
మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల్లో ఫిర్యాదుల కోసం వైఎస్సార్‌సీపీ ప్రత్యేకంగా ‘ఈ నేత్రం’ యాప్‌ను తీసుకొచ్చిందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. ఈ యాప్ ద్వారా క్షేత్ర స్థాయిలో ఎక్కడి నుంచైనా, ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చని చెప్పారు. ఫొటోలు, వీడియోలు సైతం అప్‌లోడ్ చేసే సౌలభ్యంతో ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఎన్నికల్లో అక్రమాలు, ప్రలోభాలు, ఇతర సమస్యలపై ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చన్నారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ‘ఈ నేత్రం’ యాప్‌ను విడుదల చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ శ్రేణులు క్షేత్ర స్థాయిలో జరిగిన అక్రమాలకు సంబంధించి ఫొటోలు, వీడియోల రూపంలో పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపిస్తే, వాటిని ఎన్నికల సంఘానికి అందజేస్తామని తెలిపారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే..
టీడీపీకి, ఎన్నికల కమిషనర్‌కు తేడా లేదు
► ఎస్‌ఈసీ నిమ్మగడ్డ యాప్ అంతా ఒట్టి బూటకం. టీడీపీకి, ఎన్నికల కమిషనర్‌కు తేడా లేదు. కేంద్ర ఎలక్షన్ కమిషన్ రూపొందించిన ‘సి విజిల్’ యాప్‌ను ఉపయోగించకుండా కొత్త యాప్ ఎందుకు తీసుకొచ్చారో నిమ్మగడ్డ సమాధానం చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎస్‌ఈసీ ‘ఈ–వాచ్’ యాప్‌ను రూపొందించారు. దీని నిర్వహణ ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉండటంతో మేము ‘ఈ నేత్రం’ యాప్‌ను అందుబాటులోకి తెచ్చాము. ఇది కొత్తది కాదు. 2014 నుంచి ఉన్న యాప్. మళ్లీ వాడుకలోకి తీసుకొచ్చాం. దీన్ని వైఎస్సార్‌సీపీ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
► కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర నాయకులు విడదల కుమార స్వామి, ఎ.నారాయణ మూర్తి, ఎన్.పద్మజ తదితరులు పాల్గొన్నారు.
ఈ–వాచ్ ఉపసంహరించాలి
రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆవిష్కరించిన ‘ఈ–వాచ్’ యాప్‌పై వైఎస్సార్‌సీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని ఎన్నికల కమిషన్‌ను లిఖిత పూర్వకంగా కోరింది. కేంద్ర ఎన్నికల కమిషన్ లేదా రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన వ్యవస్థను ఉపయోగించాలని డిమాండ్ చేసింది. పార్టీ నేత లేళ్ల అప్పిరెడ్డి బుధవారం ఎన్నికల కమిషన్‌ను కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. ‘ఎన్నికల కమిషన్ ప్రైవేట్ వ్యక్తులతో రూపొందించిన యాప్‌ను తీసుకురావడం తగదు. దీనివల్ల ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో డేటా ఉండే అవకాశముంది. ఇది పౌరుల హక్కులను హరించడమే’ అని పేర్కొన్నారు.