సాక్షి, అమరావతి: ‘సినిమా టికెట్ల కలెక్షన్లు ఒక్కరోజులోనే థియేటర్ల ఖాతాలో జమవుతాయి. రోజువారి ప్రాతిపదికన టికెట్ల కలెక్షన్లు థియేటర్లకు చెల్లిస్తారు’.. ఇదీ ఏపీ స్టేట్ ఫిల్మ్, టీవీ, థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్‌ఎఫ్‌టీవీటీడీసీ) సినిమా థియేటర్ల యజమానులతో కుదర్చుకునే అవగాహన ఒప్పందం (ఎంఓయూ)లో స్పష్టంగా పేర్కొన్న అంశం. ఈ విధానంతోనే థియేటర్ల యజమానులతో కార్పొరేషన్ ఎంఓయూలు కుదుర్చుకుంటోంది.
చదవండి: ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
పారదర్శకంగా ఆన్‌లైన్ విధానంలో టికెట్లు విక్రయిస్తే ఇక దశాబ్దాలుగా తాము సాగిస్తున్న దోపిడీకి అడ్డుకట్ట పడుతుందన్న ఆందోళనతో కొందరు తాజాగా ఓ దుష్ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు. ‘ఆన్‌లైన్ విధానంలో సినిమా టికెట్ల విక్రయం మొదలైతే.. టికెట్ల కలెక్షన్ల మొత్తం ప్రభుత్వం థియేటర్ల యజమానులకు ఎప్పుడిస్తుందో’.. అంటూ థియేటర్ల యజమానులను గందరగోళపరిచేందుకు యత్నిస్తున్నారు. కానీ, దీంతో నిమిత్తం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్లను ఆన్‌లైన్ విధానంలో విక్రయించే విధానాన్ని త్వరలో ప్రారంభించడానికి ఉద్యుక్తమవుతోంది.
రోజువారీ ప్రాతిపదికన థియేటర్ల ఖాతాకు బదిలీ
ఆన్‌లైన్ విధానంలో సినిమా టికెట్ల విక్రయానికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ప్రభుత్వం జీఓ జారీచేసి మార్గదర్శకాలను వెల్లడించింది. ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయానికి టెండర్ల ప్రక్రియ పూర్తిచేసింది. మరోవైపు.. ఏపీఎస్‌ఎఫ్‌టీవీటీడీసీ రాష్ట్రంలోని సినిమా థియేటర్ల యజమానులతో ఒప్పందం కుదుర్చుకునే ప్రక్రియ చేపట్టింది. ఆన్‌లైన్ విధానంపై ఎలాంటి సందేహాలకు ఆస్కారంలేకుండా అన్ని అంశాలను సమగ్రంగా ఒప్పంద పత్రంలో పేర్కొంది. ప్రధానంగా ఆన్‌లైన్ విధానంలో సినిమా టికెట్ల విక్రయం ద్వారా వసూలైన మొత్తాన్ని థియేటర్ల యాజమాన్యానికి తిరిగి ఎప్పుడు బదిలీ చేస్తారు అనే అంశంపై స్పష్టత ఇచ్చింది. ఎంఓయూలోని ఆరో నిబంధనలో ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొంది. టికెట్ల కలెక్షన్‌ను రోజువారి ప్రాతిపదికన సంబంధిత థియేటర్ల బ్యాంకు ఖాతాకు బదిలీ చేస్తామని వెల్లడించింది.
సినిమా టికెట్ల కలెక్షన్లలో సర్వీస్ చార్జి (1.95శాతం) మినహాయించుకుని మిగిలిన మొత్తం అంటే జీఎస్టీతో సహా థియేటర్ల బ్యాంకు ఖాతాలో ఒక్క రోజులోనే జమవుతుంది. థియేటర్ల యాజమాన్యమే జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఒకరోజు కలెక్షన్ ఆ మర్నాడే థియేటర్ల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ అవుతుంది. ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంది. కాబట్టి సినిమా టికెట్ల విక్రయ మొత్తం తమకు ఎప్పుడు చేరుతుంది అనేదానిపై థియేటర్ల యాజమాన్యాలు ఆందోళన చెందాల్సిన అవసరమేలేదని ఎఫ్‌డీసీ వర్గాలు స్పష్టంచేస్తున్నాయి. అంతేకాదు.. ఆన్‌లైన్ విధానాన్ని సక్రమంగా నిర్వహించేందుకు మరికొన్ని నిబంధనలను కూడా ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. అవి..
♦ఆన్‌లైన్ వెబ్‌సైట్ లాగిన్ సౌకర్యం థియేటర్ కౌంటర్ వద్ద, మేనేజర్ చాంబర్‌లోనూ కల్పిస్తారు.
♦థియేటర్లకు బీఫాం లైసెన్సులు రెన్యువల్ కూడా ఆన్‌లైన్ విధానంలోనే సులభంగా చేస్తారు.
♦సినిమా టికెట్లను ఆన్‌లైన్ విధానంలో ముందుగా రిజర్వ్ చేసుకునే సౌలభ్యం కల్పిస్తారు. అడ్వాన్స్ టికెట్ల బుకింగ్ మొత్తం కూడా సంబంధిత షో ముగిసిన తరువాతే థియేటర్ల బ్యాంకు ఖాతాకు బదిలీచేస్తారు.
అక్రమాలకు కళ్లెంపడుతుందనే ఆందోళన
దశాబ్దాలుగా సినిమా టికెట్ల విక్రయాల్లో అక్రమాలకు పాల్పడుతున్న కొందరికి ఆన్‌లైన్ విధానం సంకటప్రాయంగా మారింది. ఆన్‌లైన్ విధానాన్ని పారదర్శకంగా అమలుచేసేందుకు ప్రభుత్వం స్పష్టమైన విధివిధానాలను ప్రకటించడమే అందుకు కారణం. సినిమా సీట్లను మ్యాపింగ్ చేయనుండటంతో కలెక్షన్లను తక్కువగా చూపించి పన్ను ఎగవేయడం ఇకపై సాధ్యంకాదు. థియేటర్లు కచ్చితంగా బీఫామ్ లైసెన్స్‌ను రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి. అందుకే.. ఆన్‌లైన్ విధానాన్ని అడ్డుకునేందుకు కొందరు దుష్ప్రచారానికి తెరతీశారు. ప్రధానంగా.. హైదరాబాద్‌లో ఉంటున్న కొందరు ఏపీ థియేటర్ల యజమానులను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తున్నారు.
ఎంఓయూ కుదుర్చుకోకుంటే..
ఆన్‌లైన్ విధానానికి కట్టుబడిన రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. నిర్ణీత గడువులోనే థియేటర్ల యజమానులు ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని స్పష్టంచేసింది. జూలై మొదటివారంలో ఆన్‌లైన్ టికెట్ల విక్రయం విధానాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు. ఈలోగా ఎంవోయూల ప్రక్రియ పూర్తిచేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్లను ప్రభుత్వం నిర్దేశించింది. అందుకు విరుద్ధంగా వ్యవహరించే థియేటర్లపై చర్యలు తీసుకోవాలని కూడా స్పష్టంచేసింది.
Comments
Please login to add a commentAdd a comment