
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటన నిమిత్తం వైఎస్సార్ జిల్లా పులివెందులకు వెళ్లనున్నారు. అక్టోబర్ 2వ తేదీ మధ్యాహ్నం తాడేపల్లి నుంచి బయలుదేరి సాయంత్రం 4 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. సాయంత్రం 4.20 గంటలకు ఇడుపులపాయలోని హెలిప్యాడ్ వద్ద స్థానిక నాయకులతో కొద్దిసేపు మాట్లాడతారు. అనంతరం వైఎస్సార్ ఎస్టేట్‌కు చేరుకొని రాత్రికి అక్కడే బస చేస్తారు.
3వ తేదీ తన మామ డాక్టర్ ఈసీ గంగిరెడ్డి ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని ఉదయం 10గంటలకు పులివెందులలోని లయోలా డిగ్రీ కాలేజీ రోడ్డులో ఉన్న సమాధి వద్దకు చేరుకొని నివాళులు అర్పిస్తారు. 10.30కి భాకరాపురంలోని ఆడిటోరియంలో జరిగే ప్రార్థనల్లో పాల్గొంటారు. ఆ తర్వాత 11.40 గంటలకు భాకరాపురంలోని నివాసానికి వెళ్తారు. మధ్యాహ్నం 12.40కి కడప ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి 1.30కి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన మధ్యాహ్నం 2కి తాడేపల్లిలోని నివాసానికి వెళ్తారు.