
కాకినాడ క్రైం: డబ్బులు తీసుకొని కరోనా పరీక్షలు చేస్తున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్న సీనియర్ స్టాఫ్ నర్సుకు కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాఘవేంద్రరావు అండదండలు అందించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. అరెస్టు వరకు వెళ్లిన కిట్ల వ్యవహారంలో, నేరుగా పోలీసులే ఆ స్టాఫ్ నర్సు పేరును ప్రస్తావించారు. అదీ కాక, నర్సుల డిప్యుటేషన్లలో ఆమె ఒక్కో నర్సు నుంచి రూ.పది వేల వరకు వసూలు చేశారనే ఆరోపణలూ ఉన్నాయి. దానిపై నర్సులందరూ కలసి ఆమెపై నేరుగా సూపరింటెండెంట్‌కే ఫిర్యాదు చేశారు. ఇన్ని వివాదాల మధ్య ఆమె పేరును పంద్రాగస్టు వేడుకల్లో ఇచ్చే ప్రశంసాపత్రానికి జీజీహెచ్ సూపరింటెండెంట్ సిఫారసు చేయడం విస్మయానికి గురిచేస్తోంది.
కరోనా పరీక్షల కోసం ఆ స్టాఫ్ నర్సుతో పాటు అవుట్‌సోర్సింగ్ ల్యాబ్ టెక్నీషియన్ డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలపై సూపరింటెండెంట్ స్తబ్దుగా ఉన్నారు. ఎటువంటి విచారణకు ఆదేశించలేదు. మరే చర్యలూ లేవు. కిట్ల దుర్వినియోగంపై ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాల్సి ఉన్నా చేయలేదు. విచారించే అవకాశం పోలీసులకూ ఇవ్వలేదు. ఫిర్యాదు అంశాన్ని ఒకటో పట్టణ సీఐ రామ్మోహనరెడ్డి వద్ద ప్రస్తావిస్తే తమకు ర్యాపిడ్ కిట్ల దుర్వినియోగంపై సూపరింటెండెంట్ నుంచి ఎటువంటి ఫిర్యాదు అందలేదని స్పష్టం చేశారు. ఇన్ని వివాదాల మధ్య తాఖీదులు ఇవ్వవలసిన స్టాఫ్ నర్సుకి ప్రశంసాపత్రం ఇవ్వాలని సిఫారసు చేయడం పలు అనుమానాలకు తావివ్వడమే కాకుండా, తీవ్ర విమర్శలకు కారణమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment