
ఉక్కునగరం గురజాడ కళాక్షేత్రంలో సిద్ధం చేస్తున్న పడకలు
ఉక్కునగరం (గాజువాక): కరోనా రెండో దశ విజృంభిస్తున్న నేపథ్యంలో కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటుకు వెయ్యి పడకలతో విశాఖ స్టీల్‌ప్లాంట్ ముందుకు వచ్చింది. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ఇటీవల నిర్వహించిన సమావేశంలో ఇచ్చిన ఆదేశాల మేరకు కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించింది. ఇంజనీరింగ్ షాప్స్‌లోని యుటిలిటీ ఎక్విప్‌మెంట్ రిపేర్ షాప్‌లో బెడ్ల నిర్మాణం ప్రారంభించింది.
తొలుత ఉక్కు నగరంలోని వివాహ వేదిక గురజాడ కళాక్షేత్రంలో 50 సాధారణ బెడ్లు, 50 ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేస్తున్నారు. తర్వాత దశల వారీగా కమ్యూనిటీ వెల్ఫేర్ సెంటర్లు, ఇతర వేదికలను కోవిడ్ సెంటర్లుగా మార్చి అందులో చికిత్స అందించనున్నారు. ఇప్పటికే ఉక్కు జనరల్ ఆస్పత్రిలో 110 పడకలు కలిగిన వార్డులో కోవిడ్ రోగులకు చికిత్స అందిస్తున్నారు. స్టీల్‌ప్లాంట్ తన బాధ్యతగా ఏప్రిల్ 13 నుంచి ఇప్పటివరకు 2,200 టన్నుల మెడికల్ ఆక్సిజన్‌ను కోవిడ్ పేషంట్లకు చికిత్సకు సరఫరా చేసింది.