
సాక్షి, రాజమహేంద్రవరం: మార్గదర్శి చిట్స్‌కు సంబంధించి గతంలో రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ తనకిచ్చిన సమాచారాన్ని సీఐడీ అధికారులకు పంపుతున్నానని.. ఆ వివరాలను ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్)కు పంపి విచారణ చేపట్టాలని తాను కోరుతున్నట్లు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ తెలిపారు.
రాజమహేంద్రవరంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ చిట్‌ఫండ్ 14(2) యాక్ట్ ప్రకారం చిట్‌ఫండ్స్ ద్వారా సేకరించిన మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్ చేయాల్సి ఉన్నా.. మార్గదర్శిలో అలా జరగడంలేదని.. మ్యూచువల్ ఫండ్స్‌లో పెటు్టబడులు పెట్టారని, ఇతర వ్యాపారాలకూ వినియోగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈనాడు పత్రిక సైతం చిట్‌ఫండ్స్ డబ్బుతోనే నడుస్తోందన్నారు.
ఇది వ్యవస్థలను తప్పుదోవ పట్టించడం కాదా?
ఇక మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు, రామోజీరావుకు సంబంధం ఏమిటని ప్రశ్నిస్తూ తనపై వేసిన రూ.50 లక్షల పరువునష్టం దావాకు సంబంధించిన అఫిడవిట్లో సంతకం చేసిన రాజాజీ.. ఇప్పుడు అదే చిట్‌ఫండ్స్‌కు చైర్మన్ రామోజీయేనని తెలంగాణ హైకోర్టులో తాజాగా వేసిన అఫిడవిట్లో పేర్కొన్నారని.. ఇది వ్యవస్థలను తప్పుదోవ పట్టించడం కాదా? అని ఉండవల్లి ప్రశ్నించారు.
రామోజీరావు తప్పుచేశాడని తాను నిరూపిస్తానని.. ఆధారాలతో సహా చర్చకు వస్తా, చేసిన తప్పు ఒప్పుకునే ధైర్యం రామోజీకి ఉందా? అని ప్రశ్నించారు. ఇదే ప్రశ్న తాను 17 ఏళ్లుగా అడుగుతున్నా ఇప్పటిదాకా స్పందించలేదని ఉండవల్లి ఎద్దేవాచేశారు. నిజానికి.. మార్గదర్శి ఫైనాన్స్ షేర్‌పై తాను కేసు పెట్టే సమయానికి కంపెనీ రూ.1,360 కోట్ల నష్టాల్లో ఉందని, రామోజీ ఒక సెలబ్రిటీ కాబట్టి ఇప్పటివరకు ఆయనపై చర్యలు తీసుకోలేదన్నారు.
తప్పు రామోజీది.. బాధ్యులు ఫోర్‌మెన్లా?
మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో అవకతవకలపై ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని.. అధికారులకు సంస్థ ఎలాంటి పత్రాలూ ఇవ్వడంలేదని ఉండవల్లి ఆరోపించారు. చిట్‌ఫండ్స్‌లో రామోజీరావు తప్పులు చేస్తే.. వాటికి మార్గదర్శి బ్రాంచుల్లో పనిచేసే ఫోర్‌మన్లను బాధ్యుల్ని చేసి ఆయన తప్పించుకుంటున్నారన్నారు. తాను తప్పుచేశానని ఏనాడు రామోజీ ఒప్పుకోలేదని, ఎన్ని కేసులు వేసినా తాను ట్రయల్ కోర్టుకు వచ్చిన దాఖలాల్లేవన్నారు.
రామోజీ ఏమైనా చట్టానికి అతీతుడా? అని ఉండవల్లి ప్రశ్నించారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌పై ఎవరు ఫిర్యాదు చేశారని కొందరు విలేకరులు సీఐడీ అధికారులను ప్రశ్నిస్తున్నారని.. అలాగే, రామోజీరావును ఇబ్బంది పెట్టేందుకే ప్రభుత్వం మార్గదర్శి వ్యవహారాన్ని రచ్చచేస్తోందని ఆరోపిస్తున్నారని.. అలా అనుకుంటే తాము తప్పుచేయలేదని రామోజీ ఎందుకు చెప్పడంలేదని ఉండవల్లి సూటిగా ప్రశ్నించారు.