అనంతపురం అర్బన్: పౌర సరఫరాల సంస్థ కార్యాలయంలో ఉద్యోగుల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి. సంస్థ డీఎం డమ్మీగా మారారంటూ కొందరు ముద్రించిన కరపత్రాలు బయటకు రావడం కలకలం రేపింది. ప్రధానంగా అసిస్టెంట్ మేనేజర్ (ఏఎం)ని టార్గెట్ చేస్తూ కరపత్రంలో ఆరోపణలు సంధించారు. జిల్లా మేనేజర్ పేరుకే అధికారిగా అంటూ... కార్యాలయంలో పెత్తనం పూర్తిగా అసిస్టెంట్ మేనేజర్‌దే అంటూ విమర్శలు చేశారు. గతంలో ఆయన పనిచేసిన చోట ఉద్యోగులతో ఏ విధంగా వ్యవహరించారనేది చెబుతూ... ఇక్కడా అదే తరహాలో వ్యవహరిస్తున్నారు అంటూ... ఇలా పలు ఆరోపణలతో కూడిన కరపత్రం బయటికి రావడం కార్యాలయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
చాలా రోజులుగా ఉద్యోగుల మధ్య విభేధాలు
సంస్థ ఉద్యోగుల్లో ఏడాది కాలంగా విబేధాలు నెలకొన్నాయి. ప్రస్తుతం అవి తీవ్రస్థాయికి చేరుకుని ఏకంగా కరపత్రాలు ముద్రించే వరకు వచ్చాయి. ఇటీవల కాలంలో సంస్థలోని కొందరు ఉద్యోగులు, అధికారులపైనా ఆరోపణలు వెల్లువెత్తాయి. పర్సంటేజీ కోసం కాంట్రాక్టర్లపై ఒత్తిడి చేస్తున్నారని, ఉద్యోగులపై కొందరు అధికారులు బెదిరింపులకు దిగుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు ఇక్కడి వ్యవహారాలపై దృష్టి పెట్టకపోతే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉంది. కాగా, కరపత్రం విషయాన్ని సంస్థ జిల్లా మేనేజర్ మోహన్‌బాబు దృష్టికి ‘సాక్షి’ తీసుకెళ్లింది. దీనిపై ఆయన వివరణ ఇచ్చేందుకు కొంత ఇబ్బంది పడ్డారు. మాది ఈ ప్రాంతం కాదు.. ఒకటి రెండేళ్లు ఉండి వెళ్లిపోతాం..అంటూ ముభావంగా ఉండిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment