రూ.21 వేల కోట్ల హెరాయిన్‌ స్మగ్లింగ్‌ కేసు.. సింగే కింగ్‌ పిన్‌ | Drugs smuggling: Key Elements Of DRI Investigation Were Revealed | Sakshi
Sakshi News home page

రూ.21 వేల కోట్ల హెరాయిన్‌ స్మగ్లింగ్‌ కేసు.. సింగే కింగ్‌ పిన్‌

Published Sat, Oct 9 2021 8:00 AM | Last Updated on Sat, Oct 9 2021 10:11 AM

Drugs smuggling: Key Elements Of DRI Investigation Were Revealed - Sakshi

సాక్షి, అమరావతి: దేశంలో సంచలనం సృష్టించిన హెరాయిన్‌ దందా గుట్టు వీడింది! టాల్కం పౌడర్‌ పేరుతో అఫ్ఘనిస్తాన్‌ నుంచి గుజరాత్‌కు రూ.21 వేల కోట్ల హెరాయిన్‌ స్మగ్లింగ్‌ కేసులో కేంద్ర డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) కీలక పురోగతి సాధించింది. ఢిల్లీకి చెందిన కుల్దీప్‌సింగ్‌ ఈ డ్రగ్స్‌ రాకెట్‌లో కీలక సూత్రధారిగా డీఆర్‌ఐ దర్యాప్తు నివేదికలో పేర్కొంది. ఢిల్లీకి చెందిన మరొకరు కూడా ఇందులో కీలకపాత్ర పోషించినట్లు గుర్తించింది. కుల్దీప్‌సింగ్‌ చెన్నైకు చెందిన సుధాకర్‌ దంపతులకు కమీషన్ల ఎరవేసి స్మగ్లింగ్‌ దందాను నడిపి నట్లు నిర్ధారించింది. ఢిల్లీలో కేంద్రీకృతమైన ఈ ముఠా అంతర్జాతీయస్థాయిలో కొన్నేళ్లుగా మాదక ద్రవ్యాల స్మగ్లింగ్‌ దందా సాగిస్తున్నట్లు ఆధా రాలు సేకరించింది. హెరాయిన్‌ స్మగ్లింగ్‌ కేసును కేంద్ర ప్రభుత్వం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డీఆర్‌ఐ ఇప్పటివరకు చేసిన దర్యాప్తు నివేదికను ఎన్‌ఐఏ కు సమర్పించింది.

సింగే.. కింగ్‌ పిన్‌ 
అఫ్ఘనిస్తాన్‌ నుంచి భారీగా హెరాయిన్‌ స్మగ్లింగ్‌ దందాలో ఢిల్లీకి చెందిన కుల్దీప్‌ సింగే కింగ్‌ పిన్‌ అని డీఆర్‌ఐ నిర్ధారించింది.  చెన్నైకు చెందిన సుధాకర్‌ దంపతులతోపాటు ఈ కేసులో అరెస్టు చేసిన ఆరుగురు అఫ్ఘన్‌ జాతీయులు, ఓ ఉజ్బెకిస్తాన్‌ జాతీయురాలి కాల్‌ డేటా, వాట్సాప్‌ చాటింగ్, మెయిల్స్‌ను డీఆర్‌ఐ అధికారులు పరిశీలించారు. కుల్దీప్‌ సింగ్‌ పేరుతో ఢిల్లీ నుంచి ఓ డాన్‌ స్మగ్లింగ్‌ దందా నడిపిస్తున్నట్లు డీఆర్‌ఐ గుర్తించింది. చాటింగ్‌లో కుల్దీప్‌సింగ్‌గా పేర్కొ న్నప్పటికీ మారుపేరుతో వ్యవహరించి ఉండవ చ్చని డీఆర్‌ఐ భావిస్తోంది. ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారవేత్త కూడా డ్రగ్స్‌ దందాలో కీలక పాత్ర పోషించినట్లు డీఆర్‌ఐ అంచనాకు వచ్చింది. 

చదవండి: (బొగ్గు సంక్షోభంలో భారత్‌)

వాట్సాప్‌ గ్రూప్‌ ద్వారా...
డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ కోసం కుల్దీప్‌ సింగ్‌ వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసుకున్నాడు. అంతా  చాటింగ్‌ ద్వారా నడిపించాడు. అఫ్ఘనిస్తాన్‌ డ్రగ్స్‌ డీలర్‌ హాసన్‌ హుసేన్, చెన్నైకు చెందిన సుధాకర్‌ మధ్య జరిగిన వాట్సాప్‌ చాటింగ్‌ ఈ కేసులో కీలక అంశాలను వెల్లడించింది. తాను పంపిస్తున్న సరుకును ఢిల్లీలోని కుల్దీప్‌సింగ్‌కు చేర్చాలని సుధాకర్‌తో హాసన్‌ హుసేన్‌ పేర్కొనడం గమనార్హం. 

