తీరం దాటిన రెమాల్‌.. ఇక భగభగలే! | Cyclone Remal slams into Bangladesh coast | Sakshi
Sakshi News home page

తీరం దాటిన రెమాల్‌.. ఇక భానుడి భగభగలే!

May 27 2024 3:31 AM | Updated on May 27 2024 7:18 AM

Cyclone Remal slams into Bangladesh coast

అర్ధరాత్రి తరువాత బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్‌ మధ్య..

బెంగాల్‌లో అత్యంత భారీ వర్షాలు.. పలు విమాన, రైలు సర్వీసులు రద్దు 

ఏపీలో పొడి వాతావరణం

రాష్ట్రంలో 2 నుంచి 4 డిగ్రీలు పెరగనున్న గరిష్ట ఉష్ణోగ్రతలు

సాక్షి, విశాఖపట్నం: తీవ్ర తుపానుగా బల­పడిన రెమాల్‌ ఆదివారం అర్ధరాత్రి తర్వాత పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌ మధ్య తీరం దాటింది. అంతకుముందు తీవ్ర తుపాను గంటకు 16 కిలోమీటర్ల వేగంతో ఉత్తర బంగాళాఖాతం నుంచి తీరం వైపు పయనించింది. తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు విపత్తు నిర్వహణ కోసం భారీ ఎత్తున ఎన్‌డీ­ఆర్‌­ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలకు ఉపక్రమించాయి. తుపాన్‌ ప్రభావం మన రాష్ట్రంపై అంతగా లేకపోయినా.. దీని కారణంగా రాష్ట్రంలో తేమ మొత్తం పోయింది. పొడి వాతావరణం ఏర్పడింది.

దీనికితోడు ఏపీ, యానాంలో పశ్చిమదిశగా గాలులు వీస్తుండటంతో ఉక్కపోత మరింత ఎక్కువ కానుంది. రాబోయే రెండురోజులు కోస్తా, రాయలసీమల్లో పొడి వాతావరణం ఏర్పడు­తుందని, గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదవు­తాయని భారత వాతావరణశాఖ తెలిపింది. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమల్లో ఒకటిరెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ  అధికారులు తెలిపారు.

రెండురోజుల తర్వాత ఉష్ణోగ్రతలు మరింత పెరిగే సూచనలు కని­పిస్తు­న్నాయని వెల్లడించారు. మరోవైపు నైరుతి బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతం, ఈశా­న్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లోకి రుతుపవనాలు విస్తరించాయి. నైరుతి ఈ నెల 31 నాటికి కేరళలోకి ప్రవేశించేందుకు అవకా­శాలు కనిపిస్తు­న్నా­­యని ఏపీ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. 

వాతావరణ మార్పుల కారణంగా ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే భానుడి భగభగలు మొదలయ్యాయి. ఏప్రిల్‌ నెలలో తీవ్ర వడగాలులకు తోడు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదు కావడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఇప్పుడు రెమాల్‌ తుపాను ముప్పు తప్పినప్పటికీ.. గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. నైరుతి రుతుపవనాలు వచ్చేవరకు(జూన్‌ 3దాకా) ఇదే పరిస్థితి కొనసాగుతుందని, వడగాలులు తీవ్రరూపం దాల్చుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement