పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం రొంపిచెర్ల మండలం సంతగుడిపాడులో ఈ ఏడాది జూన్‌లో దాదాపు రూ.7 లక్షలతో మూడు వీధుల్లో సిమెంట్ కాలువలు నిర్మించారు. గ్రామ సర్పంచి 25 రోజుల క్రితం సీఎఫ్‌ఎంఎస్‌లో బిల్లులు నమోదు చేయగా పది రోజుల్లో డబ్బులు విడుదలయ్యాయి.
శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మండలం కంభరలో ఈ ఏడాది జూన్‌లో రూ.2.78 లక్షల పంచాయతీ నిధులతో సిమెంట్ కాలువలు నిర్మించారు. జూన్ 28వ తేదీన సీఎఫ్‌ఎంఎస్‌లో సర్పంచి బిల్లులు నమోదు చేయగా జూలై 1వ తేదీ కల్లా చెల్లింపులు పూర్తయ్యాయి. చిట్టిపూడివలసలో ఎండాకాలం రూ.1,45,919 పంచాయతీ నిధులతో బోర్ తవ్వి మోటార్ అమర్చుకున్నారు. దీనికి సంబంధించి బిల్లుల చెల్లింపులు జూన్ మొదటి కల్లా పూర్తయ్యాయి. తాలవరంలో రూ.1.03 లక్షల మండల పరిషత్ నిధులతో కొత్త పంపుసెట్ ఏర్పాటు చేసుకోగా సీఎఫ్‌ఎంఎస్ ద్వారా వెంటనే బిల్లుల చెల్లింపులు జరిగాయి.
సాక్షి, అమరావతి: వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై వ్యక్తిగత అక్కసు, దురుద్దేశాలతో పదేపదే అసత్యాలను అచ్చోసే ‘ఈనాడు’ కన్ను ఈసారి పంచాయతీలపై పడింది. గ్రామ పంచాయతీలకు నిధులివ్వకుండా ప్రభుత్వం ఆర్థికంగా దెబ్బ తీస్తున్నట్లు తప్పుడు కథనాలను ప్రచురించింది. నిజానికి అన్ని పంచాయతీల్లో కనీస అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులను అందుబాటులోనే ఉంచింది. పంచాయతీరాజ్‌శాఖ ఇటీవల సేకరించిన వివరాల ప్రకారం రాష్ట్రంలోని 13,371 గ్రామ పంచాయతీల ఖాతాల్లో రూ. 462 కోట్ల మేర 14, 15వ ఆర్థిక సంఘం నిధులు అందుబాటులో ఉన్నాయి. మండల పరిషత్‌ల వద్ద మరో రూ.409 కోట్లు, జిల్లా పరిషత్‌ల వద్ద రూ.289 కోట్ల మేర 15వ ఆర్థిక సంఘం నిధులున్నాయి. పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌ల స్థాయిలో స్థానిక అవసరాలకు తగ్గట్లుగా అభివృద్ధి పనులు నిర్వహించుకునేందుకు స్థానిక సంస్థల వద్ద మొత్తం రూ.1,160 కోట్ల మేర ఆర్థిక సంఘం నిధులున్నాయి. వీటికి అదనంగా పంచాయతీలకు ఇంటి పన్ను, ఇతర పరోక్ష పన్నుల రూపంలో ఏటా రూ.684 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుంది. ఆ నిధులు కూడా ఆయా పంచాయతీల జనరల్ ఫండ్ ఖాతాలో అందుబాటులో ఉంటాయి.
► ఈ ప్రకారం గ్రామ పంచాయతీల బ్యాంకు ఖాతాల్లో 15వ ఆర్థిక సంఘం నిధులు, జనరల్ ఫండ్ నిధులు కలిపి రూ.1,146 కోట్లు అందుబాటులోనే కనిపిస్తున్నాయి.
► ఇటీవల పంచాయతీల పర్యవేక్షణలో రూ.392 కోట్లతో వివిధ పనులు చేపట్టగా, మండల, జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన వాటితో కలిపితే మొత్తం రూ.511 కోట్ల మేర పనులు జరిగాయి. వాటికి సంబంధించిన బిల్లుల చెల్లింపులు సీఎఫ్‌ఎంఎస్ ద్వారా ఎప్పటికప్పుడు జరిగిపోతూనే ఉన్నాయి.
► ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో రెండు త్రైమాసికాలకు సంబంధించిన తలసరి గ్రాంట్ నిధులను కూడా పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది.
కేంద్రం నిధులు ఏడాదిగా పెండింగ్‌లో ఉన్నా..
ఆంధ్రప్రదేశ్ సహా దేశంలోని పలు రాష్ట్రాల్లో గ్రామీణ స్థానిక సంస్థలకు గత ఏడాది రెండో విడతగా ఇవ్వాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులను కేంద్రం ఇంతవరకూ విడుదల చేయలేదు. గ్రామ పంచాయతీలకు రూ.678. 65 కోట్లు, మండల, జిల్లా పరిషత్‌లకు మరో రూ.290.86 కోట్లు కలిపి మొత్తం గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.969 కోట్ల మేర కేంద్రం నుంచి గత ఏడాది బకాయిలు రావాల్సి ఉంది. వీటికి తోడు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి విడతలో రూ.1,000 కోట్లు గ్రామీణ స్థానిక సంస్థలకు కేంద్రం నుంచి నిధులు రావాల్సి ఉంది. కేంద్రం నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ గ్రామాల్లో స్థానిక సంస్థలకు ఇబ్బంది కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టినట్లు పంచాయతీరాజ్ శాఖ అధికారులు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment