AP: రాష్ట్రంలో సుభిక్ష పాలన | CM YS Jagan To Visit Ganapati Sachchidananda Ashram Today, Live Updates | Sakshi
Sakshi News home page

AP: రాష్ట్రంలో సుభిక్ష పాలన

Published Mon, Oct 18 2021 10:20 AM | Last Updated on Tue, Oct 19 2021 7:56 AM

CM YS Jagan To Visit Ganapati Sachchidananda Ashram Today, Live Updates - Sakshi

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని శాలువాతో సత్కరిస్తున్న అవధూత శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ

రాష్ట్రానికి మంచి చేయాలనే ఉద్దేశం సీఎం జగన్‌లో చాలా ఉంది. ఆయన ఎంతో కష్టపడి, బాధలు తట్టుకొని పరిపాలన చేపట్టిన వ్యక్తి. ఆయన సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న తీరు ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రభుత్వం మంచి చేసేటప్పుడు అడ్డు పడటం సరికాదు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి అండగా నిలవాలి. 
–గణపతి సచ్చిదానంద స్వామీజీ 


సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమంలో అమ్మవారి హారతి తీసుకుంటున్న సీఎం వైఎస్‌ జగన్‌ 

కరోనా వల్ల ప్రపంచమే అతలాకుతలం కాగా రాష్ట్రంలో మాత్రం సంక్షేమ పథకాలు అమలయ్యాయి. సీఎం జగన్‌ హిందూ ధర్మ పరిరక్షణకు కట్టుబడ్డారు. దేవాలయ భూముల రక్షణకు వ్యవస్థ రూపొందిస్తున్నారు. దీన్ని అందరూ అభినందించాలి. హైందవ మతానికి సీఎం విరుద్ధంగా ఉన్నట్లు గిట్టనివారంతా దుష్ప్రచారం చేస్తున్నారు. సీఎం జగన్‌ పరిపాలన మెరుగైన ఫలితాలను ఇస్తుంది. సంక్షేమ పథకాలను ఆయన అమలు చేస్తున్న తీరు ఆశ్చర్యానికి గురిచేసింది. రామరాజ్యం కూడా ఒక్క రోజులో నిర్మించబడలేదు. రాముడు అయోధ్య నిర్మాణానికి కష్టపడ్డట్టు.. సీఎం జగన్‌ రాష్ట్రాభివృద్ధికి అహర్నిశలు కష్టపడుతున్నారు. రాష్ట్రంలోని మురికిని కడిగేస్తున్నారు. ఈ ఏడాది కృష్ణవేణి మంచి పంటలు పండిస్తుంది. రైతులందరూ దిగుబడి బాగుండి సంతోషంగా ఉంటారు. రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది.
– అవధూత దత్త పీఠాధిపతి శ్రీగణపతి సచ్చిదానంద స్వామీజీ

సాక్షి, అమరావతి, పటమట(విజయవాడ తూర్పు): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని అవధూత దత్త పీఠాధిపతి శ్రీగణపతి సచ్చిదానంద స్వామీజీ పేర్కొన్నారు. ప్రభుత్వం చేసే ప్రతి పనినీ అపభ్రంశంగా ప్రచారం చేయడం.. మంచి చేసేటప్పుడు అడ్డు పడటం.. మాటిమాటికీ కోర్టులకు వెళ్లడం.. కిందకు లాగడం, తమకు అధికారం లేదని కొందరు విరుద్ధంగా ప్రచారం చేయడం.. ఇలాంటి చర్యలన్నీ సరైనవి కాదని అవధూత దత్త పీఠాధిపతి శ్రీగణపతి సచ్చిదానందస్వామీజీ పేర్కొన్నారు. అవన్నీ చేయకుండా తాను దేవుడిని ప్రార్థిస్తానని తనను కలిసేందుకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్‌కు చెప్పినట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్‌ సోమవారం విజయవాడలోని దత్తపీఠం ఆశ్రమానికి వెళ్లి స్వామీజీ ఆశీస్సులు తీసుకున్నారు.

పాదరక్షలు ధరించకుండా పూర్తి సంప్రదాయబద్ధంగా సీఎం జగన్‌ స్వామీజీ ఆశ్రమంలోకి అడుగుపెట్టారు. దత్తపీఠం అర్చకులు, ఆశ్రమ పర్యవేక్షకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డితో కలసి ఆశ్రమానికి సీఎం వచ్చారు. తొలుత ఆశ్రమంలోని సుప్రగణపతి, శ్యామకమలలోచన దత్తాత్రేయ, మరకత రాజరాజేశ్వరిదేవి, గంగాధరేశ్వరస్వామి ఆలయాలను దర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కార్యసిద్ధి హనుమాన్‌ ఆలయంలో పూర్ణ ఫలాన్ని తాకి చేతికి రక్ష కంకణం ధరించారు. అనంతరం అవధూత శ్రీగణపతి సచ్చిదానంద స్వామీజీతో సమావేశమయ్యారు. సీఎం జగన్‌ దాదాపు గంటకు పైగా ఆశ్రమంలోనే గడిపారు. అనంతరం శ్రీగణపతి సచ్చిదానంద స్వామీజీ మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలివీ..

రాముడి రాజ్యమొచ్చినా రాగులు విసరడం తప్పదు కదా..
మనకు అది జరగలేదు.. ఇది జరగలేదు అని చాలా ప్రశ్నలు ఉంటాయి. అన్నీ ఒక్క రోజులో తీరి రామరాజ్యం కాలేదు కదా! రాముడి రాజ్యం వచ్చినా రాగులు విసరడం తప్పదు. కొన్ని అంశాల్లో మన కష్టం, మన పరిస్థితి, మనం చేసుకునేది ఎప్పటికీ తప్పదు. ఇప్పుడు హఠాత్తుగా ఓ ప్రవాహం వచ్చి నీళ్లు లోపలికి వస్తే గవర్నమెంట్‌ ఏమీ చేయలేదంటే..  ఏం చేస్తుంది? మనమే దానికేదో అడ్డుకట్ట వేసుకోవాలి. మురికి అంతా మనమే వేసుకొని గవర్నమెంట్‌ ఏం చేయడం లేదంటే ఎలా? మనం కూడా వలంటీర్లుగా పనిచేయాలి. ప్రభుత్వానికి తోడ్పాటు అందించాలి. ఎప్పుడూ తప్పుబట్టడం, ఈ గవర్నమెంట్‌ ఏమీ పట్టించుకోదు అంటే ఎలా? మనం కూడా పట్టించుకోవాలి. విపత్తు వచ్చి నోటికాడికి వచ్చిన పంట నాశనమైతే వెంటనే ప్రభుత్వమైనా ఏం చేయగలదు? అప్పటికప్పుడే పంట మళ్లీ సృష్టించడానికి ప్రభుత్వానికైనా ఎలా సాధ్యమవుతుంది? వాళ్లూ మనుషులే కదా! అంత హింస  పెట్టకూడదు.

హిందూ విరోధిగా ఊరికే ప్రచారం.. 
సీఎం జగన్‌మోహన్‌రెడ్డి హిందూమతం పట్ల విరుద్ధంగా ఉన్నారని కొందరు ఊరికే ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి ప్రచారం జరగడం పట్ల సీఎం జగన్‌ నా వద్ద దుఃఖం వ్యక్తం చేశారు. ఏ మతమైనా ఒక్కటేనన్న విధానంతో ఎవరి మనసూ నొప్పించకూడదన్నదే తన అభిమతమని సీఎం చెప్పారు. నాకూ మొదట నుంచీ అదే భావన ఉంది. హిందూ ధర్మం, హిందూ మతానికి సంబంధించి కొన్ని విషయాలపై నేను చేసిన సూచనలను సీఎం జగన్‌ శ్రæద్ధగా ఆలకించారు. ఆలయాల్లో చోటుచేసుకునే లోపాలను ప్రభుత్వం ఒక్కొక్కటిగా సరిచేస్తోంది. ఆలయ భూములు నాశనం కాకూడదు. ఆలయాల్లో వంశపారంపర్య అర్చక వ్యవస్థ కొనసాగించడం లాంటి అంశాలపై ముఖ్యమంత్రితో చర్చించా. గతంలో వాళ్ల నాన్న (దివంగత వైఎస్సార్‌) మైసూరులోని నా ఆశ్రమానికి రెండు దఫాలు వచ్చారు. సీఎం మాతృమూర్తి వైఎస్‌ విజయమ్మ కూడా ఒక రోజు పాటు ఆశ్రమంలో గడిపారు. 

సాహిత్య రాజ్యంగా విరాజిల్లాలి..
రాజ్యానికి రాముడొచ్చినా అయోధ్యలో ప్రజలు కష్టపడలేదా? అట్లానే మనం కూడా. ప్రజలందరూ గవర్నమెంట్‌కు సాధ్యమైనంత వరకు తోడ్పాటు అందించాలి.  అప్పుడే రాష్ట్రం బాగుంటుంది. అభివృద్ధి చెందుతుంది. నీ రాజ్యం బాగా ఉంటుంది. ఆంధ్రరాష్ట్రం సాహిత్య రాజ్యం కావాలని సీఎంను దీవించి ప్రసాదం అందచేశా. ప్రజలందరి ముద్దుబిడ్డగా జనం ఆయనకు సహకరిస్తారు. 

ముఖ్యమంత్రికి స్వాగతం పలికినవారిలో మంత్రులు పేర్ని వెంకట్రామయ్య(నాని), కొడాలి వెంకటేశ్వరరావు (నాని), వెలంపల్లి శ్రీనివాసరావు, íసీఎం కార్యక్రమాల సమన్వయ కర్త తలశిల రఘురాం, ఎమ్మెల్సీలు ఎం.డి.కరీమున్నిసా, టి.కల్పలతరెడ్డి, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, పి.పార్థసారథి, కె.రక్షణనిధి, కైలే అనిల్‌కుమార్, జెడ్పీ చైర్మన్‌ హారిక, మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, ఫైబర్‌ నెట్‌ చైర్మన్‌ గౌతమ్‌రెడ్డి, కేడీసీసీ చైర్మన్‌ తన్నీరు నాగేశ్వరరావు, దేవదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ డాక్టర్‌ జి.వాణిమోహన్‌ తదితరులున్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement