగ్దానాలు అమలు చేశాం. డీబీటీ ద్వారా ఏకంగా రూ.1.40 లక్షల కోట్లు ప్రజల ఖాతాల్లో జమ చేశాం. ఇంతగా మంచి చేశామని ప్రజలకు ధైర్యంగా చెప్పుకోగలుగుతున్నాం. ఇలా చెప్పుకునే ధైర్యం చంద్రబాబుకు లేదు. చంద్రబాబు చేశాడని చెప్పే ధైర్యం అతని దత్తపుత్రుడుకీ లేదు.

దుష్టచతుష్టయంలో భాగమైన ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, ఎల్లో మీడియాకు అసలే లేదు’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. మంచి పనులు చేస్తుంటే వారికి ఈర్ష్య, కడుపు మంట అన్నారు. ఏదైనా అనారోగ్యం వస్తే ఆరోగ్య శ్రీ ద్వారా వైద్యం చేయిస్తామని, అయితే ఈ కడుపు మంట, ఈర్ష్యకు మందు లేదని.. ఆ దేవుడే చూడాలన్నారు. కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం మురమళ్లలో శుక్రవారం నాలుగో ఏడాది మత్స్యకార భరోసాతోపాటు ఓఎన్‌జీసీ నష్ట పరిహారం రూ.217 కోట్లను సీఎం జగన్‌.. కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన మత్స్యకారులు, ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
 

గ్రామ స్వరూపమే మారిపోతోంది..
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాల్లో పేదరికంలో ఉన్న వారిని నా వాళ్లగా భావించాను. వారి ఎదుగుదల కోసం 32 పథకాలను అమలు చేస్తున్నాం. వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక, వైఎస్సార్‌ ఆసరా, జగనన్న అమ్మఒడి, చేయూత, సున్నా వడ్డీ, రైతు భరోసా, విద్యా కానుక, వసతి దీవెన ఇలా వివిధ పథకాల ద్వారా ఎక్కడా లంచాలు, వివక్షకు తావు లేకుండా లబ్ధి చేకూరుస్తున్నాం.

► మరో వైపు మన గ్రామాల స్వరూపాలన్నీ మారిపోతున్నాయి. ప్రతి ఊళ్లో మన కళ్లెదుటే ఇంగ్లిష్‌ మీడియం స్కూలు నాడు–నేడుతో ముస్తాబై కనిపిస్తోంది. అదే గ్రామంలో ఓ నాలుగు అడుగులు ముందుకు వేస్తే.. వ్యవసాయం రూపురేఖలు మార్చే రైతు భరోసా కేంద్రాలు కనిపిస్తున్నాయి. 
► ఇంకో నాలుగు అడుగుల దూరంలో 24 గంటల పాటు సేవలందించే విలేజ్‌ క్లినిక్‌ అందుబాటులోకి వచ్చే విధంగా పనులు జరుగుతున్నాయి. ఆ పక్కనే లంచాలు, వివక్ష లేని సేవలందిస్తూ గ్రామ సచివాలయాలు కనిపిస్తున్నాయి. ఇంతటి మంచి, అభివృద్ధి, సంక్షేమం చేస్తున్న ఈ ప్రభుత్వానికి, గత చంద్రబాబు ప్రభుత్వానికి మధ్య ఒక్కసారి తేడా గమనించాలని కోరుతున్నా.
► ‘మనందరి పార్టీ 2019 ఎన్నికల్లో చేసిన వాగ్దానాలకు సంబంధించి 95 శాతం అమలు చేశాం. ఈ మేనిఫెస్టోలో మీరే చూసి, టిక్కులు పెట్టండి. గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడా మీరే చూడండి’ అని మీ చల్లని దీవెనలు తీసుకునేందుకు మన ఎమ్మెల్యేలు, ఎంపీలు మీ దగ్గరకు బయలుదేరారు. 
► ఇంతగా మంచి చేస్తున్న మన ప్రభుత్వాన్ని దుష్ట చతుష్టయం అంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు.. ఆయన దత్తపుత్రుడు జీర్ణించుకోలేకపోతున్నారు.
 

ఇలాంటి వాళ్లను ఎక్కడైనా చూశారా?
► పరీక్ష పేపర్లు లీక్‌ చేసే వ్యక్తిని సమర్థించే ప్రతిపక్షం కానీ, సమర్థించే ఎల్లో మీడియా కానీ, ఇలాంటి దుష్టచతుష్టయాన్ని కానీ మీరెక్కడైనా చూశారా? 
► కార్మిక శాఖ మంత్రిగా ఈఎస్‌ఐకి సంబంధించి ఉద్యోగులకు మంచి చేయాల్సింది పోయి.. పౌడర్లు, స్నోలు, టూత్‌పేస్టులు, మందులు పేరిట డబ్బులు కొట్టేసిన నాయకుడ్ని విచారించడానికి వీల్లేదంటున్న ప్రతిపక్షాన్ని కానీ, ఎల్లో మీడియాను కానీ, ఇటువంటి దుష్టచతుష్టయాన్ని కానీ మీరెక్కడైనా చూశారా? 
► మన పిల్లలకు మనం అబద్ధాలు చెప్పొద్దని, మోసం చేయవద్దని నేర్పుతాం. కానీ కొడుక్కు పచ్చి అబద్ధాలు, మోసాల్లో ట్రైనింగ్‌ ఇస్తున్న చంద్రబాబు లాంటి తండ్రిని మీరెక్కడైనా చూశారా? మంత్రిగా పనిచేసి, మంగళిగిరిలో ఓడిన సొంత పుత్రుడు ఒకరు, రెండుచోట్లా పోటీ చేసి ఎక్కడా గెలవని దత్తపుత్రుడు ఇంకొకరు.
ప్రజలను కాక ఇలాంటి వాళ్లను నమ్ముకుంటున్న 40 ఏళ్ల ఇండస్ట్రీ, సీనియర్‌ మోస్ట్‌ పొలిటీషియన్‌ అని చెప్పుకుంటున్న చంద్రబాబులాంటి రాజకీయ నాయకుడ్ని ఎక్కడైనా చూశారా?
► వాళ్లు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకపోగా, మనం ఇస్తుంటే కోర్టుకు వెళ్లి అడ్డుకుంటున్న ప్రతిపక్షాన్ని ఎక్కడైనా మీరు చూశారా? 
► నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇళ్లు కట్టించి ఇవ్వాలని.. వీరు చెప్పుకుంటున్న అమరావతి అనే రాజధానిలో ఇళ్ల స్థలాలు కేటాయిస్తే ఏకంగా కోర్టులకు వెళ్లి అడ్డుకుంటారు. వీళ్లకు ఇళ్ల స్థలాలు ఇస్తే జనాభా సమతుల్యం (డెమోగ్రాఫిక్‌ ఇంబేలన్స్‌) దెబ్బతింటుంటుని పిటిషన్లు వేసి వాదిస్తారు. ఇటువంటి ప్రతిపక్షం ఎక్కడైనా ఉంటుందా?
► ప్రభుత్వ స్కూళ్లల్లో పేద పిల్లలకు ఇంగ్లిష్‌ మీడియం పెడితే, అడ్డుకున్న ప్రతిపక్షం ఎక్కడైనా ఉంటుందా? పేద పిల్లలు పెద్ద చదువులు చదుకుకుని గొప్పవాళ్లయితే చంద్రబాబు లాంటి వాళ్లను ఎక్కడ ప్రశ్నిస్తారో అని భయపడే ప్రతిపక్షాన్ని ఎక్కడైనా చూశామా? 
► మన ప్రభుత్వంలో జరుగుతున్న మంచిని చూసి ఓర్వలేక అబద్ధాలు గుమ్మరిస్తున్నారు. ఈ పెద్దమనిషి (చంద్రబాబు) 27 ఏళ్లు కుప్పానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ ఇల్లు కట్టుకుందామన్న ఆలోచన ఆయనకు ఏ రోజూ రాలేదు. ఈ రోజు మన మూడేళ్ల పాలన చూసి భయంతో కుప్పం వెళ్లారు. అక్కడ ఇల్లు కట్టుకునే పని చేస్తున్నారు. ఇలాంటి వక్రబుద్ది ఉన్న దుష్ట›చతుష్టయం నుంచి, నేతల దేవుడు రాష్ట్రాన్ని కాపాడాలి.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement