సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలు ముగిసిన తరువాత రెండు పార్టీల రాష్ట్ర అధ్యక్షులపై ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఒకరేమో గెలుపు మనదేనంటూ గల్లీ నుంచి ఢిల్లీ స్థాయి నాయకులను తీసుకువచ్చి ప్రచారం చేయించారు.. పోలింగ్ నాటికి పార్టీ ప్రభావమే లేకుండా చేశారు. మరొకరు ప్రచారం పీక్ లెవెల్‌కు వెళ్లాక పార్టీ పరువు తీశారు. ఆ ఇద్దరు.. బీజేపీ, టీడీపీల రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, అచ్చెన్నాయుడు. ఈ ఇద్దరికీ పదవీగండం పొంచి ఉన్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. షెడ్యూల్ ప్రకటించక ముందు నుంచే బీజేపీ ఈ ఉప ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఏపీ వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్ దియోధర్ విస్తృత సమీక్షలు, సమావేశాలు నిర్వహించారు.
తెలంగాణలో దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన తర్వాత దేశం మొత్తం బీజేపీ వైపే చూస్తోందని, తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా విజయం సాధించి తీరతామని చెప్పారు. తీరా షెడ్యూల్ వచ్చిన తరువాత స్థానిక నేతల్ని కాదని కర్ణాటక చీఫ్ సెక్రటరీగా పదవీ విరమణ చేసిన రత్నప్రభను అభ్యర్థిగా ఎంపిక చేశారు. దుబ్బాక ఫలితం, జనసేన మద్దతు కలిసివస్తాయని నేతలు భావించారు.
ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నేతలు టీటీడీ కేంద్రంగా అనేక వివాదాలు సృష్టించారు. హిందుత్వం ఆధారంగా రాజకీయంగా లబ్ధిపొందాలని అనేక ఎత్తుగడలు వేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ప్రచారానికి తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చిన తరువాత వాస్తవికతను గ్రహించిన ఆయన పార్టీ రాష్ట్ర నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో కమిటీలు కూడా ఏర్పాటు చేయకుండానే ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తున్నారు? ఏవిధంగా గెలుస్తామంటున్నారు? అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డట్లు తెలిసింది. ఏపీ బీజేపీ నేతలకు సీరియస్‌నెస్ లేదని పార్టీ హైకమాండ్ భావిస్తున్నట్లు తెలిసింది. దీంతో ఫలితాల అనంతరం వీర్రాజుకు పదవీగండం ఉందనే విశ్లేషణలు సాగుతున్నాయి.
సైకిల్ గాలి తీసిన అచ్చెన్నాయుడు
తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో టీడీపీ జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చంద్రబాబు, లోకేశ్ రెండు వారాలు ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ కార్యక్రమాలను, సీఎం వైఎస్ జగన్, మంత్రి పెద్దిరెడ్డి్డలను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ రాజకీయ లబ్ధికోసం ప్రయత్నించారు. ప్రచారం పీక్ లెవెల్‌కు చేరిందని భావిస్తున్న తరుణంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వీడియో ఒక్కసారి టీడీపీ సైకిల్ గాలి తీసింది. టీడీపీ బాధితుడు ఆకుల వెంకటేశ్వరరావు ఆవేదన నిజమేనని, లోకేశ్ సరిగా వ్యవహరించరని ఆ వీడియో ద్వారా ప్రపంచానికి తెలిసింది.
తండ్రీతనయుల శైలిని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడే స్వయంగా వెల్లడించడం, ఏప్రిల్ 17 తర్వాత పార్టీ లేదు.. బొ.. లేదని స్వయంగా చెప్పడంతో పార్టీ ఒక్కసారిగా డీలాపడింది. 2019 ఫలితాల కంటే తాజా ఎన్నికల్లో టీడీపీ ఓట్లు గణనీయంగా తగ్గనున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అచ్చెన్నాయుడికి పదవీగండం తప్పదని చంద్రబాబు సన్నిహితులుగా ఉన్న చిత్తూరు జిల్లా నేతలు బాహాటంగానే చెబుతున్నారు. మరోవైపు టీడీపీ పెద్దలను నమ్మి మోసపోయినట్లు పార్టీ అభ్యర్థి పనబాక లక్ష్మి సన్నిహితుల వద్ద ఆవేదన చెందుతున్నట్లు తెలిసింది. తనతో సంప్రదించకుండానే అభ్యర్థిగా ప్రకటించారని, పోటీచేయనన్నా నిలబెట్టారని, పోలింగ్ సమీపిస్తున్న సమయంలో పార్టీ పెద్దలు చేతులెత్తేసి అవమానించారని చెప్పి ఆమె బాధపడుతున్నట్లు సమాచారం.
ఇక్కడ చదవండి:
తిరుపతి ఉప ఎన్నిక: ఓటమికి కారణాలు వెతుకుతున్న టీడీపీ
Comments
Please login to add a commentAdd a comment