డబ్బిస్తేనే సరుకు పంపిస్తా..
ఈ ఏడాది జూన్‌ 6న టాల్కం పౌడర్‌ పేరుతో హెరాయిన్‌ గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు వచ్చిన విషయాన్ని హాసన్‌ హుసేన్‌ సుధాకర్‌కు చెప్పాడు. ఆ కన్‌సైన్‌మెంట్‌ ‘కుల్దీప్‌సింగ్, అలీపుర్, న్యూఢిల్లీ’ పేరున ఉంది. వాటిని ఢిల్లీ చేర్చేందుకు అషీ ట్రేడింగ్‌ కంపెనీకి చెందిన సుధాకర్‌ దిగుమతి చేసుకున్నాడు. ఈ సంద ర్భంగా వాట్సాప్‌ గ్రూప్‌లో సంభాషణలు డ్రగ్స్‌ దందాలో కీలక అంశాలను వెల్లడించాయి. తమ కంపెనీ పేరిట డ్రగ్స్‌ దిగుమతి చేసుకుంటు న్నందుకు సుధాకర్‌కు ఇవ్వాల్సిన కమీషన్‌ను కుల్దీప్‌ సింగ్‌ ఇంకా చెల్లించలేదు. దీంతో పోర్టులో ఆ సరుకును విడుదల చేసేందుకు సుధాకర్‌ సహకరించలేదు. ‘డబ్బులిస్తేనే సరుకు ఢిల్లీకి పంపించే ఏర్పాట్లు చేస్తా..’ అని సుధాకర్‌ చాటింగ్‌లో కుల్దీప్‌ సింగ్‌తో పేర్కొన్నట్లు డీఆర్‌ఐ గుర్తించింది. ఈ క్రమంలో కుల్దీప్‌సింగ్‌ రూ.4 లక్షలు సుధాకర్‌కు బదిలీ చేయడంతోపాటు మరో రూ.9 లక్షల నగదు హవాలా మార్గంలో చెల్లించాడు. అనంతరం ఆ హెరాయిన్‌ ముంద్రా పోర్టు నుంచి ఢిల్లీకి చేరింది. ఈ సమాచారం అంతా వాట్సాప్‌ గ్రూప్‌ చాటింగ్‌లో డీఆర్‌ఐ అధికారులు గుర్తించారు. 

చదవండి: (కోస్తాంధ్రకు మరో తుపాను!)

స్మగ్లింగ్‌ ఫ్రంట్‌ ఆఫీస్‌గా ‘అషీ’
అఫ్ఘనిస్తాన్‌ నుంచి గుజరాత్‌ పోర్టు మీదుగా కొన్నేళ్లుగా స్మగ్లింగ్‌ దందా సాగుతోంది. చెన్నైకు చెందిన సుధాకర్‌ దంపతులు లక్షలు కమీషన్‌గా తీసుకుంటూ స్మగ్లింగ్‌ ఫ్రంట్‌ ఆఫీస్‌గా తమ అషీ ట్రేడింగ్‌ కంపెనీని వాడుకునేందుకు అనుమతిం చారని రూఢీ అయింది. అందుకోసమే విజయ వాడ చిరునామాతో అషీ ట్రేడింగ్‌ కంపెనీని రిజి స్టర్‌ చేశారు. హెరాయిన్‌ స్మగ్లింగ్‌ వ్యవహారంతో విజయవాడకుగానీ ఆంధ్రప్రదేశ్‌కుగానీ నేరుగా ఎలాంటి సంబంధం లేదని నిర్ధారించారు. అస లు హెరాయిన్‌ ఏపీకి రాలేదని వెల్లడైంది. ఢిల్లీ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తూ భారీగా అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఈ కేసులో సేకరించిన సమాచారంతో ముంబై, ఇతర మెట్రో నగరాల్లో డీఆర్‌ఐ దాడులు నిర్వహించి పెద్ద ఎత్తున హెరాయిన్‌ను స్వాధీనం చేసుకోవడం ఈ విషయాన్ని నిర్ధారి స్తోంది. డీఆర్‌ఐ అధికారులు ఏపీలో  ఎలాంటి తనిఖీలుగానీ దాడులుగానీ నిర్వహించక పోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

కొనసాగుతున్న వేట...
స్మగ్లింగ్‌ దందాలో కింగ్‌ పిన్‌ కుల్దీప్‌ సింగ్‌ ఆచూకీ కోసం డీఆర్‌ఐ, ఎన్‌ఐఏ దర్యాప్తు ముమ్మరం చేశాయి. ఈ ఏడాది జూన్‌లో వచ్చిన హెరాయిన్‌ కన్‌సైన్‌మెంట్‌లో పేర్కొన్న కుల్దీప్‌ సింగ్‌ చిరునామా సరైంది కాదని తేలింది. ఉద్దేశపూర్వకంగానే తప్పుడు చిరునామా, ఫోన్‌ నంబర్లు ఇచ్చినట్లు వెల్లడైంది. వాట్సాప్‌ గ్రూప్‌లోని ఫోన్‌ నంబర్లు ఆధారంగా కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. త్వరలోనే ఢిల్లీకి చెందిన కుల్దీప్‌ సింగ్‌ ఆచూకీ కనుగొంటామని డీఆర్‌ఐ వర్గాలు పేర్కొంటున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement