చీమంతైనా నిజముందా రామోజీ? | EEnadau Fake News on Rayalaseema Drought Relief Scheme | Sakshi
Sakshi News home page

చీమంతైనా నిజముందా రామోజీ?

Published Tue, Dec 6 2022 8:06 AM | Last Updated on Tue, Dec 6 2022 8:18 AM

EEnadau Fake News on Rayalaseema Drought Relief Scheme - Sakshi

నాడు:
కడలిలో కలుస్తున్న కృష్ణా జలాలను రాయలసీమకు తరలించి సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో దివంగత వైఎస్సార్‌ 2006లో పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్థ్యాన్ని 11 వేల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంపు పనులను చేపడితే చంద్రబాబు ధర్నాలకు దిగి ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టారు. జలయజ్ఞానికి విఘ్నాలు కల్పించే రాక్షసమూకకే ‘ఈనాడు’ బాకాలూదింది.

నేడు:
శ్రీశైలానికి వరద వచ్చే 30 – 40 రోజుల్లోనే కృష్ణా వరద జలాలను తరలించి రాయలసీమ ప్రాజెక్టులను నింపేలా పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్థ్యం 80 వేల క్యూసెక్కులకు పెంపు, కాలువల ప్రవాహ సామర్థ్యాన్నిపెంచడంతోపాటు కొత్త ప్రాజెక్టులను సీఎం జగన్‌ చేపట్టారు. రాయలసీమ కరువు నివారణ పథకం కింద చేపట్టిన ఈ ప్రాజెక్టులపై చంద్రబాబు ఎన్జీటీలో కేసులు వేయించి సైంధవుడిలా అడ్డుపడుతుంటే రామోజీ వంతపాడుతున్నారు.

సాక్షి, అమరావతి: రాయలసీమలో ఏ ప్రాజెక్టు చూసినా నిండుకుండను తలపిస్తోంది. భూగర్భ జలమట్టం పెరగడంతో ఎండిన బోర్లకూ జలకళ వచ్చింది. ఎన్నడూ లేని రీతిలో భారీ ఎత్తున రైతులు పంటలు సాగు చేస్తుండటంతో కూలీలకు సమృద్ధిగా పని దొరుకుతోంది. రైతులు, కూలీలు సంతోషంగా ఉంటే కొందరికి మాత్రం రుచించడం లేదు. న్యాయ రాజధాని కర్నూలులో ఏర్పాటైతే రాయలసీమ సమగ్రాభివృద్ధి చెందుతుందనే ఆకాంక్షతో గర్జన సభ నిర్వహిస్తున్న రోజు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ‘సీమంతైనా మేలు చేశారా’ అనే శీర్షికతో ‘ఈనాడు’ అబద్ధాలను కుమ్మరించింది. పేజీలకు పేజీలు అచ్చోసినా అందులో చీమంతైనా నిజం లేదు! రాయలసీమ కరువు నివారణ పథకం(ఆర్‌డీఎంపీ) కింద రూ.43,336 కోట్లతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 33 ప్రాజెక్టులను చేపట్టి నిధుల సమీకరణకు స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ ఏర్పాటు చేశారు. అవి పూర్తైతే టీడీపీకి పుట్టగతులు ఉండవనే భయంతో చంద్రబాబు అడ్డుకునే కుట్రలకు వ్యూహం రచించారు. 

సీమ ఎత్తిపోతలకు బ్రేక్‌ వేసిన ఎన్జీటీ
ఈనాడు: పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి 80 టీఎంసీలను తరలించే ఉద్దేశంతో చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పడకేసింది. 
వాస్తవం: శ్రీశైలంలో నీటి మట్టం 854 అడుగుల కంటే దిగువన ఉన్నా సాగు, తాగునీటి కష్టాలను కడతేర్చేందుకు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సీఎం జగన్‌ చేపట్టారు. దీనిపై తెలంగాణ సర్కార్‌ ఎన్జీటీలో కేసు వేయడంతో పర్యావరణ అనుమతి పొందాకే పనులు చేపట్టాలని నిర్దేశించింది. ఈ నేపథ్యంలో పర్యావరణ అనుమతి కోసం ఇప్పటికే కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు ఏపీ ప్రభుత్వం దరఖాస్తు చేసింది. యుద్ధప్రాతిపదికన పర్యావరణ అనుమతి సాధించి ఎన్జీటీ అనుమతితో ఎత్తిపోతలను పూర్తి చేయడానికి సిద్ధమైంది.

నిండుకుండల్లా ప్రాజెక్టులు..
ఈనాడు: బ్రహ్మంసాగర్‌ ఎత్తిపోతల, కుందూనదిపై జోలదరాశి, రాజోలి రిజర్వాయర్ల నిర్మాణం నిలిచిపోయాయి. బిల్లులు చెల్లించకపోవడం వల్ల అవుకు రెండో సొరంగం పనులు ఆగిపోయాయి.

వాస్తవం: గాలేరు–నగరి వరద కాలువ ప్రవాహ సామర్థ్యం 20 వేల క్యూసెక్కులు. ఈ కాలువలో అంతర్భాగమైన అవుకు వద్ద రెండు టన్నెళ్లు తవ్వాలి. ఇందులో ఎడమ సొరంగంలో మిగిలిన 45 మీటర్లను తవ్వలేక నాడు టీడీపీ సర్కార్‌ తాత్కాలికంగా లూప్‌ వేసింది. కుడి టన్నెల్‌ 162 మీటర్లలో ఫాల్ట్‌ జోన్‌(పెలుసు పొరలు)లో పనులు చేయలేక చేతులెత్తేసింది. ఆ పనులను అత్యాధునిక సాంకేతిక పరి/ê్ఞనంతో సీఎం జగన్‌ ప్రభుత్వం చేపట్టింది. మరో రెండు మూడు నెలల్లో ఈ టన్నెల్‌ పూర్తవుతుంది.

అప్పుడు 20 వేల క్యూసెక్కులను వరద కాలువ ద్వారా తరలించవచ్చు. గండికోట నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించి గరిష్టంగా 26.85 టీఎంసీలను నిల్వ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో పునరావాసం ద్వారా చిత్రావతిలో గరిష్టంగా 10 టీఎంసీలను నిల్వ చేస్తున్నారు. ఖరీఫ్‌ పూర్తయింది. రబీ ఆరంభంలో రాయలసీమలో ఏ ప్రాజెక్టును చూసినా నిండుకుండను తలపించడం కానరావడం లేదా?

అవార్డు నోటిఫై చేయలేదని తెలియదా?
ఈనాడు: ఆర్డీఎస్‌ కుడి కాలువ పనులు ఆగిపోయాయి. భూసేకరణ ఇబ్బందులతో ప్రాజెక్టు పనులు ముందుకు కదలడంలేదు.
వాస్తవం: ఆర్డీఎస్‌ కుడి కాలువకు బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ 4 టీఎంసీలు కేటాయించింది. ట్రిబ్యునల్‌ అవార్డును కేంద్ర జల్‌ శక్తి శాఖ నోటిఫై చేసే వరకూ పనులు ఆపేయాలని కృష్ణా బోర్డు ఆదేశించింది. ట్రిబ్యునల్‌ అవార్డును నోటిఫై చేయగానే రూ.1,985 కోట్లతో ఆర్డీఎస్‌ కుడి కాలువను పూర్తి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరు, మంత్రాలయం, కోడుమూరు నియోజక వర్గాల్లో 45 వేల ఎకరాలకు నీళ్లందించనుంది. 

సమస్యలను అధిగమిస్తూ ముందుకు..
ఈనాడు: భూసేకరణలో జాప్యం, కాంట్రాక్టర్‌కు రూ.వంద కోట్లు బిల్లులు చెల్లించకపోవడం వల్ల వేదవతి ఎత్తిపోతల ఆగిపోయింది. 
వాస్తవం: వేదవతి ఎత్తిపోతల పథకంలో భూసేకరణ సమస్యలను అధిగమించి రూ.1,942 కోట్లతో పూర్తి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆదోని, ఆలూరు నియోజకవర్గాల పరిధిలో 80 వేల ఎకరాలను వేదవతి ఎత్తిపోతలతో సస్యశ్యామలం చేసే పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టింది. 

గుండ్రేవులపై గట్టిగా పోరాటం
ఈనాడు: కేసీ కెనాల్‌ ఆయకట్టు స్థిరీకరణతోపాటు మరో రెండు లక్షల ఎకరాలకు అదనంగా నీళ్లందించేందుకు రూ.5,400 కోట్లతో గుండ్రేవుల రిజర్వాయర్‌ నిర్మాణానికి ప్రభుత్వానికి డీపీఆర్‌ను పంపారు. కానీ.. ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేశారు.

వాస్తవం: తుంగభద్రపై నిర్మించే గుండ్రేవుల రిజర్వాయర్‌తో కర్నూలు జిల్లాలో కొంత, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కొంత భూమి, గ్రామాలు ముంపునకు గురవుతాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కర్ణాటక, తెలంగాణను ఒప్పించేందుకు దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశాల్లో ప్రభుత్వం చేసిన పోరాటం కనపడలేదా? కర్ణాటక, తెలంగాణలో ముంపు గ్రామాల ప్రజలను ముంచేసైనా గుండ్రేవుల కట్టాలా రామోజీ?

ఇవేం పనులు?
ఈనాడు: సాగునీటి కోసం రైతులు ధర్నాలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. పనుల్లేక రైతు కూలీలు వలస బాట పట్టాల్సి వస్తోంది.
వాస్తవం: బ్రహ్మంసాగర్‌ మట్టికట్టలో నిర్మాణ లోపాల వల్ల లీకేజీలు ఏర్పడటంతో నాలుగైదు టీఎంసీలను కూడా నిల్వ చేయలేని దుస్థితి. 2014 నుంచి 2019 వరకూ అధికారంలో ఉన్న చంద్రబాబు బ్రహ్మంసాగర్‌కు మరమ్మతులు చేసిన పాపాన పోలేదు. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక డయాఫ్రమ్‌వాల్‌ నిర్మించి లీకేజీలకు అడ్డుకట్ట వేశారు. ప్రాజెక్టులో 17.74 టీఎంసీలకుగానూ 15.11 టీఎంసీలను నిల్వ చేస్తున్నారు. 

కమీషన్లతో ప్రజాధనం మట్టిపాలు
ఈనాడు: కర్నూలు పశ్చిమ ప్రాంతంలో హంద్రీ–నీవా నీటితో 68 చెరువులు నింపే పనులను చేపట్టి 52 శాతం పనులను టీడీపీ సర్కారే పూర్తి చేసింది. మూడున్నరేళ్లలో 24 శాతం పనులే పూర్తయ్యాయి.
వాస్తవం: టీడీపీ హయాంలో కమీషన్లు అధికంగా వచ్చే మట్టి తవ్వకం పనులకే ప్రాధాన్యం ఇచ్చారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పంప్‌హౌస్‌లతోపాటు కాంక్రీట్‌ పనులను చేపట్టింది. మిగతా 33 శాతం పనులను 2023 మార్చి నాటికి పూర్తి చేసే దిశగా వేగవంతం చేసింది. 2023 ఖరీఫ్‌కు నీళ్లందించే దిశగా ఇప్పటికే ట్రయల్‌ రన్‌ నిర్వహించింది. ఇది తెలుసుకోకుండా తప్పుడు కథనాలు రాస్తే ఎలా?

అక్రమాలను సరిదిద్దడం వల్లే జాప్యం
ఈనాడు: జీడిపల్లి–పేరూరు(అప్పర్‌ పెన్నార్‌) పథకంలో మూడు రిజర్వాయర్ల నిర్మాణం శిలాఫలకాలకే పరిమితమైంది. రూ.240 కోట్లతో చేపట్టాల్సిన మడకశిర బైపాస్‌ కెనాల్‌ను అటకెక్కించేశారు.
వాస్తవం: అప్పర్‌ పెన్నార్‌ ప్రాజెక్టులో చంద్రబాబు భారీ అక్రమాలకు పాల్పడ్డారు. వాటిని సరిదిద్ది ప్రాజెక్టును సమూలంగా ప్రక్షాళన చేయడం వల్లే జాప్యం చోటుచేసుకుంది. కొత్త డిజైన్‌ మేరకు పనులు చేపట్టి నిర్దేశిత గడువులోగా పూర్తి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రూ.240 కోట్లతో మడకశిర బైసాస్‌ కెనాల్‌ నిర్మాణ పనులకు టెండర్లు పిలిచింది. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయి.

ఏడీబీ నిధులివ్వట్లేదని ఏడుపు రాతలు
ఈనాడు: రాష్ట్ర ప్రభుత్వం 11 శాతం వాటా చెల్లించేందుకు సమ్మతిపత్రం ఇవ్వకపోవడం వల్లే రూ.513 కోట్ల ఏడీబీ నిధులతో చేపట్టిన కేసీ కెనాల్‌ సింప్‌ పథకం వెనక్కి వెళ్లిపోయింది.

వాస్తవం: ఏడీబీ ఆర్థిక సహకారంతో కేసీ కెనాల్‌ ఆధునికీకరణ పనులను ప్రభుత్వం చేపట్టింది. ఏడీబీ రుణానికి కేంద్ర జల్‌ శక్తి శాఖ ఆమోదం అవసరం. ఆ తరువాత ఏడీబీతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంటుంది. 
ఈ ప్రక్రియ సజావుగా సాగుతోంది. నాలుగు దశలలో నిధులను ఏడీబీ సర్దుబాటు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం 11 శాతం వాటా నిధులను ఇచ్చేందుకు సమ్మతిపత్రం ఇవ్వకపోవడం వల్ల ప్రాజెక్టు వెనక్కివెళ్లిపోయిందని మీరేమైనా కలగన్నారా రామోజీ? 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement