సాక్షి, అమరావతి/దొండపర్తి (విశాఖ దక్షిణ)/విజయనగరం టౌన్: రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం ఆలయానికి చెందిన సుమారు రూ.12 వేల కోట్లు విలువ చేసే 840 ఎకరాల భూములను ఆలయ ఆస్తుల రిజిస్టర్ నుంచి తొలగించిన అంశంపై విచారణకు దేవదాయ శాఖ ఇద్దరు అధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు దేవదాయ శాఖ ప్రత్యేక కమిషనర్ అర్జునరావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2013–19 మధ్య ఆలయ భూముల ఆస్తుల రిజిస్టర్లలో రికార్డుల ట్యాంపరింగ్ జరిగినట్టు ప్రాథమిక ఆధారాలు లభించాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీటిపై విచారణ జరిపేందుకు దేవదాయ శాఖ అడిషనల్ కమిషనర్–1 చంద్రకుమార్, విశాఖపట్నం డివిజన్ డిప్యూటీ కమిషనర్ పుష్పవర్థన్‌లతో కమిటీని ఏర్పాటు చేశారు. అప్పట్లో మాన్సాస్ ట్రస్టు భూముల్లో జరిగిన అక్రమాలపైన కూడా ఈ ఇద్దరు అధికారులు విచారణ జరిపి ఈ నెల 15లోగా ప్రాథమిక నివేదిక అందజేయాలని ఆదేశించారు. సింహాచలం ఆలయ, మాన్సాస్ ట్రస్టు ఈవోలు విచారణ కమిటీ ముందు రికార్డులను అందుబాటులో ఉంచాలన్నారు. విచారణలో భాగంగా కమిటీ సభ్యులు క్షేత్ర స్థాయిలో పరిశీలించేటప్పుడు ఆయా అధికారులు హాజరు కావాలని పేర్కొన్నారు.
టీడీపీ హయాంలో రికార్డుల ట్యాంపరింగ్
సింహాచలం దేవస్థానానికి 2010లో 11,118 ఎకరాల భూమి ఉన్నట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. అయితే 2016 నాటికి ఇందులో 10,278 ఎకరాలే మిగిలాయి. 840 ఎకరాల భూములను ఆలయ రికార్డుల నుంచి తప్పించినట్లు దేవదాయ శాఖ అధికారులు తాజాగా గుర్తించారు. ఆలయ భూములు, ఆస్తుల పరిరక్షణలో భాగంగా జియోఫెన్సింగ్ ప్రక్రియ చేపడుతున్న క్రమంలో ఈ వేల కోట్ల రూపాయల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దీనిపై ప్రభుత్వం జిల్లా అధికారులతో విచారణ జరిపించగా టీడీపీ ప్రభుత్వ హయాంలో రికార్డుల ట్యాంపరింగ్ జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయి. 2016లో అప్పటి సింహాచలం దేవస్థానం ఈవోగా పనిచేసిన కె.రామచంద్రమోహన్ ఆలయ భూరికార్డులను ట్యాంపరింగ్ చేసి వందల ఎకరాలను రికార్డుల నుంచి తొలగించినట్లు గుర్తించారు. అలాగే ఆయన మాన్సాస్ ట్రస్ట్ ఈవో (ఎఫ్‌ఏసీ)గా ఉన్న సమయంలో పలు భూ అక్రమాలకు పాల్పడినట్లు తేల్చారు. దీంతో ఆయనను విధుల నుంచి తప్పించి ఇప్పటికే ప్రభుత్వానికి సరెండర్ చేశారు. తాజాగా ఈ వ్యవహారాలన్నింటిపై సమగ్ర విచారణకు ప్రభుత్వం సిద్ధమైంది.
మాన్సాస్‌లో ప్రారంభమైన ఆడిటింగ్
మాన్సాస్ ట్రస్ట్ కార్యకలాపాలు, భూవ్యవహారాలపై గత కొన్నేళ్లుగా అనేక ఆరోపణలు, వివాదాలు తలెత్తుతున్నాయి. గత 16 ఏళ్లుగా ట్రస్టులో ఆడిటింగ్ జరగకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. దీంతో ప్రభుత్వం ట్రస్ట్ వ్యవహారాలతోపాటు భూములపై కూడా పూర్తి స్థాయిలో ఆడిటింగ్ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అధికారులు మాన్సాస్ ట్రస్ట్ రికార్డులు, భూముల వివరాలను సేకరించే పనిలో ఉన్నారు. విజయనగరం జిల్లా ఆడిట్ అధికారి డాక్టర్ హిమబిందు ఆధ్వర్యంలో అధికారుల బృందం కోటలో ఉన్న ట్రస్ట్ ప్రధాన కార్యాలయానికి వెళ్లి సోమవారం రికార్డులను పరిశీలించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2004 నుంచి మాన్సాస్ ట్రస్ట్ ఆడిటింగ్ జరగలేదన్నారు. తమ విధి నిర్వహణలో భాగంగా ఏటా ఆడిటింగ్ చేసేందుకు నోటీసులిస్తున్నా ట్రస్ట్ పెద్దలు సహకరించలేదని చెప్పారు. ఇప్పటికీ దేవాలయాలు, విద్యాసంస్థలకు సంబంధించిన ఎటువంటి పత్రాలు తమకు అందజేయలేదని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